
భారతీయ మహిళకు ఇంటా, బయటా మోయలేనంతగా రెండింతల పని భారం ఉంటోందని తాజాగా విడుదలైన ‘టైమ్ యూజ్’ సర్వే వెల్లడించింది. ఎక్కువ చదువుకున్న, సంపన్నులైన మహిళలు సైతం ఈ విషయంలో మెరుగ్గా ఏమీ లేరని కూడా వ్యాఖ్యానించింది. పురుషులు జీతం వచ్చే పనికి బయట ఎంత సమయం వెచ్చిస్తున్నారో, అంతకుమించిన సమయాన్ని మహిళలు జీతం రాని పనికి ఇంట్లో వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది.
భారత ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఒ.) 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘టైమ్ యూజ్’ సర్వేలో – రోజువారీ పనులకు స్త్రీలు, పురుషులకంటే రెండింతలు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే కోసం ఎన్.ఎస్.ఒ. 1,67,000 మందిని కలిసి వివరాలు సేకరించింది.
శ్రమలో అసమానతలు
ఉద్యోగం, నిద్ర, ఆహారం, విశ్రాంతి మొదలు.. చదవటం, షాపింగ్, వంట పని వంటి 165 రోజువారీ పనులకు స్త్రీ పురుషులు వెచ్చించిన సమయాన్ని సర్వే నమోదు చేసింది. పురుషులు, మహిళలు నిద్రించడానికి దాదాపు సమాన సమయాన్ని వెచ్చిస్తుండగా, సగటు స్త్రీ, సగటు పురుషుడు బయట నలుగురితో కలిసి గడిపే దాని కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తోంది.
నిద్రను మినహాయిస్తే, పురుషులు ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పనులలో రోజుకు సగటున గ్రామాలలో 4.6 గంటలు, పట్టణ ప్రాంతాలలో 5.3 గంటలు వెచ్చిస్తున్నారు. ఆ తరువాతనైనా వారికి విశ్రాంతి లభిస్తోంది. లేదా బయటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాని మహిళల్లో ఇంటి పనులు సుదీర్ఘంగా ఉంటున్నాయి.
ఈ ధోరణి శ్రమ చేయటంలో స్త్రీ పురుష అసమానతల్ని స్పష్టంగా చూపిస్తోంది. 2024–25లో దేశంలో 15ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 41.7 శాతం ఉండగా, పురుషులలో ఈ శాతం 78.8 వరకు ఉంది. తక్కువ జీతం, తక్కువ అవకాశాలు స్త్రీలు ఉద్యోగం చేయటానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.
రెండింతల రెట్టింపు పని
మహిళలు విద్యలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా, ఉద్యోగాలలో పెద్దగా ప్రయోజనం పొందటం లేదు. జీతం ఉన్న పని, జీతం లేని పని రెండింటినీ కలిపి, విద్యాస్థాయి లేదా సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు.
నిరక్షరాస్యులైన మహిళలు సగటున రోజుకు 103 నిమిషాలకు పైగా జీతం ఉన్న ఉపాధి పనులకు, 281 నిమిషాలకు పైగా జీతం లేని పనికి వెచ్చిస్తున్నారు. డిగ్రీ ఉన్న మహిళలు సైతం ఉపాధి కోసం 106 నిమిషాలు, జీతం లేని పనికి చాలా ఎక్కువగా 323 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఇది పురుషులు చేస్తున్న శ్రమ కంటే చాలా ఎక్కువ.
నేటికీ నెమ్మదిగానే పురోగతి
అనేక విద్యా స్థాయులలో బాలురు, పురుషుల కంటే బాలికలు, మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉద్యోగావకాశాలలో మహిళలింకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు తరచుగా వారిని ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంచుతున్నాయని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న విషయమే.
కాగా 2023 నోబెల్ గ్రహీత క్లాడియా గోల్డిన్, 200 సంవత్సరాల అమెరికా ఉద్యోగ రంగ డేటాను అధ్యయనం చేసి... వేతనం లేని పని భారం, ముఖ్యంగా మాతృత్వం... ఉపాధి అవకాశాలలో లింగ భేదాలకు దారి తీసిందని తెలిపారు. గర్భనిరోధక మాత్రల లభ్యత, సేవా రంగ ఉద్యోగాల ఆవిర్భావం కారణంగా పరిస్థితి కొంత మెరుగవటం కూడా క్లాడియా గమనించారు. అయితే, భారతదేశంలో ఈ పురోగతి ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది.
∙∙
కాస్త బ్రేక్ తీస్కో తల్లీ!
సినిమా మధ్యలో ‘విశ్రాంతి’ పడుతుంది, ప్రేక్షకుల రెస్ట్ కోసం. యుద్ధం మధ్యలో ‘కాల్పుల విరమణ’ ఉంటుంది, సైనికుల రెస్ట్ కోసం. ఆఫీస్‌లలో చిన్న చిన్న బ్రేక్‌లు ఉంటాయి, ఉద్యోగుల రెస్ట్ కోసం. ‘‘ఎటూ కదలకండి’’ అని డాక్టర్‌లు సలహా ఇస్తారు. పేషెంట్‌ల రెస్ట్ కోసం. డాక్టర్లే కాదు, ఒక పనిలో అదే పనిగా ఉండిపోతే, మన శరీరం కూడా మనకు రెస్ట్ సిగ్నల్ కొడుతుంది.
‘‘కాస్త ఆగు తల్లీ’’ అంటుంది. కానీ మనం ఆ సిగ్నల్స్‌ను పట్టించుకోం. పని పూర్తి చేసేస్తే ఒక పనైపోతుంది అనుకుంటాం. మన ఆలోచన ఏమిటంటే, పనిని మధ్యలోనే వదిలేయటం ఎందుకని? ఆలోచన మంచిదే కాని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పని మధ్యలో రెస్ట్ అవసరం అయినప్పుడు పనిని మధ్యలోనే కదా వదిలేయాలి అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... మహిళలకు చెబుతున్నారు.
రెస్ట్ తీసుకోవటం అంటే?
అలసట నుండి తేరుకోవటానికి రెస్ట్ అవసరం కనుక, అలసట తీరేవరకు పనిని పక్కన పెట్టటమే రెస్ట్ తీసుకోవటం. చేస్తున్న పనిని బట్టి, అప్పటి మీ శారీరక స్థితిని బట్టి కొన్ని నిముషాల రెస్ట్, లేదా కొన్ని గంటల రెస్ట్, లేదంటే కొన్ని రోజుల రెస్ట్ అవసరం అవుతుంది. అయితే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బాడీ, మైండ్ రెండూ రీచార్జ్ అవుతాయని చెప్పలేం. రెస్ట్ ఉంటుంది. ఉత్సాహం ఉండదు.
ఉత్సాహం లేని రెస్టు కూడా మళ్లీ పనితో సమానమే. అందుకే, ముల్లును ముల్లుతోనే తీసినట్లుగా పని వల్ల వచ్చిన అలసటను పనితోనే పోగొట్టుకోవటం అవసరం. అందుకోసం ఏ రకం రెస్టు మనల్ని ఏ రకం అలసట నుంచి కోలుకునేలా చేస్తుందో తెలుసుకోవాలి. ముందు, రెస్టులోని రకాలు ఏమిటో తెలుసుకుంటే, వాటిల్లో ఏ రెస్ట్ మన స్థితికి సరిపోతుందో తెలిసిపోతుంది.
రెస్టులో 7 రకాలు
ఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, సోషల్ రెస్ట్, సెన్సరీ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్, మెంటల్ రెస్ట్ అని ఏడు రకాలైన రెస్ట్‌లు ఉన్నాయి.
ఫిజికల్ రెస్ట్: ఇది శారీరక విశ్రాంతి. చక్కగా నిద్రపోతే సరిగ్గా రెస్ట్ దొరుకుతుంది. ఇందుకు భిన్నంగా యోగా, బాడీనీ స్ట్రెచ్ (సాగతీయటం) వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది. పని కోసం మళ్లీ మనసు పరుగులు పెడుతుంది. ఫిజికల్ రెస్ట్ వల్ల క్రియాశీలం అయ్యే రక్త ప్రసరణ మహిమ ఇది. ఇవి కాక.. మసాజ్, చిన్న చిన్న విరామాలు, వాకింగ్.
ఎమోషనల్ రెస్ట్: ఇది భావోద్వేగ విశ్రాంతి. అంటే మీ కోపాన్ని, అసహనాన్ని, విసుగును, అసంతృప్తిని, ఆందోళనను.. ఆరోగ్యంగా వ్యక్తపరచడం. మీ మనసు లోపలి ఉద్దేశాల గురించి నిజాయితీగా బయటికి చెప్పుకోవటం. అవసరం అయితే సహాయం తీసుకోవటం. ఉద్వేగం మితిమీరకుండా నిగ్రహించుకోవటం. ఇందువల్ల మీకు మానసికమైన విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. ఒంటరిగా సమయం గడపడం, మీ గురించి మీరు శ్రద్ధ వహించటం. డైరీ రాయటం, ప్రకృతిలో గడపటం.
స్పిరిచ్యువల్ రెస్ట్ : ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి. దినచర్యలకు మించి జీవితానికి అర్థం, పరమార్థం కనుగొనే ప్రయత్నం చేయటం. అందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం. హృదయంతో ఆలోచించటం. ఇవన్నీ మనసును తేటపరుస్తాయి. భౌతికమైన ఒత్తిళ్ల నుంచి విశ్రాంతిని చేకూరుస్తాయి. ఇవి కాక.. మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం, ఒక సత్కార్యం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం.
సోషల్ రెస్ట్: ఇది సామాజిక విశ్రాంతి. సానుకూలంగా ఉండేవాళ్లు, మనకు మద్దతుగా ఉండేవాళ్లతో సమయాన్ని గడపటం. అదే సమయంలో అలసట కలిగించే, ఒత్తిడితో కూడిన సంబంధాలకు దూరంగా ఉండటం. మనం సామాజిక జీవులం.
అయినప్పటికీ అంతర్ముఖులకు ఈ సోషల్ రెస్ట్ అలసట కలిగించేది కావచ్చు. అలాంటి వారికి సోషల్ రెస్ట్ వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇవి కాక.. ఒంటరిగా లేదా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం. సోలో పిక్నిక్, టూర్ లేదా ఉన్న చోటే బయటికి వెళ్లి భోజనం చేయడం, మీ ఒంటిపై మీరు ధ్యాస పెట్టటం.
సెన్సరీ రెస్ట్: ఇది ఇంద్రియ విశ్రాంతి. దేదీప్యమానంగా వెలిగే లైట్లు, రణగొణధ్వనులు; టీవీ, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ల వంటి వాటికి దూరంగా, డిమ్ లైట్‌లు, నిశ్శబ్దాల మధ్య పొందే విశ్రాంతి. ఇవి కాక.. కాసేపు కళ్లు మూసుకోవడం, నిశ్శబ్దంగా ఉండే గదిలో సమయం గడపడం, ఎక్కువసేపు స్నానం చేయడం.
క్రియేటివ్ రెస్ట్: సృజనాత్మక విశ్రాంతి. ఇది మీలోని క్రియేటివిటీని తట్టి లేపుతుంది. అలసటకు ఇది దివ్యౌషధం. మెదడుకు మేత వల్ల మీ మనసు పునరుత్తేజితం అవుతుంది. ఇవి కాక.. పని నుండి విరామం తీసుకోవడం, సృజనాత్మకమైన పనులు చేయటం (డ్రాయింగ్, పెయింటింగ్, అల్లికలు మొదలైనవి)
మెంటల్ రెస్ట్: ఇది మానసిక విశ్రాంతి. ఇది మీ మెదడుకు బ్రేక్ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కారం వెతకటం వంటి ఒత్తిళ్ల నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తుంది. ధ్యానం వంటి అభ్యాసాలు లేదా తీవ్రమైన ఏకాగ్రత అవసరం లేని తేలిక పాటి సాధనల్లో పాల్గొనడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. మీ ఫోన్‌ను ఆఫ్ చేయడం, సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండటం.