వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!

Decentralization Results in Andhra Pradesh: Ayyagari Sitaratnam - Sakshi

ఎప్పుడూ ముందుతరం కన్నా తర్వాతి తరం తెలివిగా ముందంజ వేస్తుంది. శ్రీశ్రీ ‘నేను తిక్కన కన్నా గొప్పవాడిని– ఎందుకంటే నాలాగా తిక్కనకి వేమన తెలీదు, గురజాడ తెలీదు’ అన్నారు. అలాగే యువకులైన ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేజ్రీవాల్, ఆంధ్రలో జగన్‌ పాలనలో కొత్త సంస్కరణలు వేగంగా అమలు జరుపుతున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ బడులు తీర్చిదిద్దిన విధానం చక్కని ఉదాహరణ. కేంద్రీకృత విధానం అవలంబిస్తే అన్ని ప్రాంతాలకీ న్యాయం జరగదని భావించి, వికేంద్రీకరణకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని ముందుకు వెళుతోంది  జగన్‌ ప్రభుత్వం. వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయాలు, కొత్త జిల్లాలు, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాలు తీసుకుంది.

ఈరోజు సచివాలయాల వలన ఎంత సౌఖ్యంగా ప్రజలున్నారో మనకు తెలుసు. ఒక వాలంటీర్‌కు 50 కుటుంబాలను అప్పజెప్పడంతో వారు వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి  రేషన్‌ వచ్చిందనీ, వ్యాక్సిన్‌ వేయించుకోమనీ, పన్ను కట్టమనీ మెసేజ్‌లు ఇస్తున్నారు. ఇటు ఆ ప్రజలకి కూడా ఇంటి ముందు చెత్త ఉందనీ, పెన్షన్‌ రాలేదనీ వెంటనే అడిగే అవకాశం వచ్చింది. ఈ వ్యవస్థ వల్ల జవాబుదారీతనం పెరిగింది. ఉత్తమ మేనేజ్మెంట్‌కి ఉదాహరణగా... ఉద్యోగులకు ‘సేవా మిత్ర’, ‘సేవా రత్న’, ‘సేవా వజ్ర’ అవార్డులు ఇస్తున్నారు. నిజంగా దిగువ స్థాయి ఉద్యోగుల శ్రమని ఇంతలా గుర్తించిన ముఖ్యమంత్రులు నేటి దాకా ఎవరూ లేరనే చెప్పాలి. ఒకప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్‌ అంటే మంత్రులూ, వారి పీఏలూ వారి చుట్టూ ఊరి పెద్దలూ, కుల పెద్దలూ తిరుగాడుతుండేవారు. ఇప్పుడు ఆ దృశ్యాలు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికీ, ప్రజలకూ గ్యాప్‌ లేకుండా పాలన అందుతోంది. ఇది వికేంద్రీకరణ ఫలితమే.

ఇక నూతన జిల్లాల ఏర్పాటు విషయానికొస్తే... నిజానికి చిన్న జిల్లాల ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మన్యం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాలుగా విభజించడం వలన అమాయక గిరిజన ప్రజలనూ, ఆ ప్రాంతాల్నీ అసాంఘిక శక్తుల బారిన పడకుండా మరింతగా రక్షించే అవకాశం వస్తుంది. దగ్గర్లోనే కలెక్టర్, ఎస్పీ, పోలీసు బలగం ఉన్నందువల్ల కచ్చితంగా ‘లా అండ్‌ ఆర్డర్‌’ అమలు జరుగుతుంది. 

ప్రస్తుత ప్రభుత్వానికి మూడు రాజధానులు అనే కొత్త ఆలోచన వచ్చినందుకు... ‘వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు’ అని వినీ వినీ విసిగి వేసారిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు కాస్త ఊరట కలిగింది. కర్నూలులో హైకోర్టు ఉంటే అవసరమున్నవారు కర్నూలు వెళ్తారు. అమరావతిలోనే హైకోర్టు కూడా ఉంటే అక్కడ హోటల్‌ సేవలు ఖరీదు అవుతాయి. ఆటోలు దొరకవు. ట్రాఫిక్‌ పెరిగి పోతుంది. దీనివల్ల జనసామాన్యానికి చాలా ఇబ్బంది. అవసరాన్ని బట్టి కర్నూలుకు కొంతమందీ, విశాఖకి కొంతమందీ వెళ్తే అక్కడ కూడా అనేక వ్యాపారాలు పెరుగుతాయి. ఉపాధి పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అన్ని ప్రాంతాల అభివృద్ధీ, అన్ని రకాల మనుషుల అభివృద్ధీ చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. (క్లిక్‌: ‘సోషల్‌ ల్యాబ్‌’ పని మొదలైంది)

ప్రభుత్వ పనుల్ని అడ్డుకోవడంలో భాగంగా ప్రతిపక్షాలు కృష్ణ, గుంటూరు జిల్లాల మీద లేని ప్రాంతీయ అభిమానం చూపిస్తూ... విశాఖ, కర్నూలు రాజదానులుగా పనికిరావు అంటే అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆనందం అభివృద్ధి వచ్చే విధంగా నూతన చట్టం తెచ్చి అయినా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేస్తారని ఆశిద్దాం. (క్లిక్‌: జగన్‌ స్కీములు చంద్రబాబుకు సవాలే!)
   

- డాక్టర్‌ అయ్యగారి సీతారత్నం 
తెలుగు ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top