Sakshi Guest Column Story On USA Republican Party Donald Trump In Telugu - Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ముందున్న మార్గం క్లిష్టమే!

Published Thu, Aug 10 2023 3:46 AM

Sakshi Guest Column On USA Republican Party Donald Trump

రిపబ్లికన్‌ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్‌ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్‌ పార్టీ విధానం ఒకటే... ఆయన నేరాలనూ, దుష్ప్రవర్తనలనూ విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్‌లపై ఉందని వాదించడం! అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్‌ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి నీలిచిత్రాల తారలతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. మరోవైపు, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. 

అమెరికాలో 2023 వేసవికాలం క్రూరంగా ఉండబోతోంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ సాంస్కృతిక జ్వరాలకు ఇది ఒక సూచన. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ దూరమే ఉంది. ఒక రకమైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అమెరికాను తనవైపు తిప్పుకుంది. రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థి, తిరిగి భవిష్యత్‌ అమెరికన్‌ అధ్యక్షుడిగా భావిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారాన్నే తీసుకోండి... రహస్య పత్రాలను దుర్వినియోగం చేసిన కేసులో ఆయన వచ్చే ఏడాది మేలో విచారణను ఎదుర్కోనున్నారు. కానీ 2024లో ఆయన ఎదుర్కొనే అనేక కేసుల్లో ఇది ఒకటి మాత్రమే.

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జరిగిన లైంగిక కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ట్రంప్‌ ఇచ్చిన నగదు చెల్లింపుపై క్రిమినల్‌ విచార ణను మార్చిలో మొదలెట్టాలని నిర్ణయించారు. జార్జియాలో గత ఎన్నికల్లో పొందిన ఓటమిని తిప్పికొట్టేందుకు ట్రంప్‌ చేసిన ప్రయత్నా లపై కూడా విచారణ కొనసాగుతోంది. చివరగా, ఆయన నకిలీ ఓటర్లతో కూడిన కుట్ర ద్వారా 2020 ఎన్నికల తీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నించాడనే అభియోగంపై కూడా దర్యాప్తు పూర్తి కావస్తోంది. ఈ కుట్రపూరిత ప్రయత్నం 2021 జనవరి 6న క్యాపి టల్‌పై దాడితో ముగియడం తెలిసిందే.

అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే రిపబ్లికన్‌ పార్టీ ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. ట్రంప్‌పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్‌ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్‌ విధానం ఆయన నేరాలను, దుష్ప్రవర్తన లను విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్‌లపై ఉందని వాదించడంగా కనిపిస్తోంది.

రిపబ్లికన్‌ పార్టీ ఈ అభిప్రాయానికి ఎలా వచ్చిందో, ఎలా చేరుకుందో స్పష్టం కావడం లేదు. కానీ ‘లా అండ్‌ ఆర్డర్‌’గా తనను తాను చెప్పుకొనే ఈ పార్టీ... 2021 జనవరిలో జరిగిన అల్లర్లలో అసాధారణమైనది ఏమీ కనిపించలేదని భావించే స్థాయికి చేరుకుంది. పైగా ఆ పార్టీ ఇప్పుడు ఎఫ్‌బీఐ(ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)ని కూడా రద్దు చేయాలనుకుంటోంది.

అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్‌ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి పోర్న్‌ స్టార్లతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. వారి పూర్వ నాయకుడు రొనాల్డ్‌ రీగన్‌ సోవియట్‌ ‘దుష్ట సామ్రాజ్యం’కు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించిన చోట, వారి ప్రస్తుత నాయకుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.

మరోవైపున డెమొక్రాట్‌లకు వారి సమస్యలు వారికి ఉన్నాయి. కనీస జనాదరణ కూడా లేని జో బైడెన్‌ రెండోసారి పదవిని కోరు తున్నారు. అయితే కాగితంపై విషయాలు బాగానే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది, ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి, పైగా, రాబోయే ఆరు నెలల్లో పరిస్థితులు మరింత మెరుగు పడతాయన్న అంచనాలున్నాయి.

అధ్యక్షుడిని అభిశంసిస్తామంటూ బెదిరించడం ద్వారా బైడెన్‌ను అణగదొక్కాలని రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. బైడెన్, ఆయన కుమారుడు హంటర్‌ చర్యలు అవినీతితో ముడిపడి ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు, అయినప్పటికీ అధ్య క్షుడు స్వయంగా తప్పు చేసినట్లు చెప్పే సాక్ష్యాలు పెద్దగా లేవు.

దేశాన్ని పట్టి పీడిస్తున్న సంస్కృతీ యుద్ధాలు కూడా అంతే నాట కీయంగా ఉన్నాయి. అమెరికా సమకాలీన చరిత్రలో అతిపెద్ద విభజన, వాస్తవానికి గర్భస్రావ అంశమే. అమెరికన్‌ సుప్రీంకోర్ట్‌ అబార్షన్‌ హక్కుల కోసం రాజ్యాంగ పరమైన రక్షణను తీసివేసిన తర్వాత, అనేక రిపబ్లికన్‌ రాష్ట్రాలు అబార్షన్ ను నిషేధించడమే కాకుండా, అబార్షన్‌ చేసేవారి చర్యను నేరంగా పరిగణిస్తూ కఠినమైన చట్టాలను ఆమోదించాయి. అయితే, గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయా సర్వేలు చూపిస్తున్నట్లుగా, అమెరికన్లలో ఎక్కువ మంది కొన్ని పరిమితులతో అబార్షన్‌ హక్కుకు మొగ్గు చూపుతున్నారు.

1955లో మిసిసిపిలో, శ్వేతజాతి మహిళపై ఈల వేసినందుకు అపహరణకు గురై, చిత్రహింసలపాలై హత్యకు గురైన 14 ఏళ్ల నల్ల జాతి బాలుడు ఎమ్మెట్‌ టిల్‌ స్మారక చిహ్నాన్ని గత వారం అధ్యక్షుడు బైడెన్‌ ప్రారంభించారు. ఆ హత్య, అతని హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడం అనేది 1960లలో పౌర హక్కుల ఉప్పెనను ప్రేరే పించింది. పైగా గత దశాబ్దంలో, ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ (నల్లజాతి జీవి తాలూ విలువైనవే) ఉద్యమ పెరుగుదలను చూశాం. ఈ పరిణామం అమెరికాలో నిలకడగా కొనసాగుతున్న జాత్యహంకార ఫలితమే.

సమకాలీన అమెరికన్‌ జాత్యహంకారం ఎలా పని చేస్తున్నదో చూడాలంటే... ఫ్లోరిడా గవర్నర్, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆశా జనకంగా ఉన్న రాన్‌ డిసాంటిస్‌ ఉదాహరణ చూడాలి. బానిసత్వాన్ని కొట్టివేసేలా ఆయన చర్యలు ఉంటున్నాయి. ఈ రాష్ట్రంలో సవరించిన పాఠ్య పుస్తకాలు... పని చేస్తూ బానిసలు కొన్ని నైపుణ్యాలను సంపా దించుకున్నందున వారు తమ బానిసత్వ స్థితి నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నాయి.

లైంగిక విద్య, లైంగిక ధోరణి, లింగ గుర్తింపుపై యుద్ధాలు జరుగుతున్నాయి. స్వలింగ సంపర్కుల హక్కులను స్థాపించడానికి విజయవంతమైన ప్రయత్నాలపై ఆధారపడి, ద్విలింగ, లింగ మార్పిడి వ్యక్తులు ప్రస్తుతం తమ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం, దాదాపు 21 శాతం జెన రేషన్‌ జెడ్‌ – అంటే 1990ల మధ్య నుంచి 2010 మధ్య జన్మించిన వారు– తమను తాము లెస్బియన్, గే, బైసెక్సువల్‌ లేదా ట్రాన్్సజెండర్‌ (ఎల్‌జీబీటీ)గా గుర్తించుకుంటున్నారు.

1980ల ప్రారంభంలో, 1990ల మధ్యకాలంలో జన్మించిన ‘మిలీనియల్స్‌’లో ఎల్జీబీటీ సంఖ్య 10 శాతమే. జెనరేషన్‌ జెడ్‌ రాక దేశాన్ని ఇతర మార్గాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. అమెరికన్లుగా ఉన్నందుకు ‘అత్యంత గర్వంగా’ భావిస్తున్నా మని చెప్పుకొనే యువకుల (18–34 ఏళ్లు) వాటా 2013లో దాదాపు 40 శాతం ఉండగా, ఇప్పుడది 18 శాతానికి పడిపోయిందని గాలప్‌ పోల్‌ వెల్లడించింది.

ఈ ఏడాది, ఎల్‌జీబీటీ హక్కులను పరిమితం చేయడానికి ఉద్దేశించిన 75 బిల్లులు అమెరికా అంతటా చట్టసభలలో ఆమోదించబడ్డాయి. లైంగిక ధోరణి ఆధారంగా ద్వేషపూరిత నేరాలు పెరిగాయి. పైగా ప్రదర్శనలు, ప్రతి– ప్రదర్శనలు ఒక సాధారణ లక్షణంగా మారాయి. పాఠశాల, విశ్వ విద్యాలయ పాఠ్యాంశాలు కూడా రణరంగంలో చేరిపోయాయి.

‘సంస్కృతి యుద్ధాలు’ అని పిలిచే ఇవి నిజానికి మార్పుపై పోరాడటానికి సంప్రదాయవాదులు చేసిన ప్రయత్నం. వలస దారులు, స్వలింగ సంపర్కులు, మహిళలు, పేదలు, నల్లజాతీయులు, ఇతర సమూహాలకు తమ ఖర్చుతో అన్యాయమైన అధికారాలు ఇస్తు న్నందున, ఉదారవాదం యొక్క బాధితులుగా  సంప్రదాయవాదులు తమను తాము అభివర్ణించుకుంటున్నారు. సందడి ఎలా ఉన్నప్పటికీ, ట్రంప్‌కు మాత్రం రహదారి క్లిష్టంగానే ఉంది.

ఒక ఎన్నికల సర్వే ప్రకారం, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. స్పష్టంగా, అమెరికా మార్పునకు గురవుతోంది. ఇదేమీ అసాధారణ మైనది కూడా కాదు. మితవాదుల ఆధిపత్యంలోని సుప్రీంకోర్టు వంటి సంస్థల సహాయంతో, రిపబ్లికన్లు ‘శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని’ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. 
మనోజ్‌ జోషి 
వ్యాసకర్త డిస్టింగ్విష్డ్‌ ఫెలో, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌
(ది ట్రిబ్యూన్‌ సౌజన్యంతో) 

Advertisement
 
Advertisement
 
Advertisement