
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం
తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్‌ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ భాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు.