ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం | Yamuna Pushkaralu 2026 Sacred River Festival June 2-13 | Sakshi
Sakshi News home page

ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం

Jun 2 2026 10:20 AM | Updated on Jun 2 2026 10:23 AM

Yamuna Pushkaralu 2026 Sacred River Festival June 2-13

దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.

యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!
పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. 

జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.

భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,

తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.

ఎక్కడ స్నానమాచరించాలి ?
యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.

మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.

యమునోత్రి:  యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.

ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిది

ఏయే దానాలు చేస్తే మంచిది ?
పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.

పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.

పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. 

ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.

పుష్కర స్నాన మహత్యం
నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. 

(చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.)

Advertisement
 
Advertisement
Advertisement