తెలంగాణ ప్రభుత్వం పందొమ్మిది సెక్షన్లతో కూడిన ‘తెలంగాణ అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్–2026’ను ఇటీవల తెచ్చింది. న్యాయ వాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమే అయినప్పటికీ, ప్రస్తుత రూపంలో ఈ చట్టం వారి భద్రతకు అంతత మాత్రమే ఉపయోగపడుతుంది. ‘అడ్వొకేట్’ అనే పదానికి ఇచ్చిన నిర్వచనమే అసమానతతో కూడి ఉంది.
ప్రకరణ 2(1)(బి) ప్రకారం... అడ్వొ కేట్స్ యాక్ట్–1961 కింద ఇచ్చిన అర్థాన్నే ‘అడ్వొకేట్’ కలిగి ఉంటా రనీ, అలాగే వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనీ పేర్కొంది. ఇది సబబేనా? ఢిల్లీలో ఎన్ రోల్ అయి, అక్కడ ప్రాక్టీస్ చేసే ఒక న్యాయవాది, తన క్లయింట్‌తో కలిసి తెలంగాణలోని ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చారనుకుందాం. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లో ఆయనపై దాడి జరిగితే, ఈ చట్టం ఆయనకు రక్షణ కల్పించదు, ఎందుకంటే ఆయన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడం లేదు కనుక. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఒకే వర్గానికి చెందినవారు (అంటే న్యాయవాదుల) వారు ప్రాక్టీస్ చేసే రాష్ట్రాన్ని బట్టి వివక్ష చూపకూడదు. ముఖ్యంగా ప్రకరణ 1(2) ప్రకారం ఈ చట్టం మొత్తం తెలంగాణకు వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొన్నప్పుడు ఈ వివక్ష సరికాదు.
న్యాయవాది, వారి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా జరిగే చర్యలలో, ‘యాక్ట్ ఆఫ్ వయలెన్ ్స’గా ఏది పరిగణించబడుతుందో ఈ చట్టం నిర్వచిస్తుంది. ఎవరైనా అటువంటి హింసాత్మక చర్యకు పాల్పడినా, ప్రేరేపించినా లేదా కుట్ర పన్నినా వారికి కనీసం ఆరు నెలల నుండి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం నిబంధ నలు కలిగి ఉంది. ఈ కేసును డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి తగ్గని అధి కారి దర్యాప్తు చేయాలి; ఈ అధికారి ఎఫ్‌ఐఆర్ నమోదైన తేదీ నుండి అరవై రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. ఈ ట్రయల్‌ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చేపట్టాలి; వారు, నిందితుడు కోర్టుకు హాజరైన తేదీ నుండి ఆరు నెలల లోపు దీనిని పూర్తి చేయాలి.
పైకి చూసేటప్పుడు బాధితుడైన న్యాయవాదికి ఆరు నెలల అరవై రోజుల్లోగా న్యాయం జరుగుతుందని అనిపించవచ్చు. వాస్త వానికి అది జరగదు. ఒక చట్టం నిర్దేశిత కాల పరిమితులను పాటించనందుకు ఎటువంటి పర్యవసానాలను సూచించనప్పుడు, అందు లోని ‘షల్’ అనే ఆంగ్ల పదాన్ని ‘మే’ గానే అర్థం చేసుకుంటారు.
ఇంకా, ఈ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నందున, ఇది ఒక వారెంట్ కేసు అవుతుంది. అంటే, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత– 2023 (బి.ఎన్.ఎస్.ఎస్.– 2023) కింద పేర్కొన్న సంక్లిష్టమైన న్యాయ విచారణ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరు నెలల గడువులోగా విచారణ పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. దీనికి బదులుగా, ఈ చట్టం కింద వచ్చే కేసులనే ప్రత్యేకంగా డీల్ చేయడానికి ఒక మేజిస్ట్రేట్‌తో కూడిన ‘ప్రత్యేక న్యాయస్థానాన్ని’ ఏర్పాటు చేసి ఉండాల్సింది.
న్యాయవాదులకు కొత్త రక్షణ ఏమీ లేదు! పోలీస్ అధికారి ఒక ‘అడ్వొకేట్’ను కేవలం బిఎన్‌ఎస్‌ఎస్‌లోని ప్రకరణలు 35 నుండి 62 వరకు నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అరెస్ట్ చేయాలని సెక్షన్ 14 చెప్తుంది. బిఎన్‌ఎస్‌ఎస్–2023 కింద ఈ రక్షణ ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉంది. కాబట్టి న్యాయవాదు లను అక్రమ అరెస్టుల నుండి రక్షించడానికి ఈ చట్టం కొత్తగా చేకూర్చిన రక్షణ ఏమీ లేదు.
ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి, సరైన ‘జ్యుడీషియల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్’ లేదా సంబంధిత వర్గాలతో ముందస్తు సంప్రదింపులు లేకుండా, అప్పటికప్పుడు ‘తక్షణ ప్రతిస్పందన చట్టాలను’ తీసుకురావడం వల్ల ప్రయోజనం లేదు. అలా తీసుకువచ్చి, తర్వాత కోర్టులు సకాలంలో కేసులను తేల్చడం లేదనో, లేదా కోర్టుల ‘ఇంటర్‌ప్రిటేషన్’ వల్లే చట్టం ఉద్దేశం దెబ్బతింటుందనో నిందను న్యాయవ్యవస్థపైకి నెట్టేస్తున్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈసారి చట్టాల వ్యాఖ్యానంలో కోర్టులకు సహాయం చేసే అడ్వొకేట్లే– కేవలం ప్రజా నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం ఆడుతున్న ఇటువంటి చట్టాల నాటకంలో చిక్కుకుపోబోతున్నారు!
ఢిల్లీలో ఎన్‌రోల్ అయిన ఒక న్యాయవాది, తన క్లయింట్‌తో తెలంగాణలోని ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చారనుకుందాం. అక్కడ ఆయనపై దాడి జరిగితే, ఈ చట్టం ఆయనకు రక్షణ కల్పించదు.
– బాగ్లేకర్ ఆకాశ్ కుమార్, న్యాయవాది, తెలంగాణ హైకోర్టు akashbaglekar@gmail.com


