పరువు, ప్రతిష్ఠ – స్త్రీల భద్రత | Sakshi Editorial On Womens Day | Sakshi
Sakshi News home page

పరువు, ప్రతిష్ఠ – స్త్రీల భద్రత

Mar 8 2024 12:57 AM | Updated on Mar 8 2024 12:57 AM

Sakshi Editorial On Womens Day

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కె. ఎన్‌. మల్లీశ్వరి 

ఇటీవల ఝార్ఖండ్‌ పర్యటన కోసం వచ్చిన ఒక విదేశీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన విషయం అనేక చర్చలకి దారితీసింది. బాధితుల తరుపున వేసే ప్రశ్నని నేరంగా చూసే కర్మభూమి మనది. ఈసారి బాధ్యతని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ విమన్‌ రేఖా శర్మ తీసుకున్నారు. 

అర్ధరాత్రి, అటవీ ప్రాంతంలో గుడారం వేసుకుని పడుకున్న స్పానిష్, బ్రెజిలియన్‌ జంటమీద ఏడుగురు వ్యక్తులు దాడిచేసి వారిని కొట్టి, కత్తి చూపి చంపుతామని బెదిరించి, వారి విలువైన వస్తువులు దోచుకుని, మహిళని సామూహికంగా రేప్‌ చేశారు. ఆసియా పాత్రికేయ రంగంలో పదిహేనేళ్లుగా పని చేస్తున్న డేవిడ్‌ జోసెఫ్‌ వోలోజ్కో అనే జర్నలిస్ట్‌ తన అనుభవాల మేరకి భారతదేశంలో విదేశీ మహిళలు ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదని చెప్పాడు. 

ఇది వైరల్‌ అయి రకరకాల కామెంట్స్‌ మొదలయ్యాయి. అందులో రేఖా శర్మ వేసిన రీట్వీట్‌– జాతీయ మహిళా కమిషన్‌ వైఖరిని స్పష్టం చేసింది. ‘ఇటువంటి ఘటనల మీద మీరెప్పుడైనా పోలీసు రిపోర్ట్‌ ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే మీరు పూర్తిగా భాధ్య తారహితమైన మనిషి. కేవలం సోషల్‌ మీడియాలో రాసుకుంటూ దేశ పరువుని తీయాలనుకోవడం మంచిది కాదని’ హితవు పలికారు. పాతకాలపు సిని మాల్లో, సాహిత్యంలో స్త్రీలమీద అత్యాచారం జరిగిన ఘటనలు చూపించాల్సి వచ్చినపుడు కొన్ని విచి త్రాలు జరిగేవి.

‘ప్రాణం కన్నా మానం విలువైనదని’ చెప్పి ఆ స్త్రీపాత్రని చంపేయడమో, జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావమని సూచించడమో లేదా అత్యాచారం చేసినవాడు పెద్దమనసు చేసు కుని పెళ్లికి సిద్ధపడ డమో చూపించేవారు. పరువు ప్రతిష్ఠలన్నీ స్త్రీల శరీర శీలం చుట్టూ కమ్ముకుని ఉంటాయనీ, శీలంపోతే పరువుపోతుందనీ నమ్మేవారు కనుక మూతముప్పిడి వ్యవహారాలు నడిచేవి. కాలం మారింది. స్త్రీల మీద లైంగికహింస తగ్గకపోయినా, కనీసం అత్యాచారాన్ని ఎలా చూడాలన్న దృష్టికోణంలో కొన్ని మార్పుల యితే వచ్చాయి. అత్యాచారానికి గురైన ఆ విదేశీ మహిళ కూడా, ‘వారు నన్ను చంపకుండా వదిలి పెట్టారు. థాంక్‌ గాడ్‌’ అన్నది. దాడికి గురైన వాస్తవం తప్ప ఇందులో పరువు గోల లేదు. 

భారతదేశంలో విదేశీ స్త్రీలకే కాదు, స్వదేశీ స్త్రీలకి కూడా రక్షణ లేకపోవడం వాస్తవం. ఇటువంటి వర్త మానం ఉన్నచోట భారత మహిళల భద్రత కన్నా దేశపరువు గురించి ఆలోచించే రేఖా శర్మ లాంటివారు ‘కొత్త స్త్రీలు’. వీరు మహిళలని మధ్యయుగాలకి నడి పించుకు వెళ్లగల సమర్థులు.

ఈ ఘటన అటవీప్రాంతంలో జరిగింది. లైంగికంగా వేధించడం, అత్యాచారం చేయడం వంటి హింసాపద్ధతులని ప్రేరేపించే బైటి ప్రభా వాలకి అక్కడ ఆస్కారం తక్కువ. అటువంటిది మారుమూల ప్రాంతాల్లోకి కూడా కల్చరల్‌ పొల్యూషన్‌ వ్యాపించడమనేది జాగ్రత్త పడాల్సిన విషయం. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌ కి తీసుకువచ్చి, వారిని చూపించిన తీరుని బట్టి నిందితులు బహుశా స్థానికులు, అట్టడుగువర్గాల వారయ్యే అవకాశం ఉంది.

బాధితురాలు విదేశీ మహిళ, అందునా ధైర్యంగా రిపోర్ట్‌ చేసిన మహిళ అని సంకోచం ఉన్నట్లుంది గానీ లేకపోతే ఈపాటికే ‘ఎన్‌కౌంటర్‌ న్యాయం’ డిమాండ్‌ ఎల్లెడలా వూపు అందుకునేదే. నేరానికి కూడా కులమూ, వర్గమూ ఉంటుంది కనుక, అనువుగా దొరికే నేరస్థుల విషయంలో నేరాన్ని మించిన శిక్షలను విధించి ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారు కనుక, నిందితుల నేరానికి తగినశిక్ష మాత్రమే పడాలన్న మాటని పదేపదే ఇపుడు గుర్తు చేసుకోవాలి.
వ్యాసకర్త ప్రరవే (ఏపీ శాఖ) కార్యదర్శి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement