
ఎండీయూ వాహనదారులను కాపాడాలని వినతి
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డామని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్ల్లను ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమకు ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామయ్య, కోశాధికారి కె.డాని, నాయకులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎం కార్యాలయంలో
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా సిబ్బందితో డీఆర్‌ఎం కార్యాలయ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్‌ఎం సుధేష్ఠసేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామన్నారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
పెదకాకాని: స్థానిక భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి పెదకాకాని గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్‌దేవ్ రూ.1,00,116 అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం, వుయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం వరుణ్ దేవ్ ఈ మొత్తంతోపాటు వెండి బిందె, గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు.
అమ్మవారి హుండీ
కానుకల లెక్కింపు
దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. అమ్మవారికి హుండీ కానుకల ద్వారా రూ. 31,30,423 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో
స్వామి వారి కల్యాణం
మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం ఘనంగా జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రాని పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదం అందించారు.

ఎండీయూ వాహనదారులను కాపాడాలని వినతి

ఎండీయూ వాహనదారులను కాపాడాలని వినతి