
అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎం.వి.చరణ్ తెలిపారు. బుధవారం స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన వెల్లలచెరువు వెంకట శివరామకృష్ణ బల్లికురవ మండలం, గుంటుపల్లి గ్రామంలో వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో దైవదర్శనానికి వెళ్లాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇంటివద్ద లభ్యమైన సీసీ పుటేజ్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, బందారం గ్రామానికి చెందిన దుద్దేలింగంగా గుర్తించామన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా అతనితో పాటు మరో ముగ్గురు చోరీ సొత్తును పంచుకుని విక్రయించేందుకు వెళుతూ రైల్వే స్టేషన్ వద్ద పట్టుబడ్డారని తెలిపారు. నలుగురి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో తొమ్మిది కేసులు నమోదు అవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌ఐ వంశీకృష్ణ, సిబ్బంది వీరాంజనేయులు, మురళికృష్ణలను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో
పదికి పైగా కేసులు
అతనికి సహకరించిన
మరో ముగ్గురు అరెస్టు
బంగారు ఆభరణాలు స్వాధీనం