YSR Jagananna Badugu Vikasam: Andhra Pradesh Govt Boosting MSMEs Full Details Inside - Sakshi
Sakshi News home page

YSR Jagananna Badugu Vikasam: చిన్నవే దేశ భవితకు పెద్ద దిక్కు

Published Fri, Apr 29 2022 12:56 PM

YSR Jagananna Badugu Vikasam: Andhra Pradesh Govt Boosting MSMEs - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ‘మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌లు’ (ఎంఎస్‌ఎంఈ లు) ఆర్థికాభివృద్ధిపరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజన్‌లాగా పని చేస్తున్నాయని ఆర్థికవేత్తలు గుర్తించారు. 140 కోట్ల మంది జనాభా గల మన దేశంలో పేదరికం పోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఆదాయ అసమానతలు తగ్గాలన్నా... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధితోనే సాధ్యం. అంతేగాక భారతదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే ఈ తరహా పరిశ్రమల అభివృద్ధి అత్యంత ఆవశ్యకం.

చైనాలో ఇంటింటికీ ఒక కుటీర పరిశ్రమ ఉండటం, చైనా ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవ్వడంలో అక్కడి ప్రభుత్వ పెద్దల నిబద్ధత ఎంతో ఉంది. అందుకే చైనా నేడు ప్రపంచ కర్మాగారంగా ఉంది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని మన దేశంలోలాగా చైనా పాలకులు అనుకోవడం లేదు.  చైనాలో స్థానికంగా పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి పరిచినందువలన అక్కడి పేదరికం పోయింది. దీనికి గాను ప్రజలకు రుణాల రూపంలో పెట్టుబడులు సమకూర్చడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం, పరిశ్రమలకు కావలసిన సాంకేతిక సామగ్రిని అందించడం, మార్కెట్లను చూపించడం లాంటి పనుల్లో ప్రభుత్వం ఒక వైపు, ప్రైవేట్‌ పారిశ్రామిక రంగం మరొకవైపు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

మన దేశం సంగతికొస్తే... ఈ ఎంఎస్‌ఎంఈల ద్వారా నేడు పారిశ్రామిక రంగంలో 97 శాతం ఉద్యోగ కల్పన జరుగుతున్నది. భారీ పరిశ్రమల ద్వారా కేవలం 3 శాతం మాత్రమే ఉద్యోగావకాశాలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 6.3 కోట్ల సంస్థలు ఎనిమిది వేల రకాల ఉత్పత్తులను చేస్తూ మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 30 శాతం వాటా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీటిని సంఘటితపరచి ఆర్థికపరమైన, సాంకేతికపరమైన సహాయం అందించి, సబ్సిడీలు కల్పిస్తే ఉపాధి కల్పనలో, ఆదాయాలు పెంపొందించడంలో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో వీటి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పరిచారు. అయితే వీటికి ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు అందడం లేదనే విమర్శ ఉంది. మన రాష్ట్రంలో 25.96 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వీటిలో 70.69 లక్షల మంది ఉద్యోగులున్నారు.

ఏపీలో గత ప్రభుత్వం నిరాదరణ వల్ల అనేక ఎంఎస్‌ఎంఈలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీనికి తోడు కోవిడ్‌ సంక్షోభం వాటిని మరింత కుంగదీసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘రీస్టార్ట్‌ ప్యాకేజీ’ని ప్రకటించింది. దీని కింద ఎంఎస్‌ఎంఈలకు గత ప్రభుత్వం బకాయి పడిన రాయితీలతో పాటు ప్రస్తుత రాయితీలు కూడా కలిపి రూ. 2,086 కోట్లు విడుదల చేసింది. (చదవండి: శ్రమ విలువ తెలుసు కాబట్టే...)

అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకా’న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 2020–21లో ఎంఎస్‌ఎమ్‌ఈలకు చెందిన ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ. 235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22 కాలంలో ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది. ఈ విధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు అందిస్తే... దేశం వాయువేగంతో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందనడంలో సందేహం లేదు. (చదవండి: వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!)

- ఎనుగొండ నాగరాజ నాయుడు 
రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement