తెనాలిలో వడగండ్ల వాన
తెనాలిఅర్బన్/తెనాలిటౌన్ : తెనాలిలో వడగడ్ల వాన కురిసింది. సుమారు గంటపాటు ఈదురుగాలలతో కూడిన వర్షం పడింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొద్ది రోజులుగా తెనాలి పట్టణంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి ఉక్కపోత, వేసవి తీవ్రతతో ప్రజలు అల్లాడారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. భారీ వర్షం కురిసింది. వడగండ్లు పడ్డాయి. వీటికి ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు ఆందోళన చెందారు. పినపాడు, పాండురంగపేట, మారీసుపేట, చంద్రబాబునాయుడు కాలనీ, చినరావూరు తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. అవి రోడ్లకు అడ్డంగా పడటంతో రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోడ్లకు అడ్డంగా కూలిన వృక్షాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. పినపాడు చెరువు సమీపంలో నివసించే షేక్ నాగూర్‌వలీ రేకుల షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది. ముందే ప్రమాదాన్ని గుర్తించిన నాగూర్‌వలీ కుటుంబ సభ్యులు పక్క ఇంటికి వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
వర్షానికి పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. డీఈఈ బోరుగడ్డ ఆశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.
ఫిరంగిపురంలో..
ఫిరంగపురం: మండలకేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. పలు ప్రాంతాల్లో నీరు పొంగిపొర్లింది.
గంటపాటు ఈదురుగాలులతో
కూడిన వర్షం
పలుచోట్ల కూలిన చెట్లు
పినపాడులో ఎగిరిపోయిన ఇంటిపైకప్పు
వెంటనే స్పందించిన
మున్సిపల్ కమిషనర్
రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగింపు
తెనాలిలో వడగండ్ల వాన
తెనాలిలో వడగండ్ల వాన


