
ఆత్మదర్శిని : అదే నీ నిజ తత్త్వం
ఆత్మ చాలా బలమైనది. ఆత్మ సహకారంతో ఉన్నప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. వ్యక్తి అనే ముసుగు నుండి, అహంకారపూరితమైన మనస్సు నుండి అతీతంగా ఎదగడం సులభమవుతుంది. అప్పుడు నీవు నీ ఆలోచనలతో, నమ్మకాలతో విడిపడతావు. నీ స్వస్థలమైన ఆత్మను చేరుకుంటావు.
ఒక చేపలమ్ముకునే అమె పూలమ్ముకునే వాళ్ళ ఇంట్లో బస చేయాల్సివస్తుంది. ఆమె చేపలవాసనకు అలవాటుపడి ఉండటం వల్ల ఆ ఇంట్లోని పూలవాసనకు నిద్ర పట్టదు. అప్పుడామె తాను అమ్ముకోవడానికి తెచ్చుకున్న ఎండుచేపల మీద నీరు చల్లి, అప్పుడు వచ్చిన వాసనను పీల్చుకుంటూ నిద్రపోతుంది. అంటే మనం అలవాటుకు బానిసలం కావడం వల్ల అది తప్పు అని తెలిసినా మానుకోము. అందులోనే కూరుకునిపోతాం. అందువల్లే మనిషి దుఃఖం నుండి బయటపడలేక పోతున్నాడు. ఆత్మ వెదజల్లే పరిమళాన్ని కాదని మనస్సుకు బందీయై జీవితమంతా గడిపేస్తున్నాడు.
గత జ్ఞాపకాలను అన్నింటినీ అధిగమించేయాలి. అది ధ్యానం ద్వారానే సులభమవుతుంది. భవిష్యత్తు లేదు, ఊహలు లేవు, లక్ష్యాలు లేవు, సమస్యలు లేవు.... కేవలం ఈ క్షణంలో ఉంటావు. ఆ ప్రస్తుత క్షణానికి ఏ రూపమూ లేదు. అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆత్మానుభవం జరుగుతుంది. అదే నీ నిజతత్వం. అక్కడ వ్యక్తిగా ఉండవు. కొన్ని లక్షల, కోట్ల జన్మలక్రితం ఆత్మ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంకో కోటి జన్మల తర్వాత కూడా అలాగే ఉంటుంది. సష్టి కూడా అలాగే ఉంటుంది. అది కాలానికి అతీతమన్నమాట. అది–అంతం లేవు. ఆ ఆత్మ తత్వంలో నీవు ఉన్నప్పుడు పుస్తక జ్ఞానమే అవసరం లేదు. నీవు చెప్పిందే జ్ఞానమవుతుంది.
– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు