
విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువెత్తు సాక్ష్యం కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రం. హంపిలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి విట్టల దేవాలయం. 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వారసత్వ సంపద, సంస్కృతీ విశేషాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేశారు కనుక దీన్ని జయ విట్టల ఆలయం అని కూడా పిలుస్తారు. విట్టలను విష్ణువు అవతారం అని అంటారు.
ఆర్కిటెక్చర్, డిజైన్ విజయనగర ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. సైన్స్‌కు కూడా అంతుచిక్కని అద్భుతాలకు నిలయం. ద్రావిడ నిర్మాణ శైలితో, విస్తృతమైన అలనాటి కళాకారుల ప్రతిభతో అపురూపంగా చెక్కిన శిల్పాలను చూసినపుడు తనువు రోమాంచిత మవుతుంది. ఇక్కడున్న మహా మండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, రాతి రధం వంటి వాటిల్లో కళావైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా చేతితో (గంధపు చెక్కలతో) మీటగానే సప్త స్వరాలను పలికించే సంగీత స్తంభాలు ఇలా ఒకదానికొకటి సందర్శకులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అయితే దీన్ని ప్రత్యేకతను రక్షించే చర్యల్లో భాగంగా టూరిస్టులు ఈ స్థంభాలను తాకడానికి వీల్లేదు. దీనికి బదులుగా ఇక్కడ స్వరాలను వినాలనుకుంటే, దానికి వీలుగా ఆయా స్థంభాల వద్ద క్యూఆర్ కోడ్‌లుంటాయి. వాటిని మన మొబైల్ ద్వారా స్కాన్ చేసి సంబంధింత సంగీత స్వరాలను వినే వెసులుబాటు ఉంది.
అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందా రండి. అంతటి విశిష్టమైన ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు అక్కడి అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విట్టల ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంనుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. దీనికి పర్యాటకుల కోసం కాలుష్యరహిత వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మాత్రమే పర్యాటలకు విట్టల దేవాలయ సమీపానికి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా పొల్యూషన్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు.

సారథులంతా మహిళలే
అయితే ఈ వాహనాలకు అందరూ మహిళా డ్రైవర్లే ఉండటం మరో ప్రత్యేకత. టూరిస్టులను విట్టల ఆలయానికి వద్దకు తీసుకెళ్లి, మళ్లీ తీసుకు వచ్చే బాధ్యత ఈ మహిళా డ్రైవర్లదే. సందర్శకులను తీసుకెళ్లి దింప, మళ్లీ వచ్చేటపుడు తిరుగు ప్రయాణంలో ఉన్నవారిని బయటికి తీసుకు వస్తారు. అలా సందర్శకుల రద్దీని నివారించే ఏర్పాటు కూడా అని చెప్పవచ్చు.ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లను సాక్షి. కామ్ పలకరించింది. వారి అనుభవాల గురించి ముచ్చటించింది. గతరెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని వెల్లడించారు. తమకు ముందుగా శిక్షణ ఇచ్చి మరీ ఈ ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఎనిమిది గంటల డ్యూటీ ఎంతో సరదాగా గడిచిపోతుందని చెప్పారు. నిత్యం ఎంతోమంది సందర్శకులను, చాలామంది విదేశీ పర్యాటకులను చేరవేస్తూ ఉంటామని, వారి ఆనందం చూస్తే తమకు చాలా సంతోషంగా ఉంటుందని, నిజానికి చాలా గర్వంగా కూడా ఉంటుందని చెప్పారు. అలాగే టూరిస్టులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడతామన్నారు.
