‘డొంక’ తిరుగుడు లేకుండా | - | Sakshi
Sakshi News home page

‘డొంక’ తిరుగుడు లేకుండా

Jul 6 2025 7:04 AM | Updated on Jul 6 2025 7:04 AM

‘డొంక

‘డొంక’ తిరుగుడు లేకుండా

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు దారి కోసం ఎమ్మెల్యే సోదరుడి దందా

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మా వెంచర్లకు రోడ్డు వేసుకుంటాం.. డొంక రోడ్డును ప్రభుత్వ రేటుకు ఇచ్చేయండని’ కూటమి ఎమ్మెల్యే సోదరుడు ప్రతిపాదన పెట్టడం ఆలస్యం చిన్నబాబు అంగీకారం తెలపడంతో ఆ భూమికి రెక్కలొచ్చేశాయి. ఆగమేఘాలపై ఫైలు కదిలింది. తమ పొలాలకు దారి ఉండదని రైతులు అభ్యంతరం చెబుతున్నా రూ. 10 కోట్ల విలువైన భూమిని రూ. 2 కోట్లకే అప్పగించడానికి రంగం సిద్ధమైంది. దీనిపై అభ్యంతరాలు తెలపాలంటూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో నోటీసులు కూడా అంటించారు.

పొలాల దారి మూసేసి..

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైల్వే ట్రాక్‌, ఐఓసీ వెనుక ఉన్న 99 ఎకరాల భూమిని 36 మంది రైతులు సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఇక్కడ గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణానికి 33 మంది రైతుల నుంచి 94 ఎకరాలను సేకరించారు. ఈ వెంచర్‌ కోసం రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్డు తీసుకోవడానికి ఎమ్మెల్యే సోదరుడు సిద్ధమయ్యారు. సర్వే నంబర్‌ 255, 275/1ఏ, 302, 316–1లోని 2.04 ఎకరాల డొంక రోడ్డు భూమిని తమకు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఎల్‌ ఆకారంలో ఉండే ఈ డొంక రోడ్డు ఒక భాగం పంట పొల్లాలోకి వెళ్తుంది. మరో భాగంలో తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మురుగు నీరు పోయేందుకు కాలువ ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్కెట్‌ విలువ రూ. 10 కోట్లు ఉండగా, ప్రభుత్వ రికార్డుల్లో ధర రూ.2 కోట్లకు ఎమ్మెల్యే సోదరుడు కోరడం, చినబాబు అండతో ఆ ఫైలు చకచకా కదలడం జరిగిపోయాయి.

అభ్యంతరాలు వింటేగా...

డొంక రోడ్డు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అభ్యంతరాలు ఉంటే తెలపాలని తహసీల్దార్‌ పేపరు ప్రకటన ఇచ్చారు. ఎంటీఎంసీ కార్యాలయం, తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం, వార్డు సచివాలయంలోని బోర్డుల్లో కూడా ఈ నోటీసులు పెట్టారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. డొంక రోడ్డు వెంచర్లకు ఇస్తే తమ పొలాలకు దారి ఉండదని చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌కు ఆవల ఉన్న 55 ఎకరాలకు ఇదే దారి. వీటిని వివరిస్తూ, తమ అభ్యంతరాలతో పలువురు రైతులు జిల్లా కలెక్టర్‌, జేసీ, తాడేపల్లి తహసీల్దార్‌, ఎంటీఎంసీ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈలోగా ఎమ్మెల్యే సోదరుడు రోడ్డు పనులు వేగంగా చేసుకుపోతున్నారు. మిమ్మల్ని రైల్వే అధికారులు వెళ్లనివ్వడం లేదు కదా.. ఇక మీకు ఈ దారి ఎందుకు అంటూ ఎమ్మెల్యే సోదరుడు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికార పార్టీ వారైనందున తాడేపల్లి రెవెన్యూ అధికారులను మేనేజ్‌ చేశారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వానికి ప్రతిపాదించిన కూటమి ఎమ్మెల్యే బంధువు సర్కారు పెద్దల ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన ఫైలు రూ.10 కోట్ల భూమి రూ.2 కోట్లకే అప్పగింత! తమకు దారి లేకుండా చేస్తున్నారని రైతుల ఆందోళన డ్రైనేజీని సైతం పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

డ్రైనేజీని కూడా కలిపేస్తారా?

తాడేపల్లి తహసీల్దార్‌ డొంక రోడ్డులో ఒక వైపు మాత్రమే ఉన్న రెండెకరాలను ఎమ్మెల్యే సోదరుడికి అతి తక్కువ ధరకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా 20 అడుగుల వెడల్పు డొంక, 10 అడుగుల వెడల్పు ఉన్న డ్రైనేజీని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ డ్రైనేజీని మూసేస్తే తాడేపల్లి పట్టణం సలాం హోటల్‌ సెంటర్‌, ముగ్గురోడ్డు, పోలకంపాడు నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు బయటకు వెళ్లదని పేర్కొంటున్నారు. ఇది తాడేపల్లికి ప్రమాదకరమని రైతులు అంటున్నారు. అయినా.. చినబాబు, ఎమ్మెల్యే అండదండలు, అధికారుల దన్నుతో డొంక రోడ్డును వెంచర్‌ రోడ్డుగా మార్చడానికి రంగం సిద్ధమై పోయింది.

‘డొంక’ తిరుగుడు లేకుండా 1
1/2

‘డొంక’ తిరుగుడు లేకుండా

‘డొంక’ తిరుగుడు లేకుండా 2
2/2

‘డొంక’ తిరుగుడు లేకుండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement