కుల గణనపై కుటిల రాజకీయాలు

Caste Based Census in India: National Political Parties Dual Stand, Mannaram Nagaraju Opinion - Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ఓబీసీల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పకతప్పదు. ఓబీసీలు అన్ని విధాలుగా ముందుకు వచ్చేందుకు కేంద్రం అడ్డుపడుతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు కుల గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం ఒక సాహసోపేతమైన చర్యే నని చెప్పవచ్చు. కానీ, బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా కుల గణనపై కుటీల రాజకీయాలు చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా ఏమి తక్కువ తినలేదు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు బీసీల హక్కులు, సామాజిక న్యాయం పట్ల  సోయే లేదు. అణగారిన ప్రజలు అప్పుడూ ఇప్పుడూ అధికారానికి దూరంగా ఉన్నా, కనీసం సామాజిక న్యాయానికి కూడా దూరమేనా అనే ఆందోళన యావత్‌ బీసీ సమాజాన్ని ఆవహించింది. కొత్తగా కులాల గణనను చేపడితే, గతంలో మండల్‌ కమిషన్‌ చెప్పిన 52 శాతం కంటే ఎక్కువగానే ఓబీసీ జనాభా ఉండొచ్చన్నది సర్వత్రా వినిపిస్తున్న టాక్‌. దీంతో కోటా కోసం మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుందని అగ్రకుల అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కల్గించవచ్చని అనధికారిక విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...)

దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తే 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రత్యే కించి యూపీలో బీజేపీ ఓబీసీల కారణంగా బాగా లాభపడి నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఓబీసీలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ఉపయో గించుకుంటున్నాయి. కానీ వారికి ఏ విధమైన లబ్ధి చేకూర్చడం లేదు. ఏపీ, తెలంగాణల్లో వైసీపీ, టీఆర్‌ఎస్‌ సాధ్యమైనంత మేరకు అవకాశం కల్పిస్తున్నాయి. జనాభా సేకరణ–2021లో కులగణనను చేర్చడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనడం నిజంగా బాధాకరం. ఈ నిర్ణయం అనేక తర్జనభర్జనల తర్వాత తీసుకున్నదని నరేంద్ర మోదీ సర్కారు సమర్థించుకుంటోంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వెనుకబడిన వర్గాల కులగణన చెయ్యడం పరిపాలనాపరంగా చాలా కష్టమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కష్టపడి చేసినా నమ్మదగిన, సరియైన సమాచారం రాదని, ఆ సమాచారాన్ని అధికారిక అవసరాలకు వాడు కోలేమని ప్రభుత్వం చెబుతోంది. కుల గణన డిమాండ్‌ను తిరస్కరించడానికి చెప్పిన ఈ వాదనలు పక్కా అబద్ధాలే. (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!)

భారత దేశానికి స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ పాలనలో 1881 నుంచి 1941 వరకు ప్రతి దశాబ్దానికొకసారి జరిగిన జనగణనలో కుల వివరాలు సేకరించారు. ఇప్పుడు అందరూ వాడుతున్న కులగణన లెక్కలు 1931 జనగణన లోనివే అన్న విషయం ఎంతమందికి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు కులగణన జరగడం లేదు. మనమెంతో మనకే తెలియని పరిస్థితి ఉంది. దీనిపై పోరాడాల్సిన అవసరం, ఆవశ్యకత యావత్‌ బహుజన సమాజంపై ఉంది. బీపీ మండల్‌ కమిషన్‌ ఈ గణాంకాలపై ఆధారపడే వెనక బడిన కులాల జనాభాను 52 శాతంగా అంచనా వేసిందని సామాజిక రంగ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు సోషల్‌ ఇంజనీరింగ్, సామాజికీకరణలు అంటూ పద బంధాలు వాడేది ఆ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగానే. మరి తాజా వివరాలు వస్తే... మనకు మరింత న్యాయం జరుగుతుంది కదా. 

2011లో యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో దేశ వ్యాపితంగా కుల గణన జరిగింది. అందులో 98.87 శాతం సమాచారం సక్రమంగా ఉందని 2016లో భారత సెన్సెస్‌ కమిషనర్‌ గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. 2011 కులగణనలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగినవే అయినా, వాటిని కేంద్ర ప్రభుత్వం భూతద్దంలో చూపి కులగణన అవసరాన్ని తిరస్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆరోపించినట్టు కులగణన వృథా అనుకోరాదు. దాని ద్వారా లభించే శాస్త్రీయమైన, సరైన సమాచారం వివిధ తరగతుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. దీని కోసం జరిగే సమరంలో కులగణన ద్వారా అందే వాస్తవ సమాచారం ఒక ఆయుధంగా వినియోగపడుతుంది. అందుకే కులగణన జరగాలని కోరుతున్నాం. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు)

తెలంగాణ బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి
అటు కేంద్రంలోనూ... ఇటు రాష్ట్రంలోనూ ఓబీసీ కుల గణనపై బీజేపీ వైఖరిలోని కపటత్వం అందరికీ తెలుస్తున్నది. ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ గణన చేపట్టాలని ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మాటల తీరు నిజంగా హాస్యాస్పదం. ఆయన సొంత ప్రభుత్వానికి ఓబీసీ ప్రెసిడెంట్‌గా కనీసం లేఖ కూడా రాయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలట. మరి బీజేపీ ప్రభుత్వాలకు ఎందుకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాయడం లేదో వివరణ చెప్పాల్సి ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ బీసీ నేతలకు కీలక పదవులు ఇస్తూ... సమూహ లబ్ధి జరిగే కుల గణన అంశాన్ని విస్మరించడం నిజంగా దుర్మార్గం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా బీసీ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించటం బీసీల పట్ల కేసీఆర్‌కు ఉన్న  చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం)

గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్ని కల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధా న్యముందో అందరికీ తెలిసిందే. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ చేపడితే హిందూ ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీకి ఏర్పడుతోంది. కులాలను పక్కనబెట్టి మతపరంగా ఎక్కువ జనాభాను తనవైపు తిప్పుకున్న బీజేపీ, ఇప్పుడు తన ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. కులాలవారీ జనగణన వల్ల కుల అస్తిత్వం, గుర్తింపు శాశ్వతమైపోతుందని ఆ పార్టీ భయపడుతోంది. సమాజంలో మార్పు రాదని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, కుల గుర్తింపు అనేది తమకు అవసరమని మిగతా వర్గాలు వాదిస్తున్నాయి. ఓబీసీలకు సమూల మార్పు కావాలంటే... కేంద్రంలో అధికారం వెలగబెట్టే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ప్రతి ఎన్నికలో బుద్ధి చెప్పడం అవశ్యం.


- మన్నారం నాగరాజు 

వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top