ప్రజా నిబద్ధతే నిఖిలేశ్వర్‌ కవిత్వ కొలబద్ద

RaghavaSharma Article On Nikhileshwar  - Sakshi

సందర్భం

నిఖిలేశ్వర్‌ ‘అగ్ని శ్వాస’కు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినా, ప్రజా నిబద్ధతే కొలబద్దగా వారి కవిత్వాన్ని తెలుగు సాహిత్య లోకం ఏనాడో గుర్తించింది. ‘నన్నయ్యను నరేం ద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి– లేపకు– నీ పీక నులిమి గోతిలోకి లాగు తాడు’ అంటూ దిగంబర కవిత్వానికి అంకురార్పణ చేసిన నిఖిలేశ్వర్‌ కవితా ప్రస్థానం ఆరున్నర దశాబ్దాల క్రితమే మొదలైంది. ఎంకి పాటలు పాడుకుంటూ, కరుణశ్రీ పద్యాలకు మురిసిపోతూ, భావకవిత్వం ఊపులో కవిత లల్లుతూ,  ఆత్మానుభూతి నుంచి  సమష్టిలోకి, లోకానుభూతిలోకి తొలి అడుగులు వేసిన కుంభం యాదవరెడ్డి దిగంబర కవిత్వం ద్వారా నిఖిలేశ్వర్‌గా రూపాంతరం చెందారు. ప్రజాపోరాటాలతో పెనవేసుకుని, వర్గ చైతన్యాన్ని పెంచే విప్లవ కవిగా శ్రామిక విప్లవ పోరాటాలతో మమేకమయ్యారు. 

నల్లగొండ జిల్లా వీరవల్లి గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో ఏకైక సంతానంగా 1938లో నిఖిలేశ్వర్‌ పుట్టిన ఏడాదికే తండ్రి నరసయ్య మరణించారు. ‘గునుగుపూల తెల్లని జడలు, మోదుగుపూల చిలుక ముక్కులు, గుల్‌మొహర్‌ పరచిన ఎర్రతివాచీ’ వంటి బాల్యపు జ్ఞాపకాలు ఆయన కవిత్వంలో పరిమళిస్తుంటాయి. నిజాం పాలనలో గ్రామాలపై రజాకార్లు పడి దాడులు చేస్తుంటే, గడ్డివాముల్లో దాక్కున్న బాల్యం ఆయనది. పొట్ట చేతపట్టుకుని తల్లితో కలిసి భాగ్యనగరానికి వలస వచ్చారు. సుల్తాన్‌ బజార్,  బాకారం, ముషీరాబాద్‌ వీధి బడులలో విద్యా భ్యాసం. చార్మినార్‌ సిగరెట్‌ ఫ్యాక్టరీలో కూలీగా తల్లి నర్సమ్మ శ్రమజీవనం. ఆయన ఆలోచనలు ఆర్యసమాజం మీదుగా హేతు వాదంలోకి, యామినితో కులాంతర వివాహానికి దారితీశాయి. నిఖిలేశ్వర్‌ 1956 నుంచే హిందీలో కవిత్వం రాయడం మొదలు పెట్టారు. కె. యాదవ రెడ్డి పేరుతో 1960–65 మధ్య భావకవిత్వం రాశారు. ‘నవ్యత నింపుకోవాలంటే కోపంగా వెనక్కి చూడు’ అంటూ ఆత్మానుభూతి నుంచే లోకానుభూతి వైపు తొంగి చూశారు. 

సమాజం కులతత్వం, మతత్వం, అవినీతి,  బంధుప్రీతి తప్ప, సమష్టి ప్రయోజనం కోల్పోయిన దశలో  కొత్త పేర్లతో ఆరుగురు దిగంబర కవులు 1965లో ఆవిర్భవించారు. ప్రపంచపు అచ్ఛాదనల్ని చీల్చుకుని, పెద్ద పెద్ద  అలలతో దిగంబర కవిత్వం ఒక ఉప్పెనలా విరుచుకుపడింది. ఆనాటి సమాజానికి ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ ఆరుగురు దిగంబర కవుల్లో నిఖిలేశ్వర్‌ది సొంత గొంతుక. ‘ఈ దేశంలో ప్రతినగరం నవ నవలాడే మహాగాయం. దూరం నుండి అది ఎర్రగులాబి. దగ్గరకు వెళితే అది రక్తస్రావపు వ్రణం’ అంటారు. దిగంబర కవులు 1966ను నిఖిలేశ్వర్‌ నామ సంవత్సరంగా నామకరణం చేశారు. దిగంబరత్వం మానసికమైనదేకానీ భౌతికమైనది కాదు. అయినా, ఆరుగురు దిగంబర కవుల్లో అతి తక్కువ బూతు పదాలు వాడింది నిఖిలేశ్వరే. ఆయన ఆర్మీలో సివిలియన్‌ ఉపాధ్యాయుడిగా, మద్రాసు ఎయిర్‌ ఫోర్స్‌లో సివిలియన్‌ క్లర్కుగా చేసినా, హైద రాబాద్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా స్థిర పడ్డారు. అంతకు ముందు గోల్కొండ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా కూడా చేశారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషలలో కూడా కవిత్వం రాశారు. అనేక కథలు, సాహిత్య వ్యాసాలు రాశారు. వీరి కవిత్వం ఇంగ్లిష్, హిందీతోపాటు పలు భాషల్లోకి అనువాద మైంది. ‘గోడల వెనుక’ జైలు జ్ఞాపకాలు 1972లో వచ్చింది. భారత–చైనా మిత్రమండలి తరపున 2015 డిసెంబర్‌లో, పదిమంది సభ్యుల బృందంతో కలిసి నిఖిలేశ్వర్‌ పదిరోజుల పాటు చైనాలో పర్యటించారు.

నక్సల్‌బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు నిఖిలేశ్వర్‌ను నిమ్మళంగా కూర్చోనివ్వలేదు. జ్వాలా ముఖి, చెరబండరాజు,  నగ్నమునితో కలిసి విరసం వ్యవస్థాపక సభ్యులయ్యారు. ఆయన కలం నుంచి ‘మండుతున్న తరం’ వచ్చింది. పీడీ యాక్టు కింద జ్వాలాముఖి, చెరబండరాజుతో కలిపి నిఖిలేశ్వర్‌ను 1971లో అరెస్టు చేసి 50 రోజులు జైల్లో పెట్టారు. ‘రోజూ తూర్పున ఎరుపెక్కే ఆకాశాన్ని, ద్వీపపు గోళాల్ని ఛేదించుకువచ్చే కిరణాల్ని, పశ్చిమాన ఎరుపెక్కే చంద్రుణ్ణి, రక్తస్నానం చేయించే సూర్యుల్ని ఎవరూ బంధించలేరు’ అంటారు జైలు నుంచి ‘నేరస్తుల ద్వీపం’లో.

‘దుక్కి దున్నిన చేతులకు దక్కిన దేమిటి?’ అని ‘ఈనాటికీ’ ప్రశ్నిస్తారు. ‘పిచ్చికుక్కల్లా కాటేసిన తుపాకుల చేతులు తిరిగి మన్నులోనే వెతుక్కోవాలి మానవత్వాన్ని’ అంటూ ఇంద్రవెల్లి కాల్పులపై పోలీసులకు ఆత్మబోధ చేస్తారు. ‘యథార్థాన్ని వికృతం చేసి వికటాట్టహాసం చేస్తున్న వెండితెర’ని తూర్పారబడతారు.

బాల్యంలో వీరవల్లి వదిలాక నిఖిలేశ్వర్‌ను హైదరాబాదే అక్కన చేర్చుకుంది. ‘ప్రతి మారుమూలా గతుకుల, అతుకుల గల్లీల్లో  అడుగులేస్తూ, పడుతూ, లేస్తూ, ఏడుస్తూ,  నవ్వుతూ’నే తిరిగారు. ‘సహనానికి హద్దులు చెరిపేసిన మతోన్మాదం’ అంటూ నాలుగు దశాబ్దాల నా మహానగరం’లో ఆవేదన వ్యక్తం చేస్తారు. ‘ద్వేషపు కత్తులతో అతి చల్లగా నెత్తుటి నెలవంక’ను ఆ మహా నగరంలో చూశారు. ‘ఈ దేశంలోని ప్రతినగరం నవనవలాడే మహాగాయం’ అని బాధపడుతూనే, దీనికి హైదరాబాద్‌ ఏమీ అతీతం కాదని సమాధానపడతారు. ‘ప్రశ్నించే గొంతులను, తెగించే యువకులను ఎన్‌కౌంటర్‌ చేస్తున్నదెవరు?’ అని ప్రశ్ని స్తారు. ‘చరిత్రపాఠాలను నేర్పలేని వారు చరిత్రను అసలే నిర్మిం చలేరు’ అని కుండబద్దలు కొడతారు.

‘అనామకమైన ఈ బతుకు లోయలో నా పాదముద్రల ఆనవాళ్ళు చూడాలని వెనక్కి తిరిగితే గతమంతా తవ్వని జ్ఞాపకాల గనిగా మారిపోయింది. పెంటకుప్పల మీంచి గంతు లేసి, వరి పొలాల తల నిమరగానే పట్నం గల్లీల్లో పరుగు పెట్టిన కాళ్ళు కొంత దూరం ఎగిరిపోయిన అక్షరాల పావురాళ్ళ’ అని ‘జ్ఞాపకాలకొండ’ను తవ్వితీస్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని ముసుగేసు కున్న కొత్త నియంత–గుర్రమెక్కి దౌడుతీస్తున్న వర్తమానం’ అని వ్యాఖ్యానిస్తారు.

‘కరగని కాలం కొవ్వొత్తిపై అగ్నిశిఖలా నేను, కొడిగట్టే క్షణాలతో చేయూతనిచ్చే జీవనోత్సాహం’ అని ‘అగ్నిశ్వాస’లో ‘అగ్ని స్పర్శ’ను అనుభవిస్తారు. ‘మన అడుగుల కింద నలిగి కూడా దుమ్ము దులుపుకుని లేచి వడివడిగా నడిచే పిపీలికం’ లోని పట్టుదలను కూడా ‘అగ్నిశ్వాస’లో మనకందిస్తారు. నిఖిలేశ్వర్‌ కవిత్వం ఒక్కసారిగా విరుచుకుపడి ఆగిపోయే ఉప్పెన కాదు. నిరంతరం అలలతో కదలాడే జీవనదిలా సాగుతుంది. తన చుట్టూ ఉన్న మనుషులతో, తనతో తాను నిత్యం సంభాషి స్తున్నట్టుంటుంది. ఉద్యమాల ఉధృతి, అనుభవాల గాఢత నిఖి లేశ్వర్‌ కవిత్వాన్ని నడిపిస్తాయి. ఆయన కవిత్వమంతా జీవితాన్ని వ్యాఖ్యానించడంతో సరిపెట్టుకోదు, జీవితాన్ని మార్చేదిశగా ఆలోచింపజేస్తుంది.


రాఘవశర్మ
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయుడు
మొబైల్‌ : 94932 26180 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top