
రేషను బండి పైనా కూటమి కక్ష!
గుంటూరు వెస్ట్: గత ప్రభుత్వ హయాంలో ప్రజాదరణ పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేయడమే కూటమి నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఎంత మంది సిబ్బంది రోడ్డున పడుతున్నా పాలకులకు ఏమాత్రం పట్టడం లేదు. నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపాల్సిన ప్రభుత్వం ఉన్న వాటిని కూడా దూరం చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే అద్భుత వ్యవస్థ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్) వాహనాలను రద్దు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రేషన్ మాఫియా దందాకు అధిక శాతం కూటమి నేతలే నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసి కూడా నిందలన్నీ ఎండీయూ వాహనదారులపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నాయకులు వాపోతున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎండీయూ వాహనాల కాంట్రాక్ట్ 2027 వరకు ఉందని, ఇంతలోనే ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలో వెయ్యి మంది...
రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహన వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టారు. రేషన్ దుకాణం నుంచి సరకులు తీసుకుని ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ప్రారంభమైన ఈ వ్యవస్థ.. సిబ్బంది పనితీరుతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. జిల్లాలో 972 రేషన్ దుకాణాల నుంచి 353 వాహనాల ద్వారా బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరకులను 5,99,511 మంది రేషన్ కార్డుదారులకు నెల ప్రారంభం నుంచి సుమారు 17వ తేదీ వరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క ఎండీయూ వాహనానికి మూడు రేషన్ దుకాణాలు కేటాయించారు. ఈ మూడింటి పరిధిలో 6 వేల నుంచి 9 వేల వరకు రేషన్ కార్డులు ఉంటాయి. ఈ క్రమంలో కొందరు ఎండీయూ వాహనదారులు తప్పులు కూడా చేసేవారు. పౌరసరఫరాల శాఖాధికారులు తనిఖీలు చేసి వారిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.
ఖర్చులు పెరిగినా..
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి రూ.21 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిలో వాహన కిస్తీకి రూ.3 వేలు కట్ చేసి రూ.18 వేలు ఇచ్చేది. ఇందులోనూ ఇంధనం ఖర్చు, రిపేర్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ జీతం, ముఠా కూలీల ఖర్చు, బండి ఇన్సూరెన్స్ వంటి వాటిని ఆ వాహనదారుడే చూసుకోవాలి. ఉపాధితోపాటు సేవ కూడా మిళితం కావడంతో చాలామంది ఎండీయూ వాహనదారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు.
కుంటి సాకులతో సిబ్బంది, పేదలపై కక్ష తీర్చుకుంటున్న సర్కారు
కూలీనాలీ చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడిన వ్యవస్థ ఎండీయూ వాహనాల రద్దుతో తప్పని అవస్థ పాలకుల తీరుతో రోడ్డున పడ్డ సిబ్బంది రేషన్ బియ్యం అక్రమ దందా కూటమి నేతలది కాదా? అసలైన వారిని వదిలిపెట్టి అమాయకులపై కుట్రతో నిర్ణయం సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్న కూటమి సర్కార్
ప్రాణాలకు సైతం తెగించి...
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటింటికీ రేషన్ డెలివరీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కృష్ణా జిల్లాలో వచ్చిన వరదలకు సుమారు 10 రోజులపాటు అక్కడే ఉండి వాహనాల ద్వారా బాధితులకు ఆహారం తదితరాలు అందించారు. వరద నిధికి తమ జీతంలో 10 శాతం మొత్తం విరాళంగా ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా 100 ఎండీయూ వాహనాల ద్వారా ఆహార పంపిణీ చేయించారు. అంగన్‌వాడీ, ఐసీడీఎస్‌లకు బియ్యం సరఫరా కార్యక్రమం కూడా వీళ్లే అదనంగా చేస్తున్నారు.

రేషను బండి పైనా కూటమి కక్ష!