అదే నిజమైన నివాళి

Chada Venkat Reddy Article In Telangana Armed Struggle - Sakshi

సందర్భం

ఏడవ నిజాం నవాబు హయాంలో జమీందారు, జాగీ ర్దార్, దేశ్‌ముఖ్, పటేల్, పట్వారి, భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఖాసీంరజ్వీ నాయకత్వాన నిజాం నవాబ్‌ రాజ్యాన్ని నిలబెట్టేందుకు మతపరమైన విషప్రచారం చేసేం దుకు రజాకార్లు ప్రయత్నం చేశారు. గ్రామాల మీద భూస్వాములతో కలిసి ప్రజ లను లూటీలు, హత్యలు చేశారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నందున నిజాం నవాబు అధికార భాష ఉర్దూగా ఉండేది.  అప్పుడు తెలుగులో విద్యాభ్యాసం, పాఠశాలలు ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితులలో మెదక్‌ జిల్లా జోగిపేటలో 1931లో తొలి ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది. దాని ప్రధాన తీర్మానాలు తెలుగులో విద్యా బోధన, గ్రంథాలయాల ఏర్పాట్లు జరగాలి. ఆ తర్వాత అనేక మహాసభలు జరి గాయి. భువనగిరిలో జరిగిన 15వ ఆంధ్రమహాసభ నూతనత్వాన్ని సంతరించుకున్నది. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరి రద్దు, తెలుగులో విద్యా బోధన అందుబాటులో రావాలని, గీసే వాడికే తాడిచెట్టు, దున్నేవాడిదే భూమి అనే విప్లవాత్మకమైన నినాదాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. 

ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు గెరిల్లా పోరాటానికి రూపకల్పన చేశాయి. ఉద్యమ నేపథ్యంలో 3,000 గ్రామాలు విముక్తి అయ్యాయి. 10 లక్షల ఎకరాల భూములు పేదల స్వాధీనంలోకి వచ్చాయి. అయితే బ్రిటిష్‌ వారితో సంప్రదింపులు చేస్తుండగానే 15 ఆగస్టు 1947న దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నిజాం నవాబ్‌ హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉంటుం దని ప్రకటించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో నవాబు రాయబారాలు సాగిస్తూనే, మరోవైపు ఉద్యమాన్ని అణచడానికి వినూత్న పద్ధతుల్లో ప్రయత్నించాడు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మాఖ్దూం మొహియుద్దీన్‌ సెప్టెంబర్‌ 11న రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు ప్రభంజనం అయింది. ఎట్టకేలకు 17 సెప్టెంబర్‌ 1948న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అనేక తర్జనభర్జనల పిదప 1951, అక్టోబర్‌ 21న సాయుధ పోరాటం విరమించారు. 1952లో హైదరాబాద్‌ స్టేట్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జైళ్ళలో ఉన్నా కమ్యూనిస్టు యోధులకు బ్రహ్మరథం పట్టి భారీ మెజారిటీతో గెలి పించారు. జవహర్‌లాల్‌ నెహ్రూకంటే అత్యధిక మెజారిటీతో నల్లగొండ నుండి రావి నారాయణరెడ్డిని గెలి పించి తెలంగాణ ప్రజలు భారతదేశాన్నే ఆశ్చర్యపరిచారు. ఇంతటి త్యాగాలు, వేలాదిమంది ఆత్మార్పణం, రక్తపాతం పిదప కూడా బూర్జువా పాలకులు చరిత్రను కనుమరుగు చేయ ప్రయత్నిం చారు. త్యాగాలు కమ్యూనిస్టులవి, భోగాలు బూర్జువా పాలకులవిగా మారాయి. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యకాంతి ఎలాగైతే ఆపలేరో తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు ఎవరు కనుమరుగు చేయజాలరు.

అలనాటి సాయుధ పోరాట త్యాగాలను మెచ్చుకున్న కేసీఆర్‌ ఈనాడు ఈ ఊసే ఎత్తడం లేదు.  సాయుధ పోరాట యోధుల త్యాగాలను శాశ్వతం చేయడానికి కనీసం ఆలోచించడం లేదు. ఆత్మగౌరవ పరిపాలన కనుచూపు మేరలో కనబడటం లేదు. కేంద్రంలో బీజేపీ మరింత మతోన్మాద చర్యలకు పాల్ప డుతున్నది. మరోవైపు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా అణగారిన ప్రజలు ఐక్యమై ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సన్నద్ధం కావాలి. అదే ఉద్యమకారులకు ఇచ్చే నిజమైన నివాళి.
వ్యాసకర్త :చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top