తొండపి(ముప్పాళ్ళ): మండలంలోని తొండపి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ, ఫ్యాక్షన్ నేపఽథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గృహాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటిని, దుకాణాలను సోదాలు చేశారు. పలు ఇళ్లలో మారణాయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
గ్రామంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు తమ దృిష్టి వచ్చిందని, అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 60 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎటువంటి పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు, ముప్పాళ్ల ఎస్‌ఐ వి.సోమేశ్వరరావు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సీ మహిళలకు ఉచితంగా కుట్టు, కంప్యూటర్ శిక్షణ
నరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఎస్సీ మహిళలకు మూడు నెలల పాటు ఉచితంగా కుట్టు, కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ), ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రంలో ఈ తరగతులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ సామాజిక మహిళలు ఆధార్, కుల ధ్రువీకరణ, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ లింక్ మొబైల్ ఫోన్‌తో ఎన్‌ఏసీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9394102075, 9985496190 నెంబర్లులో సంప్రదించాలని తెలిపారు.
రెంటాలలో 22 గేదెల దొంగతనం
రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామంలో 22 గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామంలోని కటికల సంసోన్, పేరుపోగు ఇస్రాయేల్, కటికల యేసయ్య, చిలక మరియమ్మలకు చెందిన 22 గేదెలు ఏప్రిల్ 26న మేత కోసం పొలం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కల గ్రామాలలో గాలించినా కనిపించపోవడంతో, ఎవరైనా దొంగిలించి ఉంటారని నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన గేదెల విలువ సుమారు రూ. 3.90 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.ఽ
ధర్మకర్తల మండలికి దరఖాస్తు చేసుకోండి
రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్దనున్న అతి పురాతన శైవక్షేత్రమైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకం చేపడుతున్నామని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి కమిషనర్ దేవదాయశాఖ గొల్లపూడి విజయవాడ వారు నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు . పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 26 తేదీలోపు పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి నరసరావుపేట వారికి నేరుగా అందజేయాలని సూచించారు. దరఖాస్తుల కోసం దేవదాయ శాఖ సత్తెనపల్లి ఇన్స్‌పెక్టర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్