
శిబిరాన్ని పరిశీలిస్తున్న ముస్తాఫా, వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, సజిల, కీర్తి
నెహ్రూనగర్ (గుంటూరు తూర్పు): ఉద్యోగులు, కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజం, అభివృద్ధి సాధ్యపడుతుందని, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు గుంటూరు నగరపాలక సంస్థ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర సురక్ష శివిర్‌లో భాగంగా పారిశుద్ధ్య, యూజీడీ కార్మికులకు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను నగర కమిషనర్ కీర్తి చేకూరి, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఉద్యోగులు ప్రభుత్వంలో కీలకమైన భాగమని, వారు ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సమర్ధవంతంగా అందుతాయన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో ముందుండే పారిశుద్ధ్య కార్మికులకు గుంటూరు నగరపాలక సంస్థ నిష్ణాతులైన వైద్యులతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవల జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగులకు సుమారు 8750 వైద్య పరీక్షలు చేపట్టడం జరిగిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారనికి ప్రతి నెల 3వ శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పేద బడుగులు ఉండే పారిశుద్ధ్య కార్మికులకు జీఎంసీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్మికులు ప్రతి ఒక్కరూ సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్య పరీక్షల ఫలితాల మేరకు తగిన చికిత్స అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు, ఆరోగ్య శ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ జయ రామకృష్ణ, డీటీసీఓ డాక్టర్ లక్ష్మా నాయక్ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు చర్యలు అభినందనీయం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి