అణుయుద్ధంగా మారనుందా? | Sakshi Guest Column On Russia Ukraine war as Nuclear war | Sakshi
Sakshi News home page

అణుయుద్ధంగా మారనుందా?

Nov 29 2024 5:10 AM | Updated on Nov 29 2024 5:10 AM

Sakshi Guest Column On Russia Ukraine war as Nuclear war

విశ్లేషణ

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అనూహ్యంగా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్‌ ఏటీఏసీఎంఎస్‌ క్షిపణులను రష్యా మీద ప్రయోగించింది. ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్‌ సరఫరా చేసిన డ్రోన్‌లను ఉపయోగిస్తోందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, బహుళజాతి స్వభావానికి విస్తరించినట్టయింది. దీనికితోడు పుతిన్‌ తమ అణ్వా యుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఆందోళనను రేకెత్తించారు. 1962 క్యూబా సంక్షోభంలో అమెరికా, రష్యాల్లోని రాబందులు ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, అధినేతలు వివేకంతో వ్యవహరించారు. కానీ, ఈ అస్థిర కాలంలో అలాంటి వివేకం సాధ్యమా?

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నవంబర్‌ 19 నాటికి 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నవంబర్‌ 17న అమెరికా సైన్యపు టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌(ఏటీఏసీఎంఎస్‌)ను ఉపయోగించే అధికా రాన్ని ఉక్రెయిన్‌కు కట్టబెట్టగానే ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది.

ఈ నిర్ణయం ద్వారా, ‘అంకుల్‌ జో’ ఎట్టకేలకు ‘ధైర్య ప్రదర్శన’ చేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాకతాళీయమో, ఉద్దేశ పూర్వకమో గానీ యుద్ధంలో ఆకస్మికమైన, ప్రమాదకరమైన పెరుగు దల స్పష్టంగా కనబడుతోంది.

తీవ్రతను పెంచిన జో!
దీర్ఘ–శ్రేణి పాశ్చాత్య తయారీ క్షిపణులను ఉపయోగించే ఆమోదం కోసం  ఉక్రెయిన్‌ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే యుద్ధాన్ని ఇద్దరు ప్రత్యర్థులకే పరిమితం చేసే వివేకంతో, సంయమనం చూపుతూ వాషింగ్టన్‌ దీనిని నిలిపి ఉంచింది. అలాంటిది బైడెన్‌ అధ్యక్షత దాని ‘అత్యంత బలహీన’ దశలో ఉన్నప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. వైట్‌ హౌస్‌ పీఠం కోసం నవంబర్‌ మొదట్లో అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, జనవరి 20న కొత్త అధ్యక్షుడు (డోనాల్డ్‌ ట్రంప్‌) బాధ్యతలు స్వీకరించే సంధి కాలం ఇది.

ఉక్రెయిన్‌ తన కొత్త ఆయుధాలను ఉపయోగించడంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోలేదు. నవంబర్‌ 20న రష్యాలోని లక్ష్యాలపై ఏటీఏసీఎంస్‌ క్షిపణులను ప్రయోగించింది. పైగా, బ్రిటన్‌ సరఫరా చేసిన స్టార్మ్‌ షాడో క్షిపణులతో అనంతర దాడిని కొనసాగించింది.

అంతకుముందు, ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్‌ సరఫరా చేసిన డ్రోన్‌లను కూడా ఉప యోగిస్తుందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. తద్వారా రష్యా– ఉక్రెయిన్‌ మధ్య నుండి యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, విస్తృత బహుళ జాతి స్వభా వానికి విస్తరించినట్టయింది.

భయాన్ని పెంచిన రష్యా
అయితే మాస్కో దాదాపు వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. నవంబర్‌ 21న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ తమ సైన్యం తూర్పు ఉక్రేనియన్‌ నగరమైన డ్నిప్రోపై ‘కొత్త సాంప్రదాయిక మధ్యంతర శ్రేణి క్షిపణి’ని ఉపయోగించి దాడి చేసిందని ప్రకటించారు. దీన్ని ఒరేష్నిక్‌గా వర్గీకృతమైన ప్రయోగాత్మక మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిగా గుర్తిస్తున్నారు.

అమెరికన్, బ్రిటిష్‌ దీర్ఘ–శ్రేణి ఆయుధాల వినియోగానికి ప్రతి స్పందనగా, నవంబర్‌ 21న రష్యన్‌ సాయుధ దళాలు ఉక్రెయిన్‌ సైనిక–పారిశ్రామిక సముదాయాలలో ఒకదానిపై దాడిని నిర్వహించా యని పుతిన్‌ పేర్కొన్నారు. ‘హైపర్‌సోనిక్‌ ఒరేష్నిక్‌ క్షిపణిని ఉప యోగించడానికి కారణం ఏమిటంటే, అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ యుద్ధాన్ని మరింత మారణ హోమంవైపు పెంచాలని నిర్ణయించుకుంటే, రష్యా దృఢమైన రీతిలో ప్రతిస్పందిస్తుంది. రష్యా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇప్పటికీ దీనిని అనుమానించినట్లయితే, వారలా చేయకూడదు. ఎల్లప్పుడూ రష్యా ప్రతిస్పందన తగురీతిలో ఉంటుంది’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

ఈ ప్రతిస్పందన అణ్వాయుధ సహితంగా ఉంటుందా? అనేక ఐరోపా దేశాలు భయపడే ఘోరమైన దృష్టాంతం ఇది. పుతిన్‌ తమ అణ్వాయుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఈ ఆందోళనను మరింతగా రేకెత్తించారు.

రష్యా మునుపటి అణు సిద్ధాంతం, సాంప్రదాయ నమూనాలో రూపొందినది. అంటే అణ్వాయుధం అంతటి విధ్వంసకరమైన సామ ర్థ్యాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించకుండా, కేవలం ప్రత్యర్థిని, అంటే అమెరికాను ‘నిరోధించడానికి’ మాత్రమే ఉద్దేశించబడింది. రెండవ షరతు ఏమిటంటే, రాజ్య ఉనికికి ముప్పు కలిగించే సాంప్రదాయ సైనిక దాడిని తిప్పికొట్టడం.

అయితే, మాస్కో సవరించి ప్రకటించిన నవంబర్‌ సిద్ధాంతం మొత్తం పరిధిని విస్తరించింది. అణుశక్తి మద్దతు ఉన్న అణుయేతర శక్తి ద్వారా ఎదురయ్యే ఏ దాడినైనా సరే... ఉమ్మడి దాడిగా పరిగణి స్తామని రష్యా పేర్కొంది. అలాగే, మిలిటరీ కూటమిలోని ఒక సభ్య దేశం (ఈ సందర్భంలో, అమెరికా నేతృత్వంలోని కూటమి) చేసే ఏ దాడినైనా మొత్తం కూటమి చేసిన దాడిగా పరిగణిస్తామని కూడా రష్యా స్పష్టం చేసింది.

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రారంభ దశ నుండి కూడా మాస్కో తన అణు సామర్థ్యం గురించి యోచిస్తోంది. అయితే, ఒక అవగాహన ప్రకారం రష్యా ఈ రెడ్‌ లైన్‌ ను దాటదనీ, దీనిని కేవలం ఒక బెదిరింపుగా మాత్రమే చూడాలనీ కొంరు పాశ్చాత్య వ్యాఖ్యాతలు కొట్టేశారు. కానీ అలాంటి ఆత్మసంతృప్తి తప్పుదారి పట్టించేదీ, ప్రమాదకరమైనదీ కావచ్చు.

వివేకం కలిగేనా?
అమెరికాకూ, మునుపటి సోవియట్‌ యూనియన్‌ కూ మధ్య 1962 క్యూబా క్షిపణి సంక్షోభం ఆ సంవత్సరం అక్టోబర్‌ మధ్యలో ప్రారంభమై ప్రపంచాన్ని దాదాపుగా అణుయుద్ధంలోకి నెట్టింది. అమెరికా అధ్యక్షుడు జాన్‌ కెన్నెడీ, సోవియట్‌ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్‌ అనే ఇద్దరు నాయకులు చివరి నిమిషంలో ప్రదర్శించిన వివేకం కారణంగా ఈ విధ్వంసకరమైన పరస్పర హనన కార్యక్రమం నిలిచిపోయింది. వారు 1962 నవంబర్‌ 20న సంయుక్తంగా దీనికి ‘మంగళం పాడేయాలని’ నిర్ణయించుకున్నారు.

రెండు దేశాల్లోని రాబందులు ఆ ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, శిఖరాగ్ర స్థాయిలో అధినేతలు దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సోవియట్‌ జలాంతర్గామి కెప్టెన్‌ ప్రదర్శించిన వ్యూహాత్మక సంయమనం కారణంగా అదృష్టవశాత్తూ అణు నిషేధం ఉల్లంఘనకు గురికాలేదు. ప్రస్తుత అస్థిర కాలంలో అలాంటి సంయ మనం పాటిస్తారా?

ఒరేష్నిక్‌ను ఆవిష్కరించడం ద్వారా, రేడియేషన్‌ లేకుండా అణ్వా యుధానికి దగ్గరగా ఉండే అసాధారణ సామర్థ్యాన్ని రష్యా ప్రదర్శించింది. ఒరేష్నిక్‌ అనేది 2,500 కి.మీ. పరిధి కలిగిన కొత్త తరం రష్యన్‌ మధ్యంతర శ్రేణి క్షిపణి అనీ, దీన్ని 5,000 కి.మీ. పరిధి వరకు విస్తరించవచ్చనీ రష్యన్‌ మీడియా నివేదించింది.

సహజసిద్ధంగా హైపర్‌ సోనిక్‌ అయిన ఈ క్షిపణి వేగం ‘మాక్‌ 10–మాక్‌ 11’ మధ్య ఉంటుంది (గంటకు 12,000 కి.మీ. కంటే ఎక్కువ). అంటే దీన్ని గుర్తించడం కష్టం. పైగా, ప్రస్తుత క్షిపణి నిరోధక సాంకేతికత ఈ క్షిపణిని అడ్డగించలేదు. కాలినిన్‌ గ్రాడ్‌లోని రష్యన్‌ స్థావరం నుండి దీన్ని ప్రయోగిస్తే యూరోపియన్‌ రాజధానులను చాలా తక్కువ సమయంలో (సెకన్లలో) ఢీకొంటుంది: వార్సా 81; బెర్లిన్‌ 155; పారిస్‌ 412; లండన్‌ 416. రష్యా ఉప విదే శాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్‌ అక్టోబర్‌ 3న ప్రకటన చేస్తూ, అణ్వా యుధ శక్తుల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయలేమని పేర్కొన్నారు. 

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటింది. ఇది క్లిష్టమైన శిఖరాగ్రానికి సిద్ధంగా ఉంది. ఒక పౌర అణు ప్రమాదం లేదా ఉద్దేశపూర్వక సైనిక సంఘటన రెండూ విపత్తుతో కూడి ఉంటాయి. పైగా అమెరికా పాలనలో అత్యంత బలహీనమైన ప్రస్తుత దశ ఏ సంభావ్యతకూ అవకాశం ఇవ్వకూడదు. బైడెన్‌ పాలన తర్వాత వస్తున్న ట్రంప్‌ 2.0 అధ్యక్షత విఘాతం కలిగించేదిగానూ, దుస్సాహ సికంగానూ ఉంటుంది. మొత్తం మీద 2025 సంవత్సరం మరింత అల్లకల్లోలంగా ఉండబోతోంది.

సి. ఉదయ్‌ భాస్కర్‌ 
వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌ డైరెక్టర్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement