
భవన నిర్మాణ అనుమతులపై అపోహలు వీడండి
టౌన్ ప్లానింగ్ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్
తెనాలి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన భవన నిర్మాణాల అనుమతులపై అనేక అపోహలున్నాయని, వాటిని వీడాలని టౌన్ ప్లానింగ్ విభాగ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పట్టణ పరిధిలోని పలు సచివాలయాలను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన నూతన నిబంధనల వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. లైసెన్స్ సర్వేయర్లు కొందరు దీనిపై అపోహలు సృష్టించారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో అన్ని చోట్లా ప్లాన్‌ల దరఖాస్తు ప్రక్రియ నిలచిపోయిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని పట్టణాల్లో ఫ్లెక్సీలు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనధికార కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జేపీ రెడ్డి, తెనాలి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శివన్నారాయణ, వాణి, టీపీవో సాంబశివరావు పాల్గొన్నారు.