
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి దోంగ్ జాన్
విశ్లేషణ
భారత్–చైనా మధ్య సంబంధాలలో ఇటీవలి కాలంలో మళ్ళీ చెప్పుకోతగ్గ కదలిక మొదలైంది. చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వేడాంగ్ జూన్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీ సందర్శించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో చర్చలు జరిపారు. కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ఆరంభించవచ్చుననే ప్రకటన ఆ చర్చల ఫలితంగానే వెలువడింది (జూన్ 30న యాత్ర మొదలైంది). వాస్తవాధీన రేఖ వద్ద 2020 వేసవిలో ఏర్పడిన ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఆ యాత్రను నిలిపివేశారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్.సి.ఒ.) సమావేశాలలో పాల్గొనేందుకు భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈమధ్య ఒకరి వెనుక ఒకరు చైనా వెళ్ళి వచ్చారు. భారత్ నాయకులు చైనాలోని తమ సహచరులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దాంతో, అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు దేశాల మధ్య ఒడిదుడుకులతో కూడిన సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నాయనే అభిప్రాయం బలం పుంజుకుంది.
డ్రాగన్–ఏనుగు మళ్ళీ కలసి నృత్యం చేస్తున్నట్లుగా భారతీయ సమాచార సాధనాలు వివిధ కథనాలను వండివార్చాయి. చైనా నుంచి చౌకగా, సులభంగా దిగుమతులు చేసుకోవచ్చని భారతీయ పరిశ్రమల్లో ఆశలు చిగురించాయి. వీటికి తోడు, భారత్ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్, చైనా నుంచి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకకు అనుకూలంగా మాట్లాడటంతో, అంతా బ్రహ్మాండంగా ఉండబోతోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ప్రేమానురాగాలు దేవుడెరుగు!
కానీ, వాస్తవాధీన రేఖ దగ్గర యథాతథ స్థితిని మార్చే ఉద్దేశంతో తూర్పు లద్దాఖ్‌కు బీజింగ్ సేనలను పంపిందనే సంగతిని మనం
దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రాంతంలో చైనాయే పెద్దన్న అనే విషయాన్ని భారత్ గ్రహించడం మంచిదని అది చెప్పదలచుకుంది. కనుక, రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల దిగజారడానికి చైనాయే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే, పరిస్థితులను చక్కదిద్దేందుకు సయోధ్య ప్రయత్నాలను ప్రారంభించవలసిన బాధ్యత కూడా బీజింగ్ పైనే ఉంది. ‘‘ఎవరు ముడి వేశారో వారే దానిని విప్పాలి’’ అని చైనాలో ఒక నానుడి కూడా ఉంది.
తూర్పు లద్దాఖ్‌లో సేనలు సిగపట్లకు దిగడం లేదుకానీ, అక్కడ మోహరించిన సైనికుల సంఖ్య తగ్గలేదని కూడా గ్రహించాలి. సంబంధాల మెరుగుదలకు, వాస్తవాధీన రేఖ దగ్గర కొన్ని చర్యలనైతే తీసుకున్నారుగానీ, వాతావరణం పూర్తిగా 2020 మునుపటి స్థితికి చేరుకుందని పక్కాగా చెప్పలేం.
ఇటువంటి పరిస్థితుల్లో, డ్రాగన్–ఏనుగు గదిలో తమ తమ ప్రదేశాలకు పరిమితమై ఉన్నాయనీ, పరస్పరం కదలికలను జాగ్రత్తగా గమనించుకుంటున్నాయనీ చెప్పడమే శ్రేయస్కరం అవుతుంది. ఆ రెండూ యుగళ గీతం పాడుకొనే మాట దేవుడెరుగు, కనీసం సరైన జోడీగా పరస్పరం గుర్తించుకోవడం లేదని తెలుసుకోవాలి. పైగా, రెండింటి మధ్య ప్రేమానురాగాలు కూడా ఏమీ లేవు.
ఆడించినట్లు ఆడాలా?
ఢిల్లీ–బీజింగ్ మధ్య సంబంధాల్లో ఆర్థిక పార్శా్వన్ని కూడా పరిశీలించినట్లయితే పరిస్థితి మరింత కళ్ళకు కడుతుంది. అంకుర దశలో ఉన్న మన ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు రేర్ ఎర్త్ మాగ్నెట్లు చాలా అవసరం. చైనా వాటి ఎగుమతులను గత మూడు నెలలుగా నిలిపివేసింది. ప్రధానంగా అమెరికాను లక్ష్యంగా పెట్టుకునే రేర్ ఎర్త్ ఎగుమతుల నియంత్రణలను చైనా రూపొందించుకుంది. కానీ, అమెరికాతో అది ఈమధ్య ఒక అంగీకారానికి వచ్చింది. కానీ, భారత్‌కు బయలుదేరవలసిన నౌకలకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. ఇది భారత ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను సంక్షోభం అంచునకు నెడుతోంది.
అలాగే, భారత్‌కు ఎగుమతి చేసే ప్రత్యేకమైన ఎరువులను కూడా అది ఒక ఆయుధంగా మలచుకుంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. సొరంగాలను తవ్వడానికి ఉపయోగించే యంత్ర పరికరాల సరఫరాను చైనా కస్టమ్స్ అధికారులు ఏడాదికి పైనుంచి అడ్డుకుంటున్నారు. భారత్ పట్ల చైనా ఎటువంటి వైఖరిని అవలంబిస్తున్నదీ దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
తనను అగ్ర రాజ్యంగా గుర్తించాలనీ, భారత్ తాను చెప్పినట్లు ఆడాలనీ చైనా కోరుకుంటోంది. చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పట్టుబడుల నిబంధనలను సడలించాలని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు కోరుతున్నారు. అయితే, చైనా అసలు అభిమతాన్ని వారు నామమాత్రంగానే గుర్తిస్తున్నారు. గట్టిగా నిరసన తెలిపేందుకు వెనుకాడుతున్నారు.
అయినా, 2020 జూన్‌లో గల్వాన్‌లో ఘర్షణ చోటుచేసుకున్న వెంటనే, దేశీయ మార్కెట్ల నుంచి అనేక చైనా యాప్‌లను భారత్ నిషేధించింది. హవాయ్ వంటి చైనా సంస్థలను మన దేశంలో 5జీ ప్రయోగాలలోగానీ, దాన్ని ప్రవేశపెట్టడంలోగానీ పాలుపంచుకోనివ్వలేదు. అవన్నీ అద్భుతమైన చర్యలే. వాటిని వెనక్కి తీసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.
అంతొద్దు, కొంత చాలు!
మరి పరిస్థితుల పునరుద్ధరణకు ప్రస్తుతం వేస్తున్న అడుగులను ఎలా మదింపు చేయాలి? మునుపటి పరిస్థితులు పూర్తిగా నెలకొనకపోయినా, తూర్పు లద్దాఖ్‌లో సైనిక దళాల స్థితిగతుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. మొత్తంమీద, సంబంధాల దిద్దుబాటుకు, పునర్నిర్మాణానికి పూనుకోవడం సరైన చర్యే.
భారత ప్రభుత్వం సరైన దిశలోనే ఆచితూచి అడుగులు వేస్తోంది. పొరుగునున్న చైనాతో సంబంధాలు నెరపక తప్పదు. నిస్సందేహంగా వాటిని గాడిలో పెట్టాల్సిందే. అయితే, ఈ ప్రక్రియలో మనం మితిమీరిన ఉత్సాహం చూపవలసిన అవసరం లేదు. పరస్పర ప్రయోజనాలే అడుగు ముందుకు వేసేందుకు గీటురాయి కావాలి. సంబంధాలను పునర్నిర్మించడానికి పరస్పర గౌరవం అత్యంత అవసరం.
చైనాతో సమీప భవిష్యత్తులో సంబంధాలు సజావుగా సాగుతాయని మన దేశంలోని పరిశ్రమలు ఆశించకపోవడం వాటికే మంచిది. అది ఆచరణ సాధ్యంకాని పని. అటువంటి ఫలితాన్ని ఇప్పుడే ఆశించడం అవాస్తవికం అవుతుంది. చైనా ఇవ్వడానికి నిరాకరిస్తున్న వస్తువులలో కొన్నింటిని సొంతంగానే తయారు చేసుకునేందుకు భారత్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అందుకు రేర్ మాగ్నెట్లతోనే శ్రీకారం చుట్టాలి. ఈ ఉత్పత్తికి అవసరమైనవన్నీ భారత్‌లోనే తయారైతే సరఫరాకు డోఖా ఉండదు. అలా చూసుకుంటే, ఇటీవలి కాలంలోలాగా మనం తెల్ల మొహం వేయాల్సిన పని ఉండదు.
‘మేడ్ ఇన్ ఇండియా’ను మనం మరింత ఆశావహ దృక్పథంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళడం అవసరం. అదే నిజమైన రోజున, చైనా మనల్ని విమర్శించడం, ఒత్తిడి తేవడం మానుకుంటుంది. కనుక, భారత్–చైనా అనతికాలంలోనే చెట్టపట్టాలేసుకుని తిరుగుతాయని ఆశ పెట్టుకోవడం మానండి. నిజం చెప్పాలంటే, అవి రెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ రెండవదాని ఆలోచనలు, కుట్రలను కనిపెట్టే పనిలో ఉన్నాయి.
గౌతమ్ బంబావలే
వ్యాసకర్త చైనాలో భారత మాజీ రాయబారి;
పుణె ఇంటర్నేషనల్ సెంటర్ ట్రస్టీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)