అంబేడ్కర్‌ మాట కూడా వినరా?

M Jayalakshmi Guest Column On Gandhi And Ambedkar - Sakshi

గాంధీజీ–అంబేడ్కర్‌ మధ్య వివాదమూ, చర్చలూ, ఆ తర్వాత 1932 సెప్టెంబర్‌ 24న జరిగిన పూనా ఒడంబడిక– ఈ ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య   వివరించారు (సాక్షి; సెప్టెంబరు 23). యువతరంలో చాలామందికి అంతగా తెలియని ఉదంతమిది. 30 ఏళ్ళ యువ అంబేడ్కర్‌– అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలనీ; అదీ దళితుల ద్వారానే ఎన్నిక య్యేలా ఉండాలనీ బ్రిటిష్‌ పాలకులను కోరారు. ఇది హిందువులను చీలుస్తుం దనే కారణంతో గాంధీ వ్యతిరేకించినా, ‘కమ్యూనల్‌ అవార్డు’ పేరిట బ్రిటిష్‌వారు అంగీకరించారు.

ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ ఆమరణదీక్ష, ఫలితంగా అంబేడ్కర్‌పై ఒత్తిడి, చివరకు పూనా ఒడంబడిక జరి గాయి. దాని ఫలితమే నేడు అమలులోవున్న రిజర్వుడ్‌ స్థానాల విధానం. ఈ విధానంలో ‘నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నిక కావటం లేదు’ అన్న వాస్త వాన్ని లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఐతే అంబేడ్కర్‌ ఆశిం చినట్టుగా ఎన్నుకుంటే సామాజిక, రాజకీయరంగంలో ‘మౌలిక మార్పులు’ వచ్చేవి అనటం వాస్తవ విరుద్ధం.

ఈ విషయాన్ని 1955 నాటికే అంబేడ్కర్‌ గుర్తిం చారు. విద్యావంతులైన దళితులు, వారి ప్రతినిధులు దళిత జనబాహుళ్యాన్ని విస్మరిస్తున్నారని బాహాటంగా 1956 మార్చి 18 ఆగ్రా ఉపన్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా తమ భవంతిలోకి ఆహ్వా నిస్తే, వెళితే వెళ్ళండి. అమ్ముడుపోవాలనుకుంటే మీ ఇష్టం... ఇతరుల నుంచి కాదు, నా వాళ్లనుండే నాకు ప్రమాదం ఉన్నట్టుగా భావిస్తున్నాను’ అన్నారు.

అంబేడ్కర్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవ కుండా చూశాయి పాలకవర్గాలు. రాజ్యాంగం ఆమోద మైన రెండేళ్ళకే, వయోజన ఓటింగుతో జరిపిన పార్ల మెంటు తొలి 1952 ఎన్నికల్లోనూ (ఆయన ఓట్లలో నాల్గవ స్థానంలో ఉన్నారు), 1954 ఉప ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్‌ దళిత అభ్యర్థితో రిజర్వుడ్‌ సీటులోనే ఆయన్ని ఓడించారు. ఆమాటకొస్తే 1946లోని పరి మిత ఓటింగ్‌తో జరిపిన ఎన్నికల్లోనూ అదే స్థితి! సొంత రాష్ట్రం సంయుక్త మహారాష్ట్ర నుంచి గెలిచే సీటు లేక, తూర్పు బెంగాల్‌ వెళ్ళి అక్కడి దళిత, ముస్లిం పార్టీల మద్దతుతో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు.

తమ ప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న ఒక ‘రాజకీయ ఉద్యమా’నికి సన్నద్ధం కావాలని లక్ష్మయ్య రాశారు. ఇది సాధ్యం కాదు. గెలిచిన అభ్య ర్థులనే కాదు, పార్టీలనే కొనేస్తున్నారు, అమ్ముడు పోతున్నారు. ఎస్సీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ కమిటీ తన సమావేశంలో – అంబేడ్కర్‌ ఆధ్వర్యంలోనే– 1955 ఆగస్టు 21 నాడు ఒక తీర్మానం (నంబర్‌ 6) పాసు చేసింది, బొంబాయిలో ఏకగ్రీవంగా: ‘పార్లమెంటు, శాసనసభలు, మున్సిపాలిటీలు, జిల్లాబోర్డులు వంటి స్థానిక సంస్థలలో ఎస్సీలకున్న రిజర్వేషన్‌ నిబంధ నను వెన్వెంటనే – రాబోయే ఎన్నికలకు ముందే – రద్దుచేయాలి అని వర్కింగ్‌ కమిటీ భావిస్తున్నది’. ప్రభుత్వం ప్రచురించిన అంబేడ్కర్‌ సమగ్ర రచనల్లో ఉంది (వాల్యూం 17; పేజీ 439). ధనంజయ కీర్‌ రాసిన ప్రసిద్ధ జీవిత చరిత్రలోనూ దీన్ని పేర్కొన్నారు. రాజకీయ రిజర్వేషన్‌ని ‘రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని’ తీర్మానించినట్టు ఇలా పేర్కొన్నారు: కాంగ్రెసు నిలబెట్టిన ‘ఎలకల్లాటి’ ఎస్సీ అభ్యర్థులు, ఫెడరేషన్‌ నిల్పిన ‘సింహాలను’ వారి కేంద్రాల్లోనే ఓడించారని దిగ్భ్రాంతితో చేసిన తీర్మానం ఇది.

అంబేడ్కర్‌ అక్కడితో ఆగలేదు. తానే స్థాపించిన ఆ ఫెడరేషన్ని (ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీచేసి ఓడారు) రద్దుచేయటానికి, కులప్రాతిపదిక లేని రిపబ్లిక్‌ పార్టీ స్థాపనకు నిర్ణయించి 1956 సెప్టెంబర్‌ 30న ప్రకటిం చారు. ఆ డిసెంబర్‌ 6న మరణించారు పైవే కాదు, ఇంకా అనేక విషయాలను మేధావులు దాచిపెడుతుం టారు. తమకి అంగీకారం వున్నా లేకపోయినా అంబే డ్కర్‌ అభిప్రాయాలను, చరిత్రను మరుగుపరచడం అంబేడ్కర్‌వాదులకు తగదు. అంబేడ్కర్‌వాద నాయ కులు అనేకమంది కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు; కాంగ్రెస్‌తోనేకాదు, బీజేపీతోనూ బీఎస్పీ కలిసి పని చేసింది. అందువల్ల లక్ష్మయ్య సూచనలు సాధ్యం కావు, అభిలషణీయమూ కాదు.

– ఎం. జయలక్ష్మి
ఏజీఎం(రిటైర్డ్‌), ఆప్కాబ్, హైదరాబాద్‌  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top