పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
గుంటూరు మెడికల్: పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని పోలీసుల తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద నెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలో చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడిని శుక్రవారం రాత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. లక్ష్మీ నారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో అంబటి మాట్లాడుతూ
తమ పార్టీ గ్రామ నాయకుడు లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారని తెలిపారు. ఆరు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు వీడియోలో వెల్లడించారన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ తనను పిలిపించి వార్నింగ్ ఇచ్చారని వీడియో వాపోయినట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఇది ధర్మం కాదని, లక్ష్మీనారాయణ ప్రాణాలకు ఏమైనా అయితే ఆయన కుటుంబం ఏమీ కావాలని అంబటి ప్రశ్నించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త లక్ష్మీనారాయణకు పరామర్శ


