
ఆగస్టు 15 వచ్చిందంటే చాలు ఢిల్లీలోని ఎర్రకోట పూర్వ వైభవాన్ని సంతరించు కున్నట్లు కనిపిస్తుంది. భారతదేశపు తొలి ప్రధాని నెహ్రూ 1947లో ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసినప్పటి నుంచి, భారత ప్రధానులకూ, ఎర్రకోటకూ ఒక అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. ఏటా ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి జాతి నుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీగా మారింది.
ఫ్రాన్స్ ఏటా జూలై 14న జాతీయ దినోత్సవం జరుపుకొంటుంది. ఆ రోజున 1790లో ప్రాన్స్ ప్రజలు బాస్టిల్ జైలును చుట్టుముట్టి దానిలో నిర్బంధించిన ఉద్యమకారులను విడిపించుకున్నారు. ఫ్రాన్స్ జాతీయ జీవనంలో బాస్టిల్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో ఎర్రకోటకీ అంత ప్రాధాన్యం ఉంది. ఎర్ర కోట మన గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చెబుతుంది.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1592–1666) ఈ కోటను 1639లో ప్రారంభించారు. దానిలోని దీవాన్– ఇ– కాస్ (ప్రత్యేక సభాసదుల హాలు) గోడలపై పర్షియన్‌లో ‘గర్ ఫిర్దౌస్ బార్ రు–ఏ– జమీన్ అస్త్, హమీన్ అస్తో, హమీన్ అస్తో, హమీన్ అస్త్’ అని రాసి ఉంటుంది. ‘ఈ భూమిపై స్వర్గం ఏదైనా ఉందీ అంటే అది ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది’ అని ఆ మాటలకు అర్థం. అవి ఇండియా గురించిన మాటలుగానే నేను భావిస్తాను. కశ్మీర్‌ను చూశాక షాజహాన్ మొదటిసారి ఆ మాటలను ఉపయోగించినట్లు చెబుతారు.
కానీ, ఎర్రకోట కథ అంత స్వర్గతుల్యమై నది ఏమీ కాదు. పైన చెప్పుకున్న మాటలకు పూర్తి విరుద్ధమైన సంగతులు ఎర్రకోటలో చోటుచేసుకున్నాయి. ‘ఈ భూమిపై నరకం ఏదైనా ఉందీ అంటే, అది ఇదే, అది ఇదే’ అనా లనిపిస్తుంది. మరో మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు (1618–1701) తన పెద్ద అన్నయ్య దారా షికో (1615–1659) తలను నరికేయడానికి ముందు గొలుసు లతో బంధించి, ఒక మురికి ఏనుగుపై కూర్చోపెట్టి, ఈ కోట నుంచే తీసుకెళ్ళి చాందినీ చౌక్ అంతటా తిప్పారు.
నేటి పరి భాషలో చెప్పాలంటే, షికో సెక్యులర్ కావడమే దానికి కారణం. ఎర్రకోట నుంచి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాల మేరకే స్వేచ్ఛా పిపాసి సాధు సరమద్ (1590–1661), సిక్కుల గురువు తేజ్ బహదూర్ (1621–1675) తలలను వారి మొండాల నుంచి వేరు చేశారు. భారతదేశపు సామాజిక పొందికను ఛిద్రం చేస్తూంటే ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది. దానిలాగానే, దేశాన్ని కూడా అదే పనిగా చీలికలు పీలికలు చేశారుకానీ, దేశం మళ్ళీ ఏకమవుతూ వచ్చింది.
ఔరంగజేబు కాలగర్భంలో కలిసి సుమారు 150 ఏళ్ళు అయిన తర్వాత, బహదూర్ షా జాఫర్ (1775–1862) ఎర్ర కోట యజమాని అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా, సిపాయిలు 1857లో తిరుగుబాటు చేసినపుడు చివరి మొఘల్ పాలకుడైన జాఫర్ అటు హిందువులు, ఇటు ముస్లింలు ఇద్దరికీ ఇరుసుగా మారారు. తర్వాత, దాదాపు 90 ఏళ్ళు గడి చాక, బ్రిటిష్ భారతీయ సైన్యం లోపల ఎగసిన తిరుగుబాటు ఎర్రకోటలోని గోడల లోపల ప్రతిధ్వనించింది. ఆ తర్వాత, 1945–1946 ప్రాంతంలో, కల్నల్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ (సిక్కు), కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ (హిందువు), మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం) భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రసిద్ధికెక్కారు.
వారు ముగ్గురూ నేతాజీ నేతృత్వంలోని ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి చెందిన వారు. ‘బ్రిటిష్ చక్ర వర్తికి వ్యతిరేకంగా యుద్ధానికి ఎగదోస్తున్నారం’టూ ఆ శౌర్యవంతులను ఎర్రకోటలోనే విచారించారు. ఆ సమయంలో ‘లాల్ ఖిలాసే ఆయీ ఆవాజ్/ ధిల్లాన్, సెహగల్, షానవాజ్’ అంటూ ఎర్రకోట నుంచి ఒక నినాదం మిన్నుముట్టింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్చి కూర్చిన ఉద్దండులైన నెహ్రూ వంటి న్యాయవాదులు వారి తరఫున వాదించారు. ముగ్గురికీ దేశ బహిష్కార శిక్ష విధించారు. స్వాతంత్య్రం లభించాక, కొద్ది రోజుల్లోనే వారిని విడుదల చేశారు.
‘హిందూ రాష్ట్ర’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్న కొందరు... గాంధీజీ హత్య కేసులో నిందితులయ్యారు. వారిని ఎర్రకోట లోనే ప్రత్యేక కోర్టులో విచారించారు. వీరికి ప్రతిగా మరో వర్గం ఉంది. ఆ వర్గంవారు 2000 డిసెంబర్ 22న ఎర్రకోటలోకి చొచ్చు కువచ్చారు. ఆ రోజు కోటలోకి రాగలిగిన ఇద్దరు లష్కర్–ఏ– తోయెబా ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. భారతదేశంలో మత విభజన తేవడమే ఆ టెర్రరిస్టుల లక్ష్యం. ఇలా ఎర్రకోట చారిత్రక చిహ్నం స్థాయిని మించి ఎరుపెక్కింది.
అదే సమయంలో, నైతిక శక్తి వాహికగా కూడా మారింది. కనీసం, 2047 ఆగస్టు 15న ఎర్రకోటపై 100వసారి పతాకావిష్కరణ జరుగుతున్నపుడు, ప్రసంగించే ప్రధాని అయినా, ‘స్వర్గం ఇక్కడే ఉంది! నా తోటి భారతీయులారా! ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. మనం పరస్పరం ద్వేషించుకోం, దేనికీ భయపడం, కలసి మెలసి శాంతియుత జీవనం సాగిస్తున్నాం’ అని ప్రకటించగలుగుతారా’?.
వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)