
సుప్రీం ఆదేశాలను అమలుచేయాలి
కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ నాగరాజన్ వినూత్న ప్రచారం
తెనాలి: మహాత్మా గాంధీజీ ఆదర్శంగా ఆయన సూత్రాలను ప్రచారం చేస్తున్న పట్టణానికి చెందిన గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గాంధీ నాగరాజన్ సోమవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. గాంధీ వస్త్రధారణతో కళ్లకు గంతలు కట్టుకుని, పోలీస్ సంస్కరణలపై సుప్రీం తీర్పుకు సంబంధించిన అంశాలను ప్రచారం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసు సంస్కరణలపై ఐపీఎస్ అధికారి ప్రకాష్‌సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పోలీస్ వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం పెంచటానికి జారీ చేసిన ఏడు ముఖ్యమైన ఆదేశాలను గాంధీ నాగరాజన్ ప్రస్తావించారు. పోలీస్ విధులను రాజకీయ జోక్యం నుంచి రక్షించడానికి, పోలీసులకు మార్గదర్శకత్వం వహించడానికి రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు ఆయన కోరారు. ఎస్పీ, డీజీపీలకు రెండేళ్ల పదవీ కాలం నిర్ణయించాలని, పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విన్నవించారు. పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ ఏర్పాటు, దర్యాప్తు, శాంతిభద్రతల విభజన వంటి అంశాలను అమల్లోకి తీసుకురావాలని ఆయన కోరారు.
ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య లింగరాజు
ఏఎన్‌యూ: డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా యూనివర్సిటీ సైన్స్ ఫిజిక్స్ విభాగాధిపతి సీహెచ్. లింగరాజు నియమితులయ్యారు. వీసీ కె. గంగాధరరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జి. సింహాచలం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమితులైన లింగరాజుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు వంద శాతం ప్లేస్‌మెంట్స్ కల్పన, నైపుణ్య లక్షణాల పెంపొందింపు లక్ష్యంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు.