
అభిప్రాయం
అధికారం అంటే కేవలం రాజకీయ ఆట కాదు – ఇది పేదల జీవితాలను మార్చే, వారి కలలకు ఊపిరి పోసే బాధ్యత. వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ, ‘నవ రత్నాలు’ అనే తొమ్మిది స్తంభాల ద్వారా విద్య, ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడప వద్దకు చేర్చింది. ఈ పథకాలు పేదలకు సమాజంలో గౌరవం పెంచడమే కాదు... కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలను నిధుల కేటాయింపు లేకుండా చేసి వాటిని నీటి మీద రాతలుగా మార్చింది. ముఖ్యంగా వైద్యరంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టి వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ మెడికల్ కాలేజీలను ‘పబ్లిక్ – ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్’ (పీపీపీ) పేరుతో 66 ఏళ్లు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనుకోవడం!
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–2024 మధ్య నవరత్నాలను నూటికి నూరుశాతం అమలు పరచి ఏపీలో సుస్థిర సమగ్ర అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో వైఎస్సార్‌సీపీ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2,485 ఎంబీబీఎస్ సీట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023–24 నాటికి 5 కాలేజీలు ప్రారంభం కాగా, 750 సీట్లు అందు బాటులోకి వచ్చాయి. ‘ప్రతి పార్లమెంటరీ నియో జకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ’ అనే లక్ష్యం స్థాని కంగా నాణ్యమైన వైద్య శిక్షణను నిర్ధారించింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించి, ఆర్థిక భారం లేకుండా చికిత్సలు అందేలా చేసింది.
అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటైజేషన్ విధానం ఏపీలో పేదల ఆశలకు పెను ముప్పుగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ మోడల్ కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం పేదలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కాలేజీలు ఏటా తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లను అందించాయి. పేదలకు వైద్య విద్యను సరసమైనదిగా చేశాయి. కానీ, ప్రైవేటైజేషన్ తర్వాత ఫీజులు కేటగిరీ ఏ (కన్వీనర్ కోటా) సీటు రూ. 5–10 లక్షలు, కేటగిరీ బీ (మేనేజ్‌మెంట్ కోటా) సీటు రూ. 15–20 లక్షలకు చేరవచ్చని అంచనా. ఒక ఎంబీబీఎస్ కోర్సుకు రూ. 27.5–110 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇంత అధిక ఫీజులు పేదలకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తాయి.
ప్రజా ఆరోగ్య వేదిక (పీఏవీ) ఈ ప్రైవేటైజేషన్ 1,500 ఎంబీబీఎస్ సీట్లను ప్రభావితం చేస్తుందనీ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్ కోటాను 50% వరకు తగ్గి స్తుందనీ హెచ్చరిస్తోంది. ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణలో 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్ర యించుకోవచ్చు, పైగా ప్రభుత్వ కాలేజీల కంటే 10–20 రెట్లు ఎక్కువగా ఫీజులు ఉంటాయి. ఈ చర్య పేదలకు వైద్యవిద్యను పూర్తిగా దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. సేవా– ఆధారిత వైద్యుల సంఖ్యను తగ్గిస్తుంది. ఉదాహరణకు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో హాస్పిటల్స్‌కు అప్పగించిన తర్వాత సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే ధోరణి మెడికల్ కాలేజీల్లోనూ కనిపిస్తే, పేదలకు వైద్య సేవలు అత్యంత ఖరీదైనవిగా మారతాయి.
ఈ ప్రైవేటైజేషన్ విధానాన్ని విజయవాడలో 2025 ఏప్రిల్‌లో జరిగిన పీఏవీ సదస్సు ‘క్రూరం’ అని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ నలుగురిలో ఒకరు సరసమైన, నాణ్యమైన వైద్యం అందక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనీ, ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీ ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనీ హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లో 10 ట్రామా సెంటర్లను ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఖర్చులు 10–20 రెట్లు పెరిగాయి. ఇదే ఆంధ్రలో జరిగితే పేదలు ఉచితంగా పొందాల్సిన వైద్య సేవలను కోల్పోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సూపర్–స్పెషాలిటీ ఆసుపత్రులను పీపీపీ మోడ్‌లో నిర్మించాలనే కూటమి ప్రభుత్వ మరో ప్రణాళిక కూడా ఆరోగ్య రంగాన్ని వాణిజ్యీకరణ వైపు నడిపించనుంది. ఇది ఆరోగ్యశ్రీ వంటి పథకాలను బలహీనపరుస్తుంది. ఈ విధానం ప్రజల ఆరోగ్యం, ఆశల కంటే కార్పొరేట్ లాభా లకు ప్రాధాన్యం ఇస్తుంది.
చదవండి: ఎవరి కోసం ఈ ఒప్పందం?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. సొంత లాభాల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టే విధానాలను మేధావులు, ప్రజాస్వామ్య వాదులు తిరస్కరించాలి.
- తలకోల రాహుల్ రెడ్డి
సామాజిక ఆర్థిక రంగాల విశ్లేషకుడు