
భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాతసేవ, స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన జరిపారు. స్వామివారు పెండ్లికుమారుని అలంకరణలో దర్శనమిచ్చారు. సాయంత్రం నాదస్వర కచేరీ, వేద పఠనం, అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహం, రుత్విగ్వరణం, అంకురారోపణం, హోమం, బలిహరణం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
భగీరథ మహర్షికి ఘననివాళి
గుంటూరు వెస్ట్: భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని భగీరథ మహర్షి కీర్తిని వివరించారు. నాయీ బ్రాహ్మణ సంక్షేమ, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్, బీసీ సంక్షేమ శాఖాధికారి కె.మయూరి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి షూటింగ్‌లో ముఖేష్‌కు రెండు స్వర్ణాలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన షూటర్ ముఖేష్ నేలవల్లి రెండు బంగారు పతకాలు సాధించాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న 23వ కుమార్ సరేంద్ర సింగ్ మెమోరియల్ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం జరిగిన పోటీలో 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. ఇదే పోటీల్లో గత శుక్రవారం కూడా 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్‌లోనూ ముఖేష్ బంగారు పతకం సాధించాడు.
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆది దంపతులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో అంతరాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోగా, మహా మండపం వైపు నుంచి వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే లిఫ్టులో అనుమతించారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తడిసి ముద్దయ్యారు..
ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు వర్షంతో తడిసి ముద్దయ్యారు.
ఘాట్‌రోడ్డు మూసివేత..
ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ వర్షం కురవడంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కొండ రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్‌రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు.

భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం