మన ఐఐటీలు ఆత్మహత్యా కేంద్రాలా?

Sakshi Guest Column On IIT Students Suicides

టెక్నాలజీలో భారత్‌ను పటిష్ఠంగా మార్చాలన్న లక్ష్యంతో దేశంలో ఐఐటీలను నెలకొల్పారు. కానీ విదేశాల్లో కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగిన తర్వాతే నిజంగా వీటి వైపు చూడటం మొదలైంది. దాంతో వీటిలో సీటు సంపాదించడమే లక్ష్యంగా కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

ఇక్కడి చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఒకటైతే; ఐఐటీల్లో చేరాక అక్కడి పోటీని తట్టుకోలేక తీవ్ర చర్యకు విద్యార్థులు దిగడం మరొకటి. ప్రొఫెసర్ల నిరంకుశ విధానాలు విద్యార్థుల మీద విపరీత ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యార్థులను దేశం ఆధారపడగల సమర్థ ఇంజనీర్లుగా, సాంకేతిక నిపుణులుగా మలచడానికి బదులుగా... విద్యా కర్మాగారాలుగా ఐఐటీలను మార్చడమే ప్రొఫెసర్ల ప్రాథమిక లక్ష్యంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. 

జవహర్‌లాల్‌ నెహ్రూ 1950లలో దేశంలో మొట్టమొదటి ఐఐటీని ఖరగ్‌పూర్‌లో నెలకొల్పారు. బోస్టన్‌లోని ఎమ్‌ఐటీ ప్రమాణాలకు అనుగుణంగా మన ఇంజినీరింగ్, టెక్నాలజీలను ప్రభావితం చేయ డమే దీని లక్ష్యం. అయితే అమెరికా, యూరప్‌లలో కంప్యూటర్‌ ఆధా రిత ఉద్యోగాలకు ఉన్నట్లుండి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలోనే 1995 ప్రాంతంలో ఐఐటీలకు నిజమైన డిమాండ్‌ పెరిగింది. తదనుగుణంగా అనేక ఐఐటీలను ప్రారంభించారు. ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటీ, ఒక ఎన్‌ఐటీ ఉంటున్నాయి.

రాన్రానూ డిమాండ్‌ పెరుగు తుండటంతో, మూడు ప్రవేశ పరీక్షలతో కూడిన సంక్లిష్ట ప్రక్రియను ఐఐటీలు ప్రవేశపెట్టాయి. జేఈఈ–1(నవంబర్‌/డిసెంబర్‌), జేఈఈ– 2 (ఫిబ్రవరి), జేఈఈ–అడ్వాన్సుడ్‌ (జూన్‌). ఇంటర్‌ సిలబస్‌ పూర్తి కావడానికి ముందే తొలి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నది స్పష్టం. సిలబస్‌ బీఎస్సీ సెకండ్‌ ఇయర్‌ స్థాయిలో ఉంటుంది. అంటే ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో చేరాలని విద్యార్థులకు ఇది స్పష్టమైన సంకేతం.

అందుకనే, ఇంటర్మీడియట్‌ గొలుసుకట్టు/కార్పొరేట్‌ రెసిడెన్షి యల్‌ కళాశాలలు దేశమంతటా, ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక్కడ చదువుకు అనుగుణమైన వాతావరణం ఉండదు. చిన్న నిద్రించే గదులుంటాయి, క్రీడలకు చోటుండదు, బయటి ప్రపంచంతో సంబంధాలుండవు. ఐఐటీలో సీటు కొడతారని, కోట్లాది రూపాయల వేతనాన్ని ఆర్జిస్తారని తల్లిదండ్రులు తమ పిల్లలను వీటిలో చేర్పిస్తారు. మరోవైపున క్రూరమైన టీచర్లు అవకాశం దొరికినప్పడల్లా విద్యార్థులను బాదిపడేస్తుంటారు.

నిలబెట్టి మరీ అవమానిస్తుంటారు. ఆత్యహత్యకు పాల్పడటం కంటే ఎలాంటి అవకాశాలు విద్యార్థులకు ఉండటం లేదు. మానసిక కౌన్సెలింగ్‌ గురించి వారికి ఏమీ తెలీదు. టీచర్లు, వార్డెన్ల భౌతిక క్రూరత్వం, ఒక టీచర్‌ నిర్దాక్షిణ్యంగా బాదినప్పుడు తీవ్రంగా బాధ పడిన డేవిడ్‌ కాఫర్‌ఫీల్డ్‌ను గుర్తుకు తెస్తుంది. (1850లలో చార్లెస్‌ డికెన్స్ ఇదే పేరుతో రాసిన నవల ఇది). 2020లలో కూడా ఇలాంటి ఉదంతాలకు మనం సాక్షీభూతంగా ఉండటం దురదృష్టకరం.

2022 జనవరి 1 నుండి 2023 మార్చి వరకు 12 మంది ఇంట ర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్యల పాలబడటం ఆందోళనకరమైన వాస్తవం. తాజాగా 2023 మార్చి 1న హైదరాబాద్‌ నగరంలోని రెసిడెన్షియల్‌ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్‌ బాలుడు ఆత్మ హత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు ఒక బలమైన సలహా ఏమిటంటే, పిల్లలు గణితంలో మెరుగ్గా ఉంటేనే జేఈఈ రెసిడెన్షియల్‌ కాలేజీలను ఎంచుకోవాలి.

2022 నాటికి, ఐఐటీ–జేఈఈ కోసం 11 నుండి 12 లక్షల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 2.7 శాతం మాత్రమే దేశంలోని100 కేంద్ర విద్యా సంస్థల్లో చేరగలరు. ఇటీవలి కాలంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ కళాశాలల వంటి విద్యాసంస్థలను, విద్యార్థుల ఆత్మహత్యలనే తరంగం వేధిస్తోంది.

పరీక్షా వైఫల్యాలు, విద్యాపరమైన ఒత్తిడి, కులం, పట్టణ–గ్రామీణ, ధనిక –పేద, ఆంగ్ల నైపుణ్యం వంటి వివిధ కారణాలు ప్రకాశవంతమైన యువ మనస్సులను తీవ్రమైన చర్యలను ఆశ్రయించడానికి కారణ మవుతున్నాయి. 2018 నుంచి 2022 మధ్యకాలంలో కేంద్రీయ విద్యాసంస్థలైన ఐఐటీల్లో 33 మంది, ఎన్‌ఐటీల్లో 24 మంది ఆత్మ హత్య చేసుకున్నారని రాజ్యసభలో విద్యా మంత్రి పేర్కొన్నారు. 

అనేక ఐఐటీలలో, ఒక సాపేక్ష గ్రేడింగ్‌ విధానం అమలులో ఉంది. ఇందులో ఒక వ్యక్తి పనితీరును ఇతర ప్రకాశవంతమైన సహ విద్యార్థులతో పోల్చి కొలుస్తారు. దురదృష్టవశాత్తూ, ఈ వ్యవస్థ ఆచార్యులకు అపారమైన అధికారాన్ని కల్పిస్తుంది. వారు నిర్మాణాత్మక బోధన, పరిశోధనల కంటే తరచుగా వారి వ్యక్తిగత ప్రాధాన్యతలకు చోటిస్తారు.

విద్యార్థులు ఈ సాపేక్ష గ్రేడింగ్‌ విధానం ఆధారంగా ఉన్నత ర్యాంకుల కోసం పోటీపడుతున్నందున, విద్యాపరంగా, వ్యక్తిగతంగా ప్రత్యర్థులుగా మారతారు. తమ సొంత గ్రేడ్లకు హాని కలిగిస్తారనే భయంతో విద్యార్థులు ఎలా కట్‌–థ్రోట్‌ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు, నోట్సును ఎవరికీ చూపకుండా ఎలా దాచిపెట్టుకుంటున్నారు, ఒకరికొకరు సహకరించుకోవడానికి ఎలా నిరాకరిస్తున్నారు అనే అంశాలు దిగ్భ్రాంతికరమైన వివరాలు చెబుతున్నాయి.

ఐఐటీల్లోని ప్రొఫెసర్లు తరచుగా తమను తాము క్రమశిక్షణకు సంరక్షకులుగానూ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి స్వయంప్రకటిత కర్తలు గానూ భావిస్తారు. వాస్తవానికి ఐఐటీలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లేదా పరిశోధన, అత్యాధునిక పురోగతి విషయంలో గణనీ యమైన కృషి చేసిన ప్రొఫెసర్లు చాలామంది లేరని తెలుసుకోవడం నిరుత్సాహం కలిగిస్తుంది.

విద్యార్థులను దేశం ఆధారపడగల సమర్థ ఇంజనీర్లుగా, సాంకేతిక నిపుణులుగా మల్చడానికి బదులుగా... విద్యా కర్మాగారాలుగా ఐఐటీలను మార్చడమే ప్రొఫెసర్ల ప్రాథమిక లక్ష్యంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. అకడమిక్‌ లిటరేచర్ని, ర్యాంకింగు లను నిశితంగా పరిశీలిస్తే, ఐఐటీలలోని పరిశోధనా ఫలితాలు పాశ్చాత్య దేశాలతో సమానంగా లేవని తెలుస్తుంది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వేలోని టాప్‌ 200 ర్యాంకులలో ఏ ఒక్క ప్రధాన ఐఐటీ కనిపించలేదు. 

సాహా, పీసీ రే, ఎస్‌.ఎన్‌.బోస్, విశ్వేశ్వరయ్య, కెఎల్‌. రావు, రామన్, కృష్ణన్, హోమీ భాభా వంటి గొప్ప శాస్త్రవేత్తలతో పోల్చ దగినవారిని ఎంతమందిని స్వతంత్ర భారతదేశంలో మనం తయారు చేశాం? హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో సహా మన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఇప్పటికీ గ్లోబల్‌ టెండర్లపైనే ఆధారపడతాము.  

నౌకలను మరమ్మతు చేయడానికి కూడా మనవద్ద సాంకేతికత లేనందున రష్యాపై ఆధారపడుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్‌ లోని కోనసీమ సహజ వాయువు పైప్‌లైన్‌ 20 రోజులు నిరంతరం మంటలతో ప్రజ్వలించినప్పుడు, వాటిని ఆర్పడానికి కూడా మనం నీల్‌ ఆడమ్స్‌ను విదేశాల నుండి రప్పించాల్సి వచ్చింది.

ఐఐటీల్లో ఆత్మహత్యలు, ఒత్తిడి లేకుండా సమగ్ర మూల్యాంకనాన్ని నిర్ధారించడానికీ, ఐఐటీలలోని విద్యా, సామాజిక వాతా వరణాన్ని పరిశోధించడానికీ ‘అంబుడ్స్‌మన్‌ రకం’ వ్యవస్థను నియమించాలి. నియమాలు, అకడమిక్‌ గ్రేడింగ్‌ విధానాలను అన్ని ఐఐటీలలో ప్రామాణీకరించాలి.

ఐఐటీ చార్టర్లలో నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. మనం తరచుగా వార్తాపత్రికలలో ఐఐటీల పరి శోధనా నివేదికలను చూస్తాము. ఇవి తరచుగా ‘తదుపరి అధ్యయ నాలు అవసరం’ అని ముగుస్తుంటాయి. 

ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యల ప్రాబల్యం ఒక బాధాకరమైన సమస్య. ఈ ఆత్మహత్యల వల్ల అంతర్జాతీయ విద్యా సంస్థలు, యాజమాన్యాల ముందు మన భారతీయ ప్రతిష్ఠ పలుచబారుతుంది. చివరగా, ఐఐటీలలో చేరే ప్రవేశ ప్రక్రియను వికేంద్రీకరించాలని సూచిస్తున్నాం.

ప్రతి రాష్ట్రం ఒక ప్రవేశ బోర్డును కలిగి ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలలు, ప్రైవేట్‌ లేదా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆత్మహత్యలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ ప్రైవేట్‌ ఇంజి నీరింగ్‌ కళాశాలల నుండి లక్షలాది మంది విద్యార్థులు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ కంప్యూటర్‌ ఆధారిత కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు.

ఐఐటీ డిగ్రీ లేకపోయినా జీవితం ఉంది. టెక్నా లజీలో భారత్‌ను పటిష్టంగా మార్చాలన్న నెహ్రూ ఆశయం సమీప భవిష్యత్తులో నెరవేరుతుందా? నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ –2020) ఈ అంశాలను పరిశీలించాలి.

డాక్టర్‌ కె. నాగయ్య, చీఫ్‌ సైంటిస్ట్, సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ, హైదరాబాద్‌; ప్రొ‘‘ జి. శ్రీమన్నారాయణ, రిటైర్డ్‌ ప్రొఫెసర్, కెమిస్ట్రీ విభాగం, ఉస్మానియా; ఫణిరాజ్‌ జి., ఐటీ ప్రొఫెషనల్, అమెరికా 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top