Sakina Ramachandraiah: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు

Sakina Ramachandraiah: Telangana Tribal Folk Artist Profile, Life Story - Sakshi

కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. 

డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది.

గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్‌: మన తెలుగు పద్మాలు వీరే...)

డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. 

అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్‌ మై ఫ్రెండ్‌!)

తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి)

– గుమ్మడి లక్ష్మినారాయణ 
ఆదివాసీ రచయితల వేదిక

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top