మన భుజాలపై వారి తుపాకులు!

Sudhindra Kulkarni Guest Column On Quad Alliance - Sakshi

చైనాతో ఏర్పడుతున్న వివాదాలను సమానత్వం, న్యాయం ప్రాతిపదికన పరిష్కరించుకోవడానికి బదులుగా భారతీయులమైన మనం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్‌ కూటమిలో చేరడాన్ని ఎంచుకున్నాము. సారాంశంలో చైనాకు వ్యతిరేకమైన ఈ క్వాడ్‌ కూటమి ఆసియా ఖండంలో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో భారీ వ్యయంతో కూడిన ఆయుధాల పరుగుపందెం కూడా మొదలైపోయింది. అసలు విషయం ఏమిటంటే, చైనాపైకి గురిపెట్టి కాల్చడానికి బయటివారు మన భుజాలమీద వారి తుపాకులు పెడుతుంటే మనం దానికి అనుమతించాల్సిందేనా? క్వాడ్, ఆకస్‌ లాంటి కూటములతో... మన సముద్రాలు త్వరలో ప్రాణాంతకమైన యుద్ధనౌకలకు, జలాంతర్గాములకు ఆటస్థలంగా మారనుండటం భారతీయులను, ఆసియా ప్రజలను కలవరపరుస్తోంది.

గురుదేవులు రవీంద్రనాథ్‌ టాగూర్‌ జీవించి ఉండి ఉంటే తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి ఉండేవారు. ఆసియా ఐక్యతకోసం అవిశ్రాంతంగా ప్రచారం చేసిన ఈ కవి, తత్వవేత్త ప్రస్తుతం ఆసియా ఖండంలో పేరుకుంటున్న అనైక్యతను, నిత్య ఘర్షణలను చూసి ఎంతగానో బాధపడి ఉండేవారు. ఆసియా ఖండాన్ని నిత్యం శత్రుత్వంతో రగిలించడానికి పాశ్చాత్య శక్తులు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలను చూసి టాగూర్‌ మనస్సు క్షోభతో కుమిలిపోయి ఉండేది. ఆసియా దేశాలను టాగూర్‌ సందర్శించినన్ని పర్యాయాలు మరే ఇతర భారతీయ నేతా పర్యటించలేదు. ఈ సందర్శనల ద్వారా టాగూర్‌ లక్ష్యం ఆసియన్‌ వివేచనను సృష్టించడమే.

1921లో ఆయన విశ్వభారతిని స్థాపించినప్పుడు, భారత్, ఇతర ఆసియా దేశాలను శతాబ్దాలుగా కలిపివుంచిన నాగరికతా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి నేతలు కూడా ఆసియన్‌ ఐక్యతపట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూవచ్చారు. ఆసియన్‌ వివేచన పట్ల గురుదేవుల స్వప్నాలు ఈరోజు బీటలు వారిపోయాయి. ఒకప్పుడు వలసవాద పాలనలో బలిపశువులుగా మారిన దేశాలు ఇప్పుడు ప్రవాహవేగంలో కొట్టుకుపోతున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసియా దేశాలు ఇప్పుడు శాంతికి దూరమవుతున్నాయి. పాశ్చాత్యదేశాలు ఆసియా ఖండంలో పరస్పరం తలపడే బృందాలను రూపొందిస్తూ నిత్య ఘర్షణలను రగిలిస్తున్నాయి.

ఆసియా ఖండంలో అంతర్గత ఘర్షణలు శాంతికి హాని చేస్తూ, పరస్పర సహకారంతో అందరూ లబ్ధి పొందే అవకాశాలకు తలుపులు మూసేశాయి. పశ్చిమాసియా ఇటీవలి కాలంలో అనేక యుద్ధాలను చూసింది. ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా దురాక్రమణ, సిరియాలో, యెమెన్‌లో కొనసాగుతున్న యుద్ధాలు వీటిలో కొన్ని. ఇక దక్షిణాసియాలో బయటిశక్తులు రగిలించిన యుద్ధాలు, సైనిక ఘర్షణల కారణంగా నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్‌ రక్తమోడుతూనే ఉంది. అమెరికా దళాలు ఇటీవలే ఆ దేశం నుంచి వైదొలిగిన తర్వాత కూడా అఫ్గానిస్తాన్‌ సుస్థిరత, జాతీయ పునర్నిర్మాణం విషయంలో భారత్, తదితర పొరుగు దేశాలు సహకారమందించే ప్రయత్నాలకు తావు లేకుండా పోయింది. ఒకవైపు తాలిబన్‌ మతోన్మాదవైఖరి, మరోవైపు భారత్‌–పాకిస్తాన్‌ మధ్య శత్రుత్వమే దీనికి కారణం. బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా భారత్, పాకిస్తాన్‌ దేశాలు తమ మధ్య సౌహార్ద సంబంధాలు నెలకొల్పుకోలేకపోతున్నాయి. నిరంతరం ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా సార్క్‌ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి) పూర్తిగా నిర్వీర్యమై కోమాలో ఉంటోంది.

దీంతో పోలిస్తే, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)ను ఏర్పర్చి ఆసియాలో పాశ్చాత్యేతర వేదికను చెల్లుబాటులోకి తీసుకురావడంలో చైనా ఒకమేరకు విజయం సాధించింది. భారత్, పాకిస్తాన్‌ రెండు దేశాలనూ పూర్తిస్థాయి సభ్యులుగా చేసుకోవడంలో ఎస్‌సీఓ సఫలమైంది.  దీంట్లో అఫ్గానిస్తాన్‌ కూడా పర్యవేక్షక ప్రతిపత్తిలో కొనసాగుతోంది. విషాదమేమిటంటే, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్‌ దేశాలతో కూడిన ప్రాంతీయ సహకార ప్రయత్నాలకు దూరంగా ఉంటున్న భారత్‌ ప్రస్తుతం కాబూల్‌లో శాంతి స్థాపన, సమీకృత ప్రభుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలనుంచి వైదొలిగింది. అదే సమయంలో తాలిబన్‌ పాలనలో ఉగ్రవాద సంస్థలకు అవకాశం ఇవ్వవద్దనే అంశంపై భారత్‌తో సహా ఈ అయిదు దేశాలకు పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు.

ఈ గొప్ప అవకాశంలో పాలుపంచుకోవడానికి బదులుగా, అఫ్గాన్‌ విధానం విషయంలో అమెరికాతో భారత్‌ చేయి కలిపింది. పైగా, అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక సైనిక చర్యలను నిర్వహించడానికి వాయవ్య భారత్‌లోని ఒక ప్రాంతంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోందని వార్తలొస్తున్నాయి. భారత్‌కి, దక్షిణాసియా ప్రాంతానికి కూడా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. భారత్‌ ద్వంద్వప్రమాణాలు పాటిస్తోందన్న విమర్శలకు కూడా తావిచ్చినట్లవుతుంది. ఇది నిజమే అయితే భారత్‌కి వ్యతిరేకంగా అఫ్గాన్‌ భూమిని ఉపయోగించుకోవడానికి తాలి బన్లు అనుమతించరాదంటూ భారత్‌ స్పష్టంగానే అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాం టప్పుడు భారత గడ్డమీద నుంచి అప్గాన్‌ వ్యతిరేక చర్యలు చేపట్టడానికి అమెరికాను మనం ఎలా అనుమతించగలం?

ఇప్పుడు మరొక ప్రధానమైన అంశం ఆసియా అంతర్గత వైరుధ్యం. ఆసియాలో రెండు అతిపెద్ద నాగరికతా దేశాలైన భారత్, చైనాలు ఆధిపత్య పోరాటంలో నిమగ్నమై ఉన్నాయి. ఒకవైపు భారత్‌–చైనా మధ్య శత్రుత్వం, మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఇరుగుపొరుగు దేశాలతో సముద్ర జలాలపై హక్కు విషయంలో ఏర్పడిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో చైనా విఫలమైతే, ఎంతో దూరంలో ఉన్న అమెరికాకు వివాద జలాల్లో చేపలు పట్టే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఆసియన్‌ వివాదాల్లో తలదూర్చవలసిన అవసరం అమెరికాకు లేదు. అయినప్పటికీ ఇండో–పసిఫిక్‌ అనే కృత్రిమ భావనను అమెరికా పెంచి పోషిస్తోంది.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటినుంచి తమదే ప్రపంచాధిపత్యం అనే విశ్వాసంతో అమెరికా పాలకులు వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవలి దశాబ్దాల్లో చైనా ఎదుగుతూ వస్తున్నందున, అమెరికా ప్రపంచాధిపత్యానికి రోజులు చెల్లిపోయాయి. ఇది అర్థమయ్యే, ఆసియాలో అనైక్యతా బీజాలను నాటే పనిలో అమెరికా బిజీగా ఉంటోంది. అందుకే, చైనాకు అడ్డుకట్టలేయడానికి అమెరికా సైనిక కూటములను నిర్మించుకుంటూ పోతోంది. దురదృష్టవశాత్తూ, చైనాతో మనకు ఎదురవుతున్న వివాదాలను సమానత్వం, న్యాయం ప్రాతిపదికన పరిష్కరించుకోవడానికి బదులుగా భారతీయులమైన మనం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్‌ కూటమిలో చేరడాన్ని ఎంచుకున్నాము. సారాంశంలో చైనాకు వ్యతిరేకమైన ఈ క్వాడ్‌ కూటమి ఆసియా ఖండంలో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలాన్ని సిద్ధం చేస్తోంది. అసలు విషయం ఏమిటంటే చైనాపైకి గురిపెట్టి కాల్చడానికి బయటివారు మన భుజాలమీద వారి తుపాకులు పెడుతుంటే మనం దానికి అనుమతించాల్సిందేనా?

అమెరికా ఇప్పుడు మరొక చైనా వ్యతిరేక కూటమి ఆకస్‌ని ఏర్పర్చింది. ఇది ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మూడు దేశాల మధ్య భద్రతా ఒడంబడికను సాధ్యం చేసింది. చైనాను నిలువరించడానికి ఆస్ట్రేలియాకు అణుశక్తితో పనిచేసే జలాంతర్గాములను అమెరికా, బ్రిటన్‌ ఈ ఒప్పందంలో భాగంగా నిర్మించి ఇస్తాయి. నాటో కూట మిలో భాగమైన రెండు మిత్రదేశాల పట్ల ఫ్రాన్స్‌ అగ్రహంతో రగిలిపోతోంది. ఎందుకంటే 80 బిలియన్‌ డాలర్ల విలువైన ఫ్రెంచ్‌–ఆస్ట్రేలియన్‌ జలాంతర్గామి ఒప్పందానికి ఆకస్‌ కూటమి తూట్లు పొడిచింది. మన సముద్రాలు, మహా సముద్రాలు త్వరలో ప్రాణాంతకమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు ఆటస్థలంగా మారనుండటం భారతీయులను, ఇతర ఆసియన్‌ ప్రజలను కలవరపరుస్తోంది.

శక్తిమంతమైన దేశాలు తమ నావికా బలాన్ని ఉపయోగించి  ప్రపంచ ఆర్థిక వనరులను కొల్లగొట్టే భవిష్యత్తు గురించి గాంధీజీ వందేళ్ల క్రితమే హెచ్చరించారు. (యంగ్‌ ఇండియా: 1921 డిసెంబర్‌ 8). ఆనాడు గాంధీ చేసిన హెచ్చరిక ఇప్పుడు భయపెట్టే వాస్తవంగా మారిపోయింది. రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన యూరోపియన్‌ శత్రుత్వానికి సంబంధించిన విధ్వంసకరమైన లక్షణాలకు వ్యతి రేకంగా టాగూర్‌ కూడా ఆసియన్లను హెచ్చరించారు. ఇప్పుడు విశ్వగురువుగా మారాలని ఆకాంక్షిస్తున్న భారత్, మన గురుదేవులు టాగూర్‌ ఆనాడు చేసిన హెచ్చరికను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లుంది.

సుధీంద్ర కులకర్ణి
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి సన్నిహితుడు
(ట్రిబ్యూన్‌ సౌజన్యంతో)  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top