
దేశవ్యాప్తంగా కేన్సర్ కేసుల్లో కనిపిస్తున్న భిన్న వైఖరి
2015–19 మధ్య నమోదైన గణాంకాల ఆధారంగా తాజా అధ్యయనంలో వెల్లడి
స్క్రీనింగ్ ద్వారా కేన్సర్‌ను ముందే గుర్తించే వీలుండటమే స్త్రీలలో తక్కువ మరణాలకు కారణం
కేన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల వ్యాధి ముదిరి మరణిస్తున్న పురుషులు
మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులే కేసులకు ప్రధాన కారణమంటున్న నిపుణులు
ఈ లెక్కన 2024లో 15.6 లక్షల కేసులు.. 8.74లక్షల మరణాలు నమోదై ఉండొచ్చని అంచనా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కేన్సర్ వ్యాధి కేసులు, మరణాల్లో భిన్న వైఖరి కనిపిస్తోంది. మహిళల్లో కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా పురు షుల్లో మాత్రం కేన్సర్ మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు, మారిన ఆహార అలవాట్లు కేన్సర్ వ్యాధికి ఎక్కువగా కారణమవుతున్నాయి.
2015–2019 మధ్య 43 కేన్సర్ రిజిస్ట్రీల్లో నమోదైన గణాంకాలను విశ్లేషించిన ఓ జాతీయ బృందం ఈ ఆందోళనకర వివరాలను బయటపెట్టింది. దీనిప్రకారం 2015–2019 మధ్య 7.08 లక్షల కేన్సర్ కేసులు నమోదవగా 2.06 లక్షల మరణాలు సంభవించాయి. ఈ లెక్కన 2024లో దేశవ్యాప్తంగా 15.6 లక్షల కేసులు నమోదై 8.74 లక్షల మరణాలు నమోదై ఉండొచ్చని అంచనా వేసింది.
మహిళల్లో ఎక్కువ కేసులు
2012–2022 మధ్య జాతీయ కేన్సర్ రిజిస్ట్రీలు పలు ఆసక్తికర అంశాలను తెరపైకి తెచ్చాయి. మహిళల్లో కేన్సర్ కేసులు పురుషుల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ కేన్సర్ బాధితులు మహిళల్లో ఎక్కువగా ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా మహిళల్లో ఈ కేన్సర్ల కారణంగా మరణాల రేటు తక్కువగా ఉంది. మొత్తం కేసుల్లో మహిళల వాటా 51.1 శాతం. కానీ మరణాల రేటు మాత్రం 45 శాతమే.
దీనికి ప్రధాన కారణం మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్లు. ఇవి స్క్రీనింగ్ ద్వారా ముందే గుర్తించే వీలుండటంతోపాటు ముందస్తుచికిత్సలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు పురుషుల్లో వచ్చే ఓరల్, లంగ్, లివర్, ఉదర, అన్నవాహిక కేన్సర్లు ఆల స్యంగా నిర్ధారణ కావడంతో మరణాలు అధికంగా నమోదవుతు న్నాయని ఐసీఎంఆర్–ఎన్‌సీడీఐఆర్ డైరెక్టర్ ప్రశాంత్ మాథూర్ తెలిపారు.
పొగాకును నియంత్రించకుంటే మరణాలు తగ్గవు..
ళీ కేన్సర్‌పై పోరులో పురుషుల ప్రవర్తననే పెద్ద శత్రువుగా చూడాలి. పొగాకు నియంత్రణలో కఠిన చట్టాలు అమలు చేయకపోతే మరణాలు తగ్గవు. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం 2009–10లో 34.6% ఉన్న పొగాకు వినియోగం 2016–17 నాటికి 28.6%కి తగ్గింది. అయినా కేసులు పెరగడానికి పొగాకు దుష్ప్రభావాలకు 20 ఏళ్ల తర్వాత బయటపడే గుణం ఉండటమే కారణం. అధిక మద్యపానం కూడా నోటి కేన్సర్ భారాన్ని పెంచుతోంది. మద్యం, పొగాకు రెండూ విడిగా కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక కలిపి వాడితే మరింత ప్రమాదం పెరుగుతుంది. – డాక్టర్ ప్రశాంత్ మాథూర్
మరణాలకు కారణం అలవాట్లే..
» పురుషుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కంటే నోటి కేన్సర్ కేసులు ఎక్కువగా నమో దు అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం గుట్కా, జర్దా, బీడీ, సిగరెట్, పొగాకు విని యోగం అలవాట్లేనని అధ్యయనం పేర్కొంది. అలాగే కేన్సర్ లక్షణాలను పురుషులు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల చికిత్స మొదలుపెట్టే సరికే వ్యాధి మూడు లేదా నాలుగో దశకు చేరుకుంటోందని తెలిపింది. దీంతో చికిత్సలు ఫలితం ఇవ్వడంలేదని అధ్య యనం వివరించింది.
పర్యావరణం, జీవనశైలి ప్రభావం
» అయితే దేశమంతా కేన్సర్ కేసుల తీరు భిన్నంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రం మిజోరాం (ఐజ్వాల్)లోని పురుషుల్లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 269.4 కేన్సర్ కేసులు, అరుణా చల్‌ప్రదేశ్ (పపుంపారే) లోని ప్రతి లక్ష మంది మహిళల్లో 227.5 కేన్సర్ కేసులు నమోదవుతుండగా మహారాష్ట్రలోని బర్షీలో మాత్రం అతితక్కువ కేన్సర్ కేసులు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. వాయు కాలు ష్యం, ఆహార అలవాట్లు, జన్యు కారణాలు మొదలైన అంశాల వల్ల ప్రాంతాలవారీ వ్యత్యాసం కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రాంతాలవారీగా కేన్సర్ కేసుల తీరు: (ప్రతి లక్ష జనాభాకు)
హైదరాబాద్: బ్రెస్ట్ కేన్సర్ అత్యధికం (54)
ఐజ్వాల్: సర్వైకల్ కేన్సర్ అత్యధికం (27.1)
శ్రీనగర్: పురుషుల్లో లంగ్ కేన్సర్ అత్యధికం (39.5)
ఐజ్వాల్ మహిళలు: లంగ్ కేన్సర్ అత్యధికం (33.7)
అహ్మదాబాద్: పురుషుల్లో ఓరల్ కేన్సర్ అత్యధికం (33.6)
శ్రీనగర్: ప్రోస్టేట్ కేన్సర్ అత్యధికం (12.7)
ఈస్ట్ ఖాసీ హిల్స్: మహిళల్లో ఓరల్ కేన్సర్ అత్యధికం (13.6)