స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...

Sakshi Guest Column On Constitution by ABK Prasad

ప్రాథమిక హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు బోధించేదీ, తమ దైనందిన జీవితాలను ఎలా తీర్చి దిద్దుకోవాలో చెప్పేదీ రాజ్యాంగమే అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఆ రాజ్యాంగం పాలితులకు బోధలే కాదు, పాలకులకు హితబోధలూ చేసింది. కానీ వాటిని పెడచెవిన పెట్టడమే నేటి దేశ దుఃస్థితికి కారణం. మైనారిటీల ఉనికిని తక్కువ చేసేలా పౌర చట్టాన్ని సవరించే ప్రయత్నం ఇందుకు ఒక ఉదాహరణ. వందిమాగధులుగా ప్రవర్తించేవారినే గవర్నర్లుగా నియమించడం మరొక ఉదాహరణ. నిరసనకారులపై అక్రమ కేసులు బనాయించడం మరో ఉదాహరణ. అయితే దీనికి విరుగుడు మళ్లీ రాజ్యాంగంలోనే ఉంది. దాని వెలుగులో ప్రజలు స్తబ్ధత వదిలించుకోవడంలోనే ఉంది.

‘‘మహాత్మాగాంధీ దేశంలో ఒక గ్రూపునకు వ్యతిరేకంగా మరో గ్రూపును రెచ్చగొట్టే పద్ధతిని ఎన్నడూ అనుసరించలేదు. ఆయన హిందువే కావొచ్చు, కానీ దేశ పౌరులయిన ముస్లింలను దేశ స్వాతంత్య్రానికి ముందు కూడా ప్రేమించారు. గాంధీజీ అనుసరించిన విధానం న్యాయబద్ధమైన సంస్కృతికీ, పౌర నీతికీ, సహృదయంతో కూడిన జాతీయ సమైక్యతకూ నిద ర్శనం. అలాంటిది ఇతర మైనారిటీల పట్ల నేడు అనుసరిస్తున్న ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలకు  భారతదేశం తలదించుకోవలసి వస్తోంది.’’
– నోబెల్‌ బహుమాన గ్రహీత,సుప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ (15 జనవరి 2023)

‘చింత చచ్చినా పులుపు’ చావలేదు. రాజ్యాలు అంతరించినా, దేశ పాలకుల్లో తెచ్చిపెట్టుకున్న రాచరికపు లక్షణాలు చావడం లేదు. దేశంలోని అసంఖ్యాక మైనారిటీ జాతుల ఉనికిని, వారి ప్రయోజనాలను తక్కువ చేసేలా పౌర చట్టాన్ని కొత్తగా సవరిస్తూ రూపొందించడం ఇందుకు ఒక ఉదాహరణ. పార్లమెంటులో నిర్దుష్టమైన చర్చ జరక్కుండానే ఆమోదించినట్టు పాలకులు ప్రకటించిన మరునాడే, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పొందినట్టు వెల్లడించారు. అయినా చట్టం అమలులోకి రాకుండా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? దానికి కారణం–కొత్త చట్టం కింద రూల్స్‌ రూపొందించలేక పోవడం! 

కాగా, త్రిపురలోని ఏ వామపక్ష ప్రభుత్వాన్ని, అందులోనూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దేశ పాలకులు కూలదోసి కులుకుతున్నారో– అదే ఢిల్లీ పాలకులకు నిద్ర లేకుండా చేస్తూ త్రిపురలోని అనేక ఆదివాసీ తెగలను సమీకరించి, ‘గ్రేటర్‌ తిప్రాలాండ్‌’ (బృహత్‌ త్రిపుర) పేరిట ‘తిప్రహా దేశీయ అభ్యుదయ ప్రాంతీయ సమాఖ్య’ను ప్రద్యోదత్‌ విక్రమ్‌ మాణిక్య దెబ్రమా నెలకొల్పారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సమాఖ్య ఏర్పడింది. ఈ బృహత్‌ త్రిపుర 19 తెగల ప్రజా బాహుళ్యం విస్తరించి ఉన్న ప్రాంతం.

ఈ ఆదివాసీ ప్రజా బాహుళ్యా నికి ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ వాటికి రక్షణ లేకపోయినందునే  తాజా బృహత్‌ ఉద్యమానికి వారు సిద్ధమయ్యారు. త్రిపుర రాష్ట్ర సరి హద్దులలోనే ‘గ్రేటర్‌ తిప్రాలాండ్‌’ నెలకొల్పుకోవడానికి పూను కున్నారు. త్రిపురలో బీజేపీ–ఆరెస్సెస్‌ పాలనకు ఇప్పుడీ ‘గ్రేటర్‌ తిప్రాలాండ్‌’ ‘దేవిడీమన్నా’ చెప్పడంతో ఢిల్లీ పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. 

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ(24 నవంబర్‌ 2022)– చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శకులు చెబితే సరిపోదనీ, నిజానికి భారతదేశ చరిత్రను తిరగ రాయాల్సిన సమయం వచ్చిందనీ చెప్పారు. ఈ దేశంలో 150 సంవత్సరాలకు మించి ఏ ప్రాంతంలో అయినా కనీసం 30 రాజ్యాలు పరిపాలించిన ఉదాహరణలతో పండితులూ, విద్యార్థులూ పరిశోధించి తెల్పడానికి ముందుకు రావాలని విన్నపాలు చేశారు. ‘మన చరిత్ర వక్రీకరణలకు గురైంది.

దాన్ని సరి చేయడానికి మనం కష్టపడి పనిచేసి చరిత్రను సరి చేయాలి’ అని అమిత్‌ షా బాహాటంగానే ప్రకటిస్తున్నారు. పాలకులు ఏది పలికినా శాసనమై కూర్చుంటే, ఇంక వేరే జనవాక్యానికి స్థానమేదీ? అందుకే, అటు పాలకులకూ, ఇటు పాలితులకూ నైతిక విలువలు బోధించేది భారత లౌకిక రాజ్యాంగమేననీ, అదే సర్వులకూ నైతిక విధాన బోధిని అనీ దేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెబుతూనే వస్తున్నారు.

‘దేశ ప్రజల్ని స్తబ్ధతలో నుంచి చైతన్యంలోకి మేలుకొల్పి, ప్రాథమిక హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో బోధించి, తమ దైనందిన జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పే గైడ్‌’ రాజ్యాంగమే అని ఆయన అన్నారు. అందువల్లే ప్రజల దైనందిన అవసరాలతో నిమిత్తం లేకుండా అర్ధంతరంగా పెద్ద నోట్లను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పాలకులు తీసుకున్న నిర్ణయాన్ని నిశితంగా ఖండించారు.

జమ్ము–కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని (370వ అధికరణ) ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో, అవినీతికి దారులు తెరిచే ఎలక్టోరల్‌ బాండ్స్‌ను ఎందుకు ప్రవేశ పెట్టవలసి వచ్చిందో తెల్పాలని నిగ్గ దీశారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేయమని కోరే హక్కును ప్రభుత్వానికి ఎవరిచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందంటే పాలకుల స్థాయిని అనుమానించవలసి వస్తోంది. 

ఇక రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో వారి ప్రవర్తనను కనిపెట్టి ఉండటంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ పాటించిన న్యాయ సూత్రాలు ఇప్పుడు గాలికి ఎగిరిపోయాయి. పాలక పార్టీలకు వందిమాగధులుగా ప్రవర్తించే అవకాశవాద రాజకీయ శక్తులనే గవ ర్నర్లుగానూ, ఉపరాష్ట్రపతులుగానూ నియమించే దుఃస్థితికి పాలకులు దిగజారిపోవడాన్ని చూసి దేశం విస్తుపోతోంది. ఈ పరిస్థితుల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌ దేశ ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు కొనసాగనుండటం 2024లో రాబోతున్న సాధారణ ఎన్నికల నిర్ణయాలపై పాలకుల ప్రభావానికి గండి కొట్టగల పరిణామంగానే భావించాలి.

అంతేకాదు... ఒకనాటి భీమా కోరెగావ్‌ పోరాటాన్ని గుర్తు చేసు కుంటూ దళిత ప్రజా బాహుళ్యం జరుపుకొన్న ఉత్సవాలలో పాల్గొన్న వామపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఏళ్ల తరబడి జైళ్లపాలు చేసి వేధించడం ప్రజలు గమనించారు. ఈ సమస్య కూడా దేశ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి రాగానే ఆయన పాలక పద్ధతుల్ని విమర్శిస్తూ వామపక్ష రాజకీయ ఖైదీల్ని విడుదల చేయడమో, కఠిన శిక్షలను సడలించడమో జరుగుతోంది. అంతేగాదు, ఎల్గార్‌ పరిషత్, మావోయిస్టుల మధ్య సంబంధాల మిషతో పాలకులు బనాయించిన కేసు నుంచి ఆనంద్‌ తేల్‌తుంబ్డేను చంద్రచూడ్‌ కోర్టు విడుదల చేసింది. అంతకుముందే తేల్‌తుంబ్డే బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఐఏ పెట్టిన దరఖాస్తును సుప్రీం తోసిపుచ్చింది. 

నేటి తాజా దేశ పరిస్థితుల్ని సమీక్షించుకోవాలంటే – ఎన్నికల కమిషనర్ల దగ్గర నుంచి రాష్ట్రాల గవర్నర్ల వరకు పాలక పక్ష నాయకుల్ని మినహాయించి మరొకర్ని నియమించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. బహుశా అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ ‘రాజ్యాంగబద్ధమైన నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ప్రయోజనాలకు స్థానం ఉండరాదని’ స్పష్టం చేశారు.

అయితే ఈ నిర్ణయానికి తూట్లు పొడవడానికి ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రయత్నించిన ఫలితంగానే విరుద్ధ పరిణామాలకు చోటు దొరికింది. అలాగే న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే సంప్రదాయం మంచిది కాదనీ, కానీ ఇటీవలి కాలంలో ముగ్గురు సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా వచ్చిన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వల్ల కోర్టు స్వతంత్ర ప్రతిపత్తికి విలువ వచ్చిందనీ లా కమిషన్‌ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్‌ ప్రకాష్‌ షా అభిప్రాయపడవలసి వచ్చింది.

బహుశా అందుకే కాబోలు ఓ మహాకవి మనలో అసలు జబ్బు ఎక్కడుందో చెబుతూ – ‘‘మనల్ని చూసి మనం నవ్వుకోలేక పోవడమే ఏడుపంతటికీ కారణం/ ఇంకా ఎన్నాళ్ళీ ఏడుపు? ఇవాళ సమస్యల్ని పరిష్కరించలేక/ ఆధ్యాత్మికంలోకి పరుగెత్తుతారు/ పద్యాలచే పంటలు పండించగలవా?/ పప్పు రుబ్బించగలవా?’’ అని ప్రశ్నిస్తారు.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top