గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం

Mar 24 2025 2:34 AM | Updated on Mar 24 2025 2:33 AM

కొద్ది రోజుల కిందట ముగిసిన ఐసీసీ టోర్నీ, తాజాగా ప్రారంభమైన ఐపీఎల్‌ నేపథ్యంలో నరసరావుపేట కేంద్రంగా బెట్టింగ్‌ భూతం జడలు విప్పింది. దీనికి అభం శుభం తెలియని ఎందరో అభాగ్యుల ప్రాణాలు అర్ధంతరంగా ఆరిపోతున్నాయి. అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం ముందుగానే పెవిలియన్‌ చేరడంతో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా బెట్టింగ్‌ సాగుతోంది. ఇప్పటికే ఎందరో అమాయకులు బెట్టింగ్‌ భూతానికి ఆహుతి అయ్యారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో జీవితాలు బలి కాకముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నరసరావుపేట టౌన్‌: కాయ్‌ రాజా కాయ్‌ అంటూ ఊరిస్తోన్న బెట్టింగ్‌ భూతానికి అమాయకులు బలవుతున్నారు. ఒకటికి పది రెట్లు అంటూ ఆశలు కల్పించడంతో ఆ వలలో చిక్కుకుని బయటికి రాలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఓ యువకుడు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి నాలుగు నెలల కిందట నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన మహిళతో వివాహమైంది. గతంలో సాఫ్ట్‌వేర్‌ గా పనిచేసిన ఆ యువకుడు ఉద్యోగం మానేసి స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం బెట్టింగ్‌ యాప్‌లకు బానిసయ్యాడు. దీంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందిన విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తొలుత పని ఒత్తిడితో కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.

తీగలాగితే కదిలిన బెట్టింగ్‌ డొంక

యువకుడి ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులకు దర్యాప్తులో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం వెలుగుచూసింది. మృతుడి సెల్‌ఫోన్‌, లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని అందులోని డేటా విశ్లేషించారు. కొంతమందికి మృతుడు తాను క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయానని, సమయం ఇస్తే తిరిగి చెల్లిస్తానని ప్రాథేయపడుతూ పంపిన సందేశాలు గుర్తించారు. దీంతో బెట్టింగ్‌ ఊబిలో దిగి ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగుతోంది.

ఐపీఎల్‌ నేపథ్యంలో జోరందుకున్న బెట్టింగ్‌లు అశల వలలో చిక్కుకుంటున్న యువత డబ్బులు పోగొట్టుకుని నవ వరుడు ఆత్మహత్య విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం ఆత్మహత్య చేసుకునేందుకు మరో యువకుడు ఇంటి నుంచి పరారీ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా రక్షించిన పోలీసులు బెట్టింగ్‌ అరికటడ్డంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్న పోలీసులు

పోలీసులు విఫలం

బెట్టింగ్‌ ఈ స్టాయిలో జడలువిప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా, అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బెట్టింగ్‌ చాపకింద నీరులా విస్తరించింది. ఏ ఇతర జిల్లాలో లేనంతమంది క్రికెట్‌ బకీలు పట్టణంలో ఉండటం గమరార్హం. పోలీసులు పట్టించుకోకపోవడంతో జడలు విచ్చుతోంది. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు వచ్చిన కొన్నే. జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి కూకటి వేళ్లతో పెకలించకపోతే ప్రస్తుత ఐపీఎల్‌లో మరెన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి.

ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో యువకుడు

పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నాడు. అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లో డబ్బులు పందెం కట్టాడు. అవి పోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో విషయం తెలియజేసి తనకు డబ్బులు కావాలని కోరాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా అతన్ని గుర్తించి ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. విచారణలో క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆ యువకుడు తెలిపాడు.

రెండు నెలల కిందట గురజాల నియోజకవర్గానికి చెందిన ఓ సచివాలయ ఉద్యోగి సామాజిక పింఛన్‌ డబ్బులు తీసుకుని బెట్టింగ్‌ యాప్‌లో పెట్టాడు. తెల్లవారేసరికి అధిక మొత్తం అవుతాయని ఆశకు పోయి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒకటో తేదీ ఉదయం నగదు పంచకుండా అదృశ్యమయ్యాడు. అనంతరం ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తానని, ఉద్యోగం ఇస్తేనే తమ భార్యాపిల్లలు బతికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇలా బెట్టింగ్‌ వ్యసనానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం 1
1/1

గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement