
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్‌కు ‘సాతి’ (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసు కోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు.