ఒక్క రోజుల్లో ఎంత పనిచేయగలం అంటే..సాధ్యమైనంత ఇంత మేరకు అని చెప్పగలం. అంతేగాని ఏళ్ల తరబడి కష్టపడితేగానీ..సాధ్యం కానీ పనిని ఒక్కరోజుల్లో చేయడం అంటే నో ఛాన్స్ అనేస్తాం. కానీ సుసాధ్యమే అంటున్నాడు ఈ వ్యక్తి. ఏకంగా ఒక్కరోజులో వేలకొద్ది మడ చెట్లను నాటి యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. అతడెవరంటే..
ఆ అనితర సాధ్యమైన ఘనతను సాధించిన 'ఒకే ఒక్కడు' కెన్యాకు చెందిన పర్యావరణ కార్యకర్త ఆంటోయిన్ మోసెస్. ఆయన కేవలం 24 గంటల్లో 47,460 మడ చెట్లను నాటి అరుదైన ఘనత సృష్టించాడు. కెన్యాలో ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న అడవుల పునరుద్ధరణ ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఆయన కెన్యా తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున మడ చెట్లను నాటినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఇంత వేగవంతంగా ఇంత కచ్చితత్వంతో చేయడం నిజంగా ప్రశంసనీయం.
ఎవరీ ఆంటోయిన్ మోసెస్?
ఈ అరుదైన ఘనత కారణంగా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రపంచంలో ఆయన పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఒక ప్రొఫెషనల్ ట్రీ ప్లాంటర్ కమ్ అల్ట్రా-మారథాన్ రన్నర్. భూతాపాన్ని తగ్గించేలా పచ్చదనంతో కళకళలాడేలా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఆంటోయిన్. అంతేగాదు ఆయన రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా.
అయితే ఇది కేవలం వ్యక్తిగత శ్రమను మాత్రమే కాకుండా, జట్టుకృషి, నాయకత్వం, వ్యవస్థీకరణను ప్రతిబింబిస్తోంది. నాటిన ఈ చెట్ల సంఖ్య కంటే అవి పెరగడం వల్ల అంతకుమించిన ప్రభావం ఉంటుందంటున్నారు ఆంటోయిన్. అంతేగాదు కొత్తగా పెరిగిన ఈ మడ అడవులు తీరప్రాంతాల స్థితిస్థాపకతను పెంచడం తోపాటు సముద్ర జీవ ఆవాసాలను, జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు ఆంటోయిన్.
మడ చెట్లు ఎందుకంటే..
మడ అడవులు కీలకమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి. అవి తుఫానుల వల్ల తీర కోతను మరియు తీరప్రాంత ఆస్తులకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను కూడా అధికంగా గ్రహిస్తాయి.
వాటిని అత్యుత్తమ సహజ కార్బన్ సింక్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. కెన్యా వంటి ప్రాంతాలలో మత్స్య సంపదకు, జీవవైవిధ్యానికి మడ అడవులు చాలా ముఖ్యమైనవి. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యానికి,తీరప్రాంత సంరక్షణకు ఇవి అత్యంత కీలకమైనవి.
Most mangrove trees planted by an individual in 24 hours 🌳 47,460 by Antoine Moses 🇨🇦 in Mombasa, Kenya, on 30 April 2026 @antomosplant pic.twitter.com/7fJeIosE7H
— Guinness World Records (@GWR) May 27, 2026
(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ)


