శాస్త్ర సలహాదారంటే ఈవెంట్‌ మేనేజరా?

Dinesh C Sharma Role of Scientific Adviser Office - Sakshi

విశ్లేషణ

పరిశోధన–అభివృద్ధి, సైన్స్‌ విద్య, వాతావరణ మార్పు, విద్యుత్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్‌ నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రధాన శాస్త్ర సలహాదారును నియమించింది కానీ, మునుపటి పనితీరునే కొనసాగిస్తే శాస్త్ర సలహాదారు ఆఫీసు కూడా అర్థరహితంగానే ఉండిపోతుంది. ప్రధానమంత్రి శాస్త్ర సలహా కమిటీ కార్యాలయం 1999లో ఉనికిలోకి వచ్చినప్పటికీ అది ‘పని పురోగతిలో ఉంది’ చందాన ఉండిపోయింది. వరుసగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు దాని క్రియాశీలక పాత్రపై దృష్టి పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు లేదా ఆయన కార్యాలయం ప్రభుత్వానికి ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా మిగిలిపోకూడదు.

భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు డాక్టర్‌ కె. విజయరాఘవన్‌ పదవీకాలం ఏప్రిల్‌ ప్రారంభంలోనే ముుగిసిపోయింది. ఆయన వారసుడిగా అజయ్‌ కుమార్‌ సూద్‌ని నియమించడానికి ప్రభుత్వం కాస్త సమయం తీసు కుంది. ఈయన బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌కి చెందిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త. కీలకమైన ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ సలహాదారు (పీఎస్‌ఏ) నియామకం విషయంలోనూ జాప్యం జరగటాన్ని అర్థం చేసుకోవడం క్లిష్టంగా ఉంటోంది. మాజీ పీఎస్‌ఏ విజయరాఘవన్‌ కూడా 2018 ఆగస్టులో ఏర్పడిన ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్మన్‌గా అదనపు బాధ్యతలను మోయాల్సి వచ్చింది.

భారత్‌లో లెక్కకు మించిన శాస్త్ర విభాగాలు, ఏజెన్సీలు ఉంటు న్నాయి. అలాగే పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విభాగాలు కూడా చాలానే ఉంటున్నాయి. దేశంలోని అన్ని శాస్త్ర సంస్థల పనిని సమన్వయ ధోరణిలో మార్గనిర్దేశనం చేసి ముందుకు తీసుకుపోవడానికి విస్తృత స్థాయిలోని ఏజెన్సీ అవసరమున్నట్లు కనిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి శాస్త్ర సలహాదారుగా 1999లో నియమితులైన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ తర్వాత భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలో అణుఇంధన సంస్థ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌. చిదంబరం ప్రధాన శాస్త్ర సలహాదారు అయ్యారు. 16 సంవత్సరాల పాటు ఈ పదవిలో అదనపు సమ యంలో బాధ్యతలు నిర్వహించిన చిదంబరం తర్వాత విజయ రాఘవన్‌ ఆయన స్థానంలోకి వచ్చారు.

శాస్త్ర సంబంధ వ్యవహారాల్లో భారత ప్రభుత్వానికి సలహా ఇవ్వగల యంత్రాంగం అవసరం ఉందని 1950లలోనే గుర్తించారు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశం శాస్త్ర పరిశోధన, విద్యను సంఘటితం చేయడానికి భారీ ప్రాజెక్టులను చేపట్టసాగింది. నూతన శాస్త్ర విభాగాలను నెలకొల్పింది. జాతీయ ప్రయోగశాలలు ఏర్ప డ్డాయి. ఉన్నతవిద్య, పరిశోధన సంస్థలు రూపుదిద్దుకుంటూ ఉండేవి. శాస్త్రజ్ఞుల కోసం, పోటీపడుతున్న ప్రయోజనాల కోసం వెదుకు లాడుతున్న కాలంలోనే ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ అన్ని పరి ణామాల సమన్వయం కోసం శాస్త్ర సలహా కమిటీలను కాలాను గుణంగా ఏర్పాటు చేస్తూ వచ్చారు.

ఈ శాస్త్ర సలహా కమిటీలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసు కున్నాయి. అనేక కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి చిక్కు సమస్యలను పరిష్కరించాయి. అంతరిక్ష పరిశోధనపై భారత జాతీయ కమిటీ (ఇదే తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా రూపొం దింది) కేంద్ర మంత్రిమండలికి శాస్త్ర సలహా ప్యానెల్‌ కృషి ఫలితంగానే ఆవిర్భవించింది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావ్‌ నేతృత్వంలో ప్రధానమంత్రి శాస్త్ర సలహా కమిటీ కొత్త సైన్స్‌ యూనివర్సిటీల – ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ – స్థాపనకు సిఫార్సు చేసింది.

ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం 1999లో ఉనికిలోకి వచ్చినప్పటికీ అది ‘పని పురోగతిలో ఉంది’ చందాన ఉండిపోయింది. వరుసగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు దాని క్రియాశీలక పాత్ర మీద దృష్టి పెట్టడంపై మనసు నిలుపలేక పోయాయి. ప్రభుత్వ వ్యవస్థలో శాస్త్ర సలహాదారుకు తగిన స్థానం కల్పించలేకపోయాయి. డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌కు కేబినెట్‌ ర్యాంకు ఇవ్వగా, చిదంబరంకు సహాయ మంత్రి ర్యాంకును ఇచ్చారు. జరుగుతున్న పనిపై నిశిత పరిశీలన లేకుండానే ఆయనను నిరవధికంగా తన పదవిలో కొన సాగడానికి అనుమతించారు. వాస్తవానికి ఆ పదవి రిటైరైన శాస్త్రజ్ఞు లకు విడిది స్థలం స్థాయికి కుదించుకుపోయింది. ప్రత్యేకించి అణు ఇంధన సంస్థలో రిటైరైనవారికి తుది మజిలీగా అది మారి పోయింది. బయోటెక్నాలజీ విభాగంలో సెక్రటరీగా అప్పుడే రిటైరైన విజయ రాఘవన్‌ని 2018 ఏప్రిల్‌లో ప్రధాన శాస్త్ర సలహాదారుగా నియ మించారు. కాకపోతే అదే సెక్రటరీ ర్యాంకునే కల్పించారు.

దీని ఫలితంగా, ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం మరో సాధారణ శాస్త్ర విభాగం స్థాయికే కుదించుకుపోయింది. పీఎస్‌ఏ కూడా ఇతర సెక్రటరీల్లాగే పనిచేసేవారు. 2018 ఆగస్టులో ప్రధాన శాస్త్ర సలహాదారును ప్రధాని సలహామండలి చైర్మన్‌గా కూడా చేశారు. విజయరాఘవన్‌ని ప్రధాని సలహామండలి చైర్మన్‌గా నియమించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సలహాదారు కార్యాలయాన్ని మరిం తగా కుదించివేసింది. ఎందుకంటే సలహా మండలి... ప్రధాన శాస్త్ర సలహాదారు ఆఫీసు ద్వారానే సేవలందిస్తుందని ప్రభుత్వ ఆదేశం స్పష్టంగా చెప్పేసింది. దీంతో పీఎస్‌ఏ కార్యాలయం ప్రభుత్వ విభాగం స్థాయికి కుదించుకుపోయింది.

అయితే నిర్దిష్ట శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో పరిస్థితిని అంచనా వేసేలా, సవాళ్లను పరిష్కరించేలా, అంతర్గత సంప్రదింపులు జరి పేలా, భవిష్యత్‌ రోడ్‌ మ్యాప్‌ను అభివృద్ధి చేసి దానికి అనుగుణంగా ప్రధానమంత్రికి సలహా ఇచ్చేలా తమకు ప్రధానమంత్రి సలహా మండలే వీలు కల్పిస్తుందని పీఎస్‌ఏ కార్యాలయం చెబుతూ వచ్చింది. అంటే సలహామండలి మాటే శిరోధార్యం అన్నమాట. దీంతో వాస్తవంగా ప్రధాని శాస్త్ర సాంకేతిక సలహాదారు ఎవరు? ప్రధాన మంత్రి సలహా మండలా లేక పీఎస్‌ఏ ఆఫీసా అని అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ రెండు వ్యవస్థల పాత్ర, స్థాయి పట్ల స్పష్టత ఇవ్వకుండా వాటిని మరింత దుర్వినియోగం చేశారు. సలహాలు ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసే స్థాయికి పీఎస్‌ఏ పాత్రను బద్నాం చేశారు.

ఉదాహరణకు, కొన్ని కర్తవ్యాల పురోగతిని పర్యవేక్షించడానికి ‘ఇన్వెస్ట్‌ ఇండియా’ ప్రాజెక్టు టీమ్‌లతో ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహా దారు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల కోసం ఈవెంట్లు, ప్రదర్శనలను నిర్వహించాలని శాస్త్ర సాంకేతిక సలహాదారును కోరారు. భారతీయ భాషల్లో సైన్స్‌ కమ్యూనికేషన్‌ని ప్రోత్సహించడానికి పీఎస్‌ఏ ఆఫీసు కసరత్తులు చేయాల్సి వచ్చింది. ఈ కర్తవ్యం కోసం అప్పటికే కనీసం మూడు పూర్తి స్థాయి ప్రభుత్వం ఏజెన్సీలు ఉనికిలో ఉన్నాయని మర్చిపోకూడదు. ఏవిధంగా చూసినా సరే... పీఎస్‌ఏ గానీ, ఆయన కార్యాలయం గానీ ఒక అమలు చేసే ఏజెన్సీగా, ప్రభుత్వం కోసం ఈవెంట్లు నిర్వహించే సంస్థగా ఉండకూడదు.

ఇక పాలసీ స్థాయిలో, ఇటీవల సాధించిన విజయం ఏమిటంటే, కొత్త నేషనల్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీని రూపొం దించడమే. దీని అమలు బాధ్యతను సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి ఇచ్చారు తప్పితే పీఎస్‌ఏకి గానీ, ఆయన ఆధ్వర్యంలో ఉండే ప్రధాని సలహా మండలికి గానీ కాదు. చివరకు ఫండింగ్‌ ఏజెన్సీల ద్వారా పరిశోధకులకు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చేయడం వంటి సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేని స్థాయికి పీఎస్‌ఏ కార్యాలయం తగ్గిపోయింది. పరిశోధన–అభివృద్ధి, సైన్స్‌ విద్య,  వాతావరణ మార్పు, విద్యుత్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో  భారత్‌ నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు మరీ సంక్లిష్టంగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రధాన శాస్త్ర సలహాదారును నియమించింది కానీ, మునుపటి పనితీరునే కొనసాగిస్తే శాస్త్ర సలహాదారు ఆఫీసు కూడా అర్థరహితం గానే ఉండిపోతుంది. శాస్త్ర సలహాదారు లేదా ఆయన కార్యాలయం ప్రభుత్వానికి ఈవెంట్‌ ఆర్గనైజర్‌గానో, అమలు చేసే ఏజెన్సీగానో మిగిలిపోకూడదు. ఈ నేపథ్యంలో భారత శాస్త్ర సలహాదారు కార్యాలయం పాత్రను పునర్నిర్వచించాలి. లేదా ఆ ఆఫీసును రద్దుచేయాలి.

వ్యాసకర్త: దినేష్‌ సి. శర్మ
సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top