దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కోసం చట్ట సవరణ! | Gujjula Eswaraiah Urges Parliamentary Action To Grant SC Status To Dalit Christians, Read Full Story To Get More Details | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా.. చట్ట సవరణ అత్యవసరం!

Apr 7 2026 2:16 PM | Updated on Apr 7 2026 2:31 PM

Gujjula Eswaraiah Views on Dalit Christian SC Status Issue

అభిప్రాయం

దళిత క్రైస్తవులకు షెడ్యూల్డు క్యాస్ట్‌ (ఎస్సీ) హోదాను నిరాకరిస్తూ భారత దేశ అత్యు న్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన తీర్పు దురదృష్టకరం. విజయవాడలో ఇటీవల వామపక్ష, కాంగ్రెస్, వైసీపీ తదితర రాజకీయ పక్షాలు; దళిత, క్రైస్తవ, ముస్లిం సంఘాలు; యువజన, విద్యార్థి, మహిళా సంస్థలను ఆహ్వానించి సీపీఐ ఈ తీర్పుపై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే అతని ఎస్సీ రిజర్వేషన్‌ హక్కు రద్దవుతుంది. ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు బీసీ(సీ) వర్గంలోకి వెళ్లి, వారి సామాజిక స్థితి మరింత దిగజారే ప్రమాదముంది.  రాష్ట్రపతి జారీ చేసిన 1950 రాజ్యాంగ ఆదేశంలోని క్లాజ్‌ 3 ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే షెడ్యూల్డ్‌ కులాల హోదాను పరిమితం చేయడం; ఇతర మతాలలోకి మారిన దళితులకు ఆ హోదాను నిరాకరించడం, రాజ్యాంగంలోని సమానత్వ హక్కులకు విరుద్ధమైనది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సీ – మాదిగ కులానికి చెందిన చింతాడ ఆనంద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (Chinthada Anand vs State Of Andhra Pradesh) కేసులో సుప్రీంకోర్టు (24.3.2026న) పేర్కొన్నట్లుగా – హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను షెడ్యూల్డ్‌ కుల సభ్యులుగా పరిగణించకూడదని చెప్పడం, రాజ్యాంగంలోని సెక్యు లర్‌ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. క్లాజ్‌ 3ని ‘కచ్చితమైనది, తిరుగు లేనిది’గా భావించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు, పురోగతికి తలుపులు మూసివేయడమే! ఈ పరిస్థితుల్లో, 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయడం అత్యవసరం.

లౌకికవాద సూత్రానికి దెబ్బ
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛను హామీ ఇస్తూ, దానిని ప్రాథమిక హక్కుల పరిధిలో చేర్చింది. వ్యక్తి తన ఇష్టానుసారం ఏ మతాన్నయినా ఆచరించే హక్కు కలిగి ఉండటం, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం. సదుపాయాలు, రిజర్వేషన్లు, చట్టబద్ధ హక్కులు పొందా లంటే హిందూ మతంలోనే కొనసాగాలని పరోక్షంగా నిర్బంధించడం, ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష దాడి చేయడమే! ఇది మత స్వేచ్ఛను నిర్వీర్యం చేయడమే కాకుండా, రాజ్యాంగం ప్రతిష్ఠించిన లౌకికవాద సూత్రాన్ని దెబ్బతీస్తుంది.

ఇక ఆర్టికల్‌ 341ను పరిశీలిస్తే... దాని నిర్మాణం స్పష్టంగా రెండు క్లాజులుగా ఉంది. మొదటి క్లాజు ప్రకారం – ఆయా రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ కులాలను రాష్ట్రపతి, సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన తరువాత బహిరంగ ప్రకటన ద్వారా నిర్దేశించవచ్చు. రెండవ క్లాజు ప్రకారం, షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడానికి పార్లమెంట్‌కు మాత్రమే చట్టబద్ధమైన అధికారం ఉంది. రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్‌ను మరో నోటిఫికేషన్‌ ద్వారా మార్చే అధికారం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ విధంగా చూస్తే... షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపులో మతాన్ని ప్రమాణంగా నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చినట్లు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను ప్రాతిపదికగా తీసుకుంది. ఆర్టికల్‌ 341లో నిజంగా అలాంటి అధికా రాలు ఉన్నాయో, లేదో సుప్రీంకోర్టు  సమగ్రంగా పరిశీలించలేదు.

చ‌ద‌వండి: ఇప్పసారా.. రెండు అంచుల క‌త్తి!

అంతిమంగా ఈ ఆర్డర్‌ సామాజిక న్యాయం కోసం కాకుండా, వర్గ ఆధిపత్యాన్ని కొనసాగించడానికీ, మత ఆధారిత నియంత్రణను బలపరచడానికీ ఉపయోగపడుతున్న సాధనంగా మారింది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం (ఫుల్‌ బెంచ్‌) ముందు ఈ అంశాన్ని పునర్వి చారణకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి. 1950 రాష్ట్రపతి ఆర్డర్‌లోని పేరా 3ను సవరించడం అత్యవసరంగా భావించాలి. దళిత క్రైస్తవులకు, ముస్లింలకు కూడా షెడ్యూల్డ్‌ కుల (ఎస్సీ) హోదా కల్పించేలా పార్లమెంట్‌ చట్ట సవరణ చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ అంశంపై స్పష్టమైన తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా తమ బాధ్యతను నిర్వర్తించాలి.  

గుజ్జుల ఈశ్వరయ్య
సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement