ఇప్పసారా.. రెండు అంచుల కత్తి! | Discussion on Ippa Puvvu Sara in Telangana | Sakshi
Sakshi News home page

ఆర్థిక స్వావలంబనా? సామాజిక సంక్షోభమా?

Apr 6 2026 8:03 PM | Updated on Apr 6 2026 8:13 PM

Discussion on Ippa Puvvu Sara in Telangana

అడవిలో పుట్టే ఒక చిన్న పువ్వు... పేద గిరిజన కుటుంబానికి ఆదాయం తెచ్చే మూలం అవుతుందా లేక సమాజాన్ని మరో మద్యం సంక్షోభంలోకి నెడుతుందా? ఇప్ప (మహువా) పువ్వుతో తయారయ్యే ఇప్పసారా చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఒక సభ్యుడు ఇప్పసారా, ఇప్ప పూలలో పోషకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాక ఇంతవరకు ప్రభుత్వాలు ఇప్పచెట్టు విలువను నిజంగా అర్థం చేసుకోలేక పోయాయి అనే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మధ్యప్రదేశ్‌లో చట్టబద్ధం!
సంప్రదాయంగా గిరిజనులు తయారు చేసుకునే ఇప్పసారాను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చట్టబద్ధం చేసి, ఉత్పత్తి, విక్రయాలను నియంత్రణలోకి తీసుకొచ్చింది. ఇది ఒక వైపు అభివృద్ధి కథలా కనిపిస్తే, మరోవైపు కొన్ని ప్రశ్నలను తీసుకొచ్చింది.

శతాబ్దాలుగా గిరిజనుల జీవనంలో ఇప్పపువ్వు భాగం. దీనితో తయారుచేసిన మద్యం ఒకప్పుడు ‘అనధికారిక మద్యం’. ఇప్పుడదే ‘హెరిటేజ్‌ లిక్కర్‌’గా మారింది. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఇది ఒక ఆర్థిక మార్పు. గిరిజన మహిళలు పూలను సేకరిస్తున్నారు. సహకార సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. లైసెన్స్‌ పొందిన యూనిట్లు సారా తయారు చేస్తున్నాయి. ఈ సారాను మార్కెట్లో బ్రాండ్‌గా విక్రయిస్తున్నారు. అంటే, అడవిలో పుట్టిన వనరుకు ఇప్పుడు విలువ గొలుసు ఏర్పడింది.

ఈ ప్రాజెక్ట్‌ వల్ల కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి: ఇప్పపూలకు స్థిరమైన ధర, మధ్యవర్తుల దోపిడీ తగ్గింపు, గిరిజన మహిళలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం... ‘పేదరికాన్ని తగ్గించాలంటే వనరులను విలువైనవిగా మార్చాలి’ అనే సిద్ధాంతానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.

మద్యం, అది ఏ రూపంలో ఉన్నా సమాజంపై ప్రభావం చూపే శక్తి కలిగి ఉంటుంది. ఈ మద్యం చట్టబద్ధమైతే అది ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే మద్యం వల్ల సమస్యలు ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే... సంప్రదాయ జ్ఞానం గిరిజనులది, కానీ మార్కెట్‌ లాభాల్లో వారికి తగిన వాటా అందటం లేదు. గిరిజనులు కేవలం ముడిసరుకు సరఫరా దారులుగానే మిగిలిపోతే, ఇది అభివృద్ధిగా కాక వ్యాపారీకరణగా మాత్రమే మిగిలిపోతుంది. లాభ ఫలాలు గిరిజనేతరులు తమ ఖాతాలో వేసుకుంటారు.

ఇప్పసారా ప్రాజెక్ట్‌ (Ippa Puvvu Sara) రెండు అంచుల కత్తి లాంటిది. ఒక వైపు ఉపాధి, ఆదాయం పెరగడంతో గిరిజనుల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మరో వైపు మద్యపానం వ్యసనంలా పరిణమించి ఆరోగ్య సమస్యలు, సామాజిక అసమతౌల్యానికి దారితీస్తుంది. ఈ రెండింటి మధ్య సంతులనం ఎలా సాధిస్తామనేదే కీలకం.

ఈ మోడల్‌ విజయవంతం కావాలంటే: మద్యం వినియోగంపై కఠిన నియంత్రణ ఉండాలి. గిరిజనులకు లాభాల్లో న్యాయమైన వాటా లభించాలి. మహిళా సంఘాలకు అధిక అధికారాలు ఇవ్వాలి. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు పెరగాలి. ఇవి లేకపోతే, ఇప్ప సారా ఒక ఆర్థిక ప్రయోగంగా కాక ఒక సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉందంటారు షేక్‌ రజియా. ఆమె బస్తర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో గిరిజన మహిళా సంఘాలతో ఇప్పపూలతో పలు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయించి దేశమంతా మార్కెట్‌ చేస్తున్నారు.

చ‌ద‌వండి: చ‌మురు సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా?

అడవిలో పుట్టిన పువ్వు, ఒక కుటుంబానికి అన్నం పెడుతుంది. అదే పువ్వు ఒక సమాజాన్ని మత్తులోకి నెట్టే శక్తి కూడా కలిగి ఉంది. ఇప్పసారాను ఆర్థిక సాధనంగా మార్చుకుంటామా? లేక దాన్ని సామాజిక భారంగా మారనిస్తామా? సమాధానం పాలసీల్లో కాదు, అమలులో ఉంది!

– శ్యాం మోహన్‌
ఆదివాసీల జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement