ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు

Kaluva Mallaiah: Common Man Welfare Centric Rule in Andhra Pradesh - Sakshi

పాలకులను నిర్ణయించడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అనేది జగమెరిగిన సత్యం. తమ అభ్యున్నతికి కృషి చేసినపుడే ఏ నాయకుణ్ణయినా ప్రజలు ఆదరిస్తారు. ప్రజల కంచాల్లోకి పట్టెడన్నం, ఒంటిమీదికి గుడ్డ, ఉండటానికి నీడ, కుటుంబం గడిచేందుకు పని, చదువు, వైద్యం లాంటివి అందించిన వాడే ఊత్తమ పాలకుడు. అలాంటి పాలననందిస్తున్న యువ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సామాన్య ప్రజల సంక్షేమం, కనీసావసరాలు తీర్చడం కేంద్రబిందువుగా పాలన చేస్తున్నారు. కాబట్టే 2019 నుంచి ప్రతి ఎన్నికలోనూ ఆయన అఖండ విజయాలను సాధిస్తున్నారు. నూటికి నూరుశాతం విజయాలను సాధించడం ప్రజాభిమానం అపూర్వంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ ప్రజలను హృదయానికి హత్తుకొని వారికోసం అంకితమైన నాయకునికి మాత్రమే అది సాధ్యం.

ఇలాంటి ప్రజాదరణ చంద్రబాబుకి నచ్చదు. ప్రజలంటే చులకన. తనను ఎన్నుకోకుంటే వాళ్ళంతా పనికిరాని వాళ్ళ న్నట్టే. తాను మాత్రమే రాష్టాన్నీ... ఇంకా ఎక్కువగా మాట్లాడితే దేశాన్నీ ఏలగల సామర్థ్యమున్నవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయినప్పుడు, తనను ఓడించి ప్రజలు తప్పు చేశారని తమకు తాము క్షమాపణలు చెప్పుకుంటారని అన్నారు. ప్రజలను కించపరిచారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజూ బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. కోల్పోయిన ప్రజాభి మానాన్ని చూరగొనడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. కుట్రలూ, కుతంత్రాలూ చేసైనా గెలవడమే ధ్యేయంగా పన్నాగాలతో పదేళ్లు గడిపారు.

తెలంగాణ రాష్ట్రోద్యమం విషయంలో, అనైతిక పొత్తులతో ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ రెండునాల్కల ధోరణిని ప్రదర్శించి 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో బొటాబొటి మెజారిటీతో గెలిచినా, తెలంగాణలో టీడీపీ మటుమాయమయ్యే స్థితికి వచ్చింది. మరోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం, బలహీన సామాజిక వర్గాలను అణచివేయడంలో మునిగిపోయారు. పోలవరం సమస్య, రాజధాని సమస్య, నిరుద్యోగ సమస్య, ప్రజల చిరకాల సమస్యలు, చదువుల సమస్య ఏదీ తీర్చకుండా తెలంగాణపై అక్కసుతో విషం చిమ్మడంతో కాలయాపన చేశారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలంటే చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు అనేక కర్మాగారాలను మూసివేసి, వ్యవసాయం దండగని ప్రజల ఉసురు పోసుకున్నాడు తప్ప ప్రజలను ఆదరించలేదు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూశారు. 

ఎన్నికల్లో గెలువడం, ఓడిపోవడం సాధారణ విషయమే. కానీ చంద్రబాబుకు తనను  ఓడించడమంటే ప్రజలు తప్పు చేసినట్టే. తానేమీ చేయకున్నా తనను గెలిపించి తీరాలి, తనలాంటి  నాయకుడు  మరొక్కడు  లేరన్నది ఆయన అభిప్రాయం. నాడు వైఎస్సార్‌  ప్రభుత్వం, నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన మరునాటి నుండే అర్థం లేని విమర్శలు చేస్తూ చులకనైపోయారు. ఓ స్పష్టమైన రాజకీయ ప్రజామోద దృక్పథంతో పనులు చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం మొదలెట్టారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంటే ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు, చేస్తూనే ఉన్నారు.

నాడు చంద్రబాబు విమర్శలను వైఎస్సార్‌ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని బాబు నవ్వుల పాలయేట్టు చేశారో, రెండున్నరేళ్లుగా వైఎస్‌ జగన్‌ కూడా బాబు విమర్శలను, కుట్రలను అంతకంటే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అతిస్వల్పకాలంలోనే టీడీపీ తెలంగాణలో అంతమయేస్థితికి వచ్చింది. ఇప్పుడు రెండున్నరేళ్ల కాలంలో ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి అంతమయే స్థితికి  వచ్చింది. అందుకు కారణం బాబులో ఏ మార్పు రాకపోగా మరింత విలువలేని రాజకీయాల్లోకి  కూరుకుపోవడమే. మరోవైపున జగన్‌ ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తూ, దశాబ్దాలుగా ఏపీ కోల్పోయిన ప్రాభవాన్ని చంద్రబాబు కాలంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రతి గడపకూ ఏదో విధంగా ప్రభుత్వ పథకాలు చేరేట్టు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ తనదైన పాలనతో ఆంధ్రప్రజల హృదయాలను గెలుచుకుంటూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నారు.

చంద్రబాబు అబద్ధాల వాగ్దానాలు, అసత్య ప్రచారాలతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఆయనను ప్రతిపక్షంలోనూ ఉండని రీతిలో తమ తీర్పునిస్తున్నారు. అమరావతి చుట్టు వేలాది ఎకరాల భూములు తన వాళ్ళతో కొనిపించి అక్కడ రాజధాని  చేయాలని  సంకల్పించిన చంద్రబాబు ఐదేళ్ళలో ఆ పనిని కూడా చేయ లేకపోయాడు. అనేక గాయాలతో సలుపరింతలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌లోనూ ఆ గాయాల బారిన  పడకుండా ఉండాలని భావించారు జగన్‌. అందుకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. వెనుకబడి వున్న ఉత్తరాంధ్ర, రాయలసీమలు కూడా కోస్తాంధ్రతో సమానంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అందుకే మూడురాజధానులు. ఇది చంద్రబాబుకు, ఓ సామాజిక వర్గానికి నచ్చలేదు. అమరావతిలో రాజధాని పేరిట ప్రతిఘాత అభివృద్ధి నిరోధక ఉద్యమాలు చేయిస్తున్నారు. మూడు ప్రదేశాల్లో రాజధాని నేటి సామాజికావసరం.   

ప్రజల సానుభూతి పొందడానికి ఏడుపులు, తూడ్పులు పనికిరావని పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన నాయకుడికి తెలీకపోవడం శోచనీయం. శుష్కవాగ్దానాలు, శూన్యహస్తాలు, ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, నేలవిడిచి సాముచేయడం వల్ల ఏ నాయకుడూ తనకంటూ శాశ్వత ఓటు బ్యాంకును ఏర్పరచుకోలేడు. ప్రజలు మెచ్చే పాలన, ప్రజల కనీసావసరాలు తీర్చే పాలన, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే పాలన మాత్రమే శాశ్వత ఓటు బ్యాంకును తయారు చేసింది. మంచి సేద్యం, మంచి వైద్యసేవలు, నాణ్యమైన విద్య నందిస్తూ అనేక పథకాలతో ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న జగన్‌ పోలవరం, బహుళ రాజధానులు, కె.జి. టు పి.జి. ఒక్క సబ్జెక్టుగా మాతృభాషతో ఆంగ్లమాధ్యమ విద్యను పూర్తిచేసి ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేస్తారనడంలో సందేహంలేదు. తెలంగాణలో అంతర్థానమైన టీడీపీ ఏపీలో  ప్రతిపక్ష హోదానైనా పొందే విధంగా బతకాలంటే చంద్రబాబు ఆలోచనాధోరణి ప్రతికూలత నుంచి సానుకూలత వైపు మారాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలని నమ్మలేకుంటే ఆ స్థానాన్ని బీజేపీ లేక కాంగ్రెస్‌ తన్నుకు పోయే ప్రమాదముంది.


- డా. కాలువ మల్లయ్య 

వ్యాసకర్త కవి, రచయిత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top