మేల్‌ చాట్‌ వస్త్ర సేవ ఎప్పుడు ప్రారంభమైంది?

Tirumala Melchat Vastram Seva History, Uniqueness, Abhishekam Seva - Sakshi

శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు అన్నింటిలోనూ విశిష్టమైనది ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక మరపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆలయంలో స్థలాభావం దృష్ట్యా ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే మహద్భాగ్యం 130 నుంచి 140 మంది భక్తులకు మాత్రమే లభిస్తుంది. అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. 


సాధారణంగా స్వామివారిని పుష్పాలతో, ఆభరణాలతో, పట్టువస్త్రాలతో అలంకరణ చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక సేవ సమయంలో మాత్రం ఇవేమీ లేకుండా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. అది శ్రీవారి భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవచ్చు. 1980 కి పూర్వం స్వామి వారికి ఇప్పటిలా ప్రతి శుక్రవారం నూతన మేల్‌ చాట్‌ వస్త్రంతో అలంకరణ జరిగేది కాదు. 


ఏడాదికి నాలుగు సందర్భాలలో మాత్రమే స్వామివారికి నూతన పట్టువస్త్రాలను సమర్పించేవారట. దీనితో ప్రతి శుక్రవారం నూతన పట్టువస్త్రాన్ని స్వామి వారికి సమర్పించాలని అప్పటి ఈవో పీవీఆర్‌ కే ప్రసాద్‌ తలచారట. ఇది టీటీడీకి ఆర్థికంగా కాస్త భారమైన అంశం కావడంతో భక్తుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారట. అప్పట్లోనే స్వామివారి అలంకరణకు వినియోగించే వస్త్రం విలువ ఎనిమిదివేల రూపాయలు కావడంతో టీటీడీ నూతనంగా 8 వేల రూపాయలు చెల్లించిన భక్తులు పాల్గొనేందుకు మేల్‌ చాట్‌ వస్త్రం టికెట్లను ప్రారంభించింది. మేల్‌ చాట్‌ వస్త్రం టికెట్లు కలిగిన భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు అత్యంత సమీపం నుంచి స్వామివారి అభిషేక దర్శనం వీక్షించగలుగుతారు. 

ఈ సేవను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలో ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు మాత్రమే ముందుకు వచ్చే సంప్రదాయం ఉండగా అటు తర్వాత క్రమంగా మేల్‌ చాట్‌ వస్త్రానికి ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది. ఎంతలా అంటే ఒకదశలో మేల్‌ చాట్‌ వస్త్రాన్ని ముందస్తుగా కొన్ని సంవత్సరాల ముందుగానే భక్తులు కొనుగోలు చేసేవారు. ఒకే కుటుంబానికి చెందిన వారే కొన్ని వందల టికెట్లను కొనుగోలు చేయడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. దీంతో ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఒక టికెట్‌నే పరిమితం చేస్తూ మిగిలిన టికెట్లను రద్దు చేసి వాటిని లక్కీడిప్‌ విధానంలో భక్తులకు కేటాయించే విధానాన్ని టీటీడీ 2009 నుంచి ప్రారంభించింది. (క్లిక్ చేయండి: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top