
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. మే నెలలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025 (ఎంపీసీ స్ట్రీమ్)లో అర్హత సాధించి, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ ధ్రువపత్రాలు అవసరమంటే..
ఏపీఈఏపీసెట్–2025 వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన ధ్రువపత్రాల జాబితాను నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. ఏపీఈఏపీసెట్–2025 ర్యాంక్ కార్డ్, హాల్ టిక్కెట్, ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం/టెన్త్ సర్టిఫికెట్, టీసీ, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, 2025–26 సంవత్సరపు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రైవేటు విద్యార్థులకు రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు, శారీరక వైకల్యం గల విద్యార్థులకు సంబంధిత ధ్రువీకరణ పత్రం అవసరం అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుతో మొదలు
ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సెట్స్.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏపీఈఏపీసెట్ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
● రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును ఇదే వెబ్‌సైట్‌లో క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఏపీఈఏపీసెట్ డీటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్‌లో పొందుపర్చారు.
దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్ల పరిశీలన
ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్‌లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసే సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వెబ్ బేస్డ్ విధానంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ‘రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి’ అనే చోట క్లిక్ చేయాలి. తద్వారా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తయిన విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్‌పై కేండెట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్‌సైజింగ్ ఆప్షన్స్ అని కనిపిస్తే, విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధం కావచ్చు. ఈ విధంగా కాకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హెల్ప్‌లైన్ కేంద్రంలో పురోగతిలో ఉన్న పక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది.
సమీప కేంద్రం ఎంపిక ఇలా..
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలు అసంపూర్తిగా ఉండటం, వివరాలు అసమగ్రంగా ఉన్న పరిస్థితుల్లో కాంటాక్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ (హెచ్‌ఎల్‌సీ) అని డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్‌ప్లే అయితే ఆన్‌లైన్‌లో పొందుపర్చిన హెల్ప్‌లైన్ కేంద్రాల జాబితా నుంచి తమకు సమీపంలోని కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించి అసమగ్రంగా ఉన్న సర్టిఫికెట్ల వివరాలు ప్రత్యక్షమవుతాయి. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్థులు తిరిగి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తరువాత హెచ్‌సీఎల్‌లో అధికారులు వాటిని పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
నేటి నుంచి ఏపీఈఏపీసెట్–2025 కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి 17 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల వారీగా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన 13 నుంచి 18వ తేదీ వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు
హెల్ప్‌లైన్ కేంద్రాలు ఇక్కడున్నాయి..
గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 17వ వరకు పరిశీలిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు ఈ నెల 19న తుది అవకాశం ఉండగా, ఈ నెల 22న సీట్ల కేటాయింపు జరుపుతారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కళాశాలల్లో చేరికలు, ఆగస్టు 4వ తేదీ నుంచి బీటెక్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..

ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..

ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..