అర్హత పరీక్షకు 'అన్నీ అనర్హతలే'! | Sakshi Guest Column On National Eligibility cum Entrance Test | Sakshi
Sakshi News home page

అర్హత పరీక్షకు 'అన్నీ అనర్హతలే'!

May 29 2026 12:05 AM | Updated on May 29 2026 12:05 AM

Sakshi Guest Column On National Eligibility cum Entrance Test

‘నీట్‌’ విద్యార్థుల నిరసన ప్రదర్శన

సందర్భం

వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు చెందిన పశ్న పత్రాలు లీకవడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్టీయే) ఇటీవల ఆ పరీక్షను రద్దు చేసింది. గతేడాది జూలైలోనే వివిధ వైద్య కళాశాలలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)లకు చెందినవారి ప్రమేయ మున్న ఒక భారీ కుంభకోణాన్ని సీబీఐ బయటపెట్టింది. ఇటువంటి ఉదంతాలు ఏకమొత్తంగా వైద్య విద్య నీతి నిజాయతీలపైన, దేశంలో ఆరోగ్య రక్షణ ప్రమాణాలపైన సందేహాలను, ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. భారతదేశంలో డాక్టర్‌ అవటమంటే సామాన్యం కాదు. వాస్తవానికి ఇటీవలి సంవత్సరాల్లో మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది కూడా. సుమారు 800లకు పైగా కాలేజీల్లో 1,28,000లకు మించి ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, వచ్చే మూడేళ్లలో మరో 50,000 అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌–గ్రాడ్యుయేట్‌ సీట్లు వాటికి జత కానున్నాయి. అయినా, మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల రద్దయిన ‘నీట్‌’ పరీక్షకు సుమారు 22 లక్షల మంది కూర్చున్నారు. 

స్కోరు–ఆధారిత ప్రవేశాలు అసంబద్ధం 
ప్రస్తుతం వైద్య విద్యలో ప్రవేశానికి ‘నీట్‌’ స్కోరు ఒక్కటే గీటురాయి అయినందువల్ల, ఆ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించడం చాలా ముఖ్యం. తాజా ప్రహసనం తర్వాత, వ్యవస్థ చిత్తశుద్ధిని కాపాడేందుకు వివిధ సాంకేతిక, ఆచరణాత్మక మార్గా లపై సూచనలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షా పద్ధతి, ఎన్‌క్రిప్టెడ్‌  ‘జస్ట్‌–ఇన్‌–టైమ్‌’ క్వశ్చన్‌ పేపర్లు, బహుళ సెట్ల ప్రశ్న పత్రాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఊతంతో చెదురు మదురుగా ప్రశ్నలను ఎంపిక చేయడం వంటివి వాటిలో ఉన్నాయి. 2024లో ‘నీట్‌’ స్కామ్‌ వెలుగులోకి వచ్చాక, పరీక్షా విధానంలో లొసుగులు లేకుండా చూసేందుకు రాధాకృష్ణన్‌ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. పరీక్షా పత్రాల భద్రతను కాపాడేందుకు అటు వంటి టెక్నాలజీ ఆధారిత సత్వర పరిష్కారాలు, చర్యలు స్వల్ప కాలానికి సహాయపడవచ్చు. కానీ, మెడికల్‌ కాలేజీల అడ్మిషన్‌ ప్రక్రియలో సంస్థాగతంగా మార్పులు జరగాలి.

అనేక దేశాల్లో సమగ్ర మదింపు పద్ధతిని అనుసరిస్తున్నారు. మన దేశంలో అన్ని స్థాయులలోని వైద్య శిక్షణ ప్రవేశానికి ప్రమాణీ కృత పరీక్షలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. మెడికల్‌ ట్రైనింగ్‌కు విద్యార్థులు అనువైనవారో కాదో నిర్ణయించేందుకు స్కోరు–ఆధారిత అడ్మిషన్‌ ఒక్కటే మార్గం అనిపించుకోదు. ఆ పద్ధతి అనేక విధాలుగా అసమతౌల్యం. సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళిక, స్కూలు సిలబస్‌కు మించి ఉన్న కొన్ని సబ్జెక్టులను దృష్టిలో పెట్టుకుని ‘నీట్‌’ పరీక్షా పద్ధతి రూపొందుతోంది. స్టేట్‌ బోర్డు విద్యార్థులు సహజంగానే వెనుకబడుతున్నారు. స్కూలు సబ్జెక్టులను మించి ఉన్న ఇతర టాపిక్కులతో సీబీఎస్‌ఈ విద్యార్థులు కూడా పరీక్షకు పూర్తిగా సమాయత్తం కాలేకపోతున్నారు. ఈ అంతరాన్ని భర్తీ చేసుకునేందుకు ఆ రెండు రకాల విద్యార్థులు కూడా ‘నీట్‌’ పరీక్షకు కూర్చునేందుకు ఒకే రకమైన తర్ఫీదును తీసుకోవలసి వస్తోంది. అది కోట్లాది రూపాయల కోచింగ్‌ పరిశ్రమ అవతరణకు దారి తీసింది. 

అందరికీ ఒకే పరీక్ష ఎలా సరి?
మొదటగా, అడ్మిషన్‌ ప్రక్రియను వికేంద్రీకరించవలసి ఉంది. భిన్న విద్యా వ్యవస్థలు, ప్రాంతీయ అసమానతలతో కూడిన దేశంలో అందరికీ ఒకటే పరీక్ష విధానం పొసిగేదిగా లేదు. రకరకాల లెర్నింగ్‌ పర్యావరణాలను, విద్యార్థుల నేపథ్యాలను అటువంటి ‘ప్రమాణీకృత మదింపు పరీక్ష’ పరిగణనలోకి తీసుకోవడం లేదు. దానికి తోడు, కేంద్రీకృత వ్యవస్థ వల్ల కుంభకోణాలు, అవకతవకలు, తిమ్మిని బమ్మి చేయడం, క్వశ్చన్‌ పేపర్ల లీకులు వంటివాటికి ఎక్కువ అవకాశం ఏర్పడుతోంది. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టు్టకుని స్వీయ అడ్మిషన్‌ ప్రక్రియను రూపొందించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఉండాలి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి హైబ్రిడ్‌ పద్ధతిని అనుసరించవచ్చు. హైస్కూలు మార్కులను, ఎంట్రెన్స్‌ టెస్ట్‌ స్కోర్లను లెక్కలోకి తీసుకుని ప్రవేశం కల్పించవచ్చు. ప్రైవేటు కాలేజీలకు ప్రత్యేక ఎలిజిబిలిటీ టెస్టు పెట్టుకోవచ్చు. రాష్ట్రాలలోని కాలేజీల్లో ‘అఖిల భారత’ కోటా కింద ప్రవేశానికి అదనపు గీటు రాయిని లేదా ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేయవచ్చు. 

మెడికల్‌ అడ్మిషన్‌ పరీక్షల స్వరూప స్వభావాలు కూడా మారాలి. జీవ, భౌతిక, రసాయన శాస్త్రాల పాఠ్య ప్రణాళికను ఆధారం చేసుకున్న ‘నీట్‌’ ఒక విషయాన్ని ఆకళింపు చేసుకోవడం కాక, ప్రాథ మికంగా బట్టీ పద్ధతిని ప్రోత్సహించేదిగా ఉంది. మెడికల్‌ వంటి ఉన్నత విద్యా కోర్సులకు అవసరమయ్యే సన్నద్ధత, అభిరుచి, విద్యా పరమైన సామర్థ్యాలను లెక్కించే విధంగా రూపకల్పన జరగలేదు. కీలక ఆలోచనా విధానం, తార్కికత, సమస్య పరిష్కార నైపుణ్యంతో పాటు నడత, సామాజిక శాస్త్ర భావనలను ఎక్కువ మదింపు చేసేవిగా ఆ పరీక్ష ఉండాలి. పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ సీట్లకు కూడా పూర్తి స్కోరు ఆధారిత అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించడం సరైనదిగా లేదు. 

పాఠశాల విద్యను దెబ్బతీస్తున్న ‘కోచింగ్‌’!
కోచింగ్‌ పరిశ్రమ ‘నీట్‌’కు అవాంఛనీయ ఉప దుష్ఫలితంగా తయారైంది. ‘నీట్‌’ సంబంధిత ప్రతి కుంభకోణంలోనూ కోచింగ్‌ సెంటర్ల పాత్ర బయటపడుతూనే ఉంది. సగటు హైస్కూలు విద్యార్థి ‘నీట్‌’లో ఎక్కువ స్కోరు చేసేందుకు కోచింగ్‌ సంస్థలు ఆరవ, ఏడవ తరగతుల నుంచే తర్ఫీదునివ్వడం ప్రారంభించేస్తున్నాయి. అంటే, పరీక్షకు కూర్చోవడానికి ఏడేళ్ల ముందు నుంచే కోచింగ్‌ మొదలవు తోంది. ఆ విధంగా కోచింగ్‌ పరిశ్రమ పాఠశాల విద్యను దెబ్బతీస్తోంది. హైస్కూలు, జూనియర్‌ కాలేజీల స్థాయిలో చదవవలసిన వాటిని పక్కన పెట్టేసి కేవలం ‘నీట్‌’ అభ్యర్థులుగా విద్యార్థులను మారుస్తోంది. ఎంచుకునే వృత్తి జీవితాలు వేరైనా, ఒక వ్యక్తి వ్యక్తి త్త్వాన్ని నిశిత ఆలోచనా ధోరణి, నైతికత, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటివి తీర్చిదిద్దుతాయి. అవేవీ, విద్యార్థులకు అబ్బడం లేదు. పైగా కోచింగ్‌ పరిశ్రమను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. విద్యా ర్థులు ఆయా అంశాలను అర్థం చేసుకుంటున్నారో లేదో చూడకుండా, బట్టీ పద్ధతిని అనుసరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోచింగ్‌ పరిశ్రమకు తోడ్పడటం దురదృష్టకరం.

ఇటీవలి నీట్‌ కుంభకోణం... వైద్య విద్యారంగంలో పేరుకు పోయిన అవకతవకలను సరిదిద్దడానికీ, సంస్కరణలను ప్రవేశ పెట్ట డానికీ ప్రభుత్వానికి మరొక అవకాశాన్ని అందించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ లేదా వైద్య కళాశాలలు ఏవైనా కావచ్చు, ఇందులో పాలుపంచుకున్న అన్ని సంస్థలను బాధ్య తాయుతంగా, అవినీతి రహితంగా మార్చవలసిన అవసరం ఉంది. 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement
 
Advertisement
Advertisement