ఏదీ.. ఆనీటి వైభవం ! | - | Sakshi
Sakshi News home page

ఏదీ.. ఆనీటి వైభవం !

May 20 2025 1:17 AM | Updated on May 20 2025 1:17 AM

ఏదీ..

ఏదీ.. ఆనీటి వైభవం !

తాడేపల్లి రూరల్‌: రెండు రాష్ట్రాల మధ్య ప్రముఖ జల రవాణా మార్గమైన బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. వేల ఎకరాల కాలువ భూములు ఆక్రమణల చెరలో ఉండటంతో రూపురేఖలను కోల్పోయింది. కెనాల్‌ మొత్తం పొడవు 427 కిలోమీటర్లు. కృష్ణా, గోదావరి డెల్టాలను కలుపుతూ ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల సముద్రానికి మూడు మైళ్లు, ఎక్కువ భాగం అర కిలోమీటరు దూరంలోనూ ఉండడం విశేషం. కొంత భాగం పులికాట్‌ సరస్సు పరిధిలో ఉంది.

ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ

బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. 1806లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి కో క్రైన్స్‌ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. దీంతో కొంతకాలం ఆయన పేరు మీదే కోక్రైన్స్‌ కెనాల్‌ అని పిలిచేవారు. లీజుకు తీసుకున్న ఆయన ఓడల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. 1837లో బ్రిటిష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి గవర్నర్‌ డ్యూక్‌ బకింగ్‌హామ్‌ పర్యవేక్షణలో కాలువ పనులు జరగడంతో ఆ పేరు వచ్చింది. బంగాళాఖాతం తీరానికి కిలోమీటరు దూరంలో, ఆంధ్రాలోని కాకినాడ నుంచి, చైన్నెలోని విల్లుపురం వరకు కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆంధ్రప్రదేశ్‌లో 262 కి.మీ., తమిళనాడులో 165 కి.మీ. పొడవు ఉంది.

ప్రధాన జల రవాణా మార్గం

బకింగ్‌ హామ్‌ కాలువ బ్రిటిష్‌ వారి హయాంలో ఒక వెలుగు వెలిగింది. ఈ మార్గంలో రైల్వేలైన్‌ ఏర్పాటు చేయక ముందు ఇదే ప్రధాన జల రవాణాగా ఉంది. కాకినాడ నుంచి చైన్నె వరకు ఉన్న కాలువల్లో ఇది ఒకటి. గోదావరి జిల్లాలో కాకినాడ కాలువ, కృష్ణా జిల్లాలో ఏలూరు కాలువ, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల నుంచి బాపట్ల జిల్లా పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువగా దీన్ని పిలుస్తారు. పెదగంజాం నుంచి ఒంగోలు, కొత్తపట్నం మీదుగా చైన్నె వరకు బకింగ్‌హామ్‌ కెనాల్‌గా పిలుస్తారు.

దుగ్గిరాల లాకుల వద్ద చీలిక

1855లో కృష్ణా బ్యారేజ్‌ని నిర్మించిన తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తయింది. విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజ్‌ వద్ద నుంచి కుడి ప్రధాన కాలువ దుగ్గిరాల లాకుల వద్ద రెండుగా చీలుతుంది. వాటిలో ఒక కొమ్మమూరు కాలువ కాగా, రెండవది నిజాంపట్నం కాలువ. దుగ్గిరాల లాకుల వద్ద మొదలైన కొమ్మమూరు కాలువ సంగం జాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల, నర్సాయపాలెం, కారంచేడు, సంతరావూరుల మీదుగా పెదగంజాంవద్ద వరకు ఉంది. పెదగంజాం వద్ద ఇది బకింగ్‌హామ్‌ కాలువతో కలుస్తుంది. కొమ్మమూరు కాలువ మంచినీటితో కూడిన పంట కాలువ కాగా, బకింగ్‌ హామ్‌ కాలువ ఉప్పునీటి కాలువ. అప్పట్లో కాలువపై రవాణాకు అనుగుణంగా కాకినాడ నుంచి చైన్నె వరకు పలు చోట్ల లాకులను నిర్మించారు. వీటిని 150 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల చాంబర్లతో ఏర్పాటు చేశారు.

జాతీయ జలమార్గం–4గా కేంద్రం ప్రతిపాదన

జల రవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వజీరాబాదు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న కృష్ణానది, భద్రాచలం వద్ద నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న గోదావరి, కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కృష్ణా కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హామ్‌ కాలువలన్నింటినీ కలిపి జాతీయ జలమార్గం–4గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలను కలిపే 1,095 కిలోమీటర్ల పొడవైన దీన్ని జాతీయ జలమార్గం–4గా ప్రకటించారు. జాతీయ జలమార్గాల బిల్లు ద్వారా 2008 నవంబర్‌లో దీన్ని జాతీయ జలమార్గంగా ప్రకటించారు. అప్పట్లో 2013 నాటికి పూర్తి చేయాలని తలపెట్టారు. కానీ నేటికీ జాతీయ జలమార్గం–4 ఊసే లేకపోయింది.

పలుచోట్ల ఆక్రమణల చెరలో కాలువ భూములు

అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంలో జల రవాణా మార్గం

ప్రతిపాదనలను పక్కన పెట్టిన కేంద్రం

పూడికతీతకు నోచుకోని బకింగ్‌ హామ్‌ కెనాల్‌

బ్రిటిష్‌ వారి హయాంలో బకింగ్‌హామ్‌ కెనాల్‌ ఒక వెలుగు వెలిగింది. ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఉపయోగంలో లేకుండా పోయింది. దక్షిణ భారతావని 1876, 1878లో కరువు కోరల్లో చిక్కుకున్న సమయంలో ఆహార ధాన్యాల తరలింపులో కీలకపాత్ర పోషించింది. 1880 నుంచి 1940 వరకు అతి తక్కువ ఖర్చులో ప్రజల, సరుకుల రవాణా సౌకర్యానికి ఉపయోగపడింది. స్వాతంత్య్రానంతరం 1947 నుంచి దీన్ని ఉపయోగించడం తగ్గింది. అప్పటికి రైల్వే లైన్‌ అందుబాటులోకి రావడంతో ఈ కాలువ ద్వారా రవాణా నిలిచిపోయింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న కొమ్మమూరు కాలువ ద్వారా పడవల రవాణా నిలిచిపోయినప్పటకీ సాగు, తాగునీటి కాలువగా ఉంది. పెదగంజాం నుంచి పిలువబడే బకింగ్‌హామ్‌ కాలువ ఉప్పునీటితో ఉంటుంది. జల రవాణా నిలిచిపోవడంతో భారీగా ఆక్రమణలకు గురైంది. కొన్ని చోట్ల రూపురేఖలను కోల్పోయింది. వేల ఎకరాల కాలువ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీన్ని జల రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంలో సరుకులు రవాణా చెయ్యవచ్చు. పర్యాటకంగా కూడా కాలువ ఆకర్షణీయ మార్గంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బకింగ్‌హామ్‌ కెనాల్‌ను జల రవాణా మార్గంగా అభివృద్ధి చేసే చర్యలు చేపట్టాల్సి ఉంది. కెనాల్‌ వద్ద ఏర్పాటు చేసిన గేట్లు సైతం తుప్పు పట్టి శిథిలావస్థ కు చేరుకుంటున్నాయి.

ఏదీ.. ఆనీటి వైభవం ! 1
1/2

ఏదీ.. ఆనీటి వైభవం !

ఏదీ.. ఆనీటి వైభవం ! 2
2/2

ఏదీ.. ఆనీటి వైభవం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement