ఈ వారం కథ: రాణి | This week's story of funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: రాణి

Jul 20 2025 8:33 AM | Updated on Jul 20 2025 8:33 AM

This week's story of funday

గాలికి ప్రాణం పోయినట్లు, చెట్లన్నీ ఉరేసుకున్నట్లు, చడీ చప్పుడు లేదు. ఒక్కటే ఉక్కబోత! ఏం చెప్పాలా? ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తూ ఉక్కబోతలో నిద్రపట్టక మేడ మీదకి వచ్చేశాను.పెచ్చులూడిపోయిన గచ్చు ఎండకు సలసల కాగి అర్ధరాత్రి అయినా చల్లారలేదు. కాని, శరీరానికి ఇవేమీ పట్టినట్లు లేదు. చెమటకు తడిసి ముద్దయిపోయిన బనియన్‌ తీసి, జాజిమల్లి తీగ మీద వేస్తుంటే తీగ చాటున దాక్కున్న చంద్రుడు మేఘాలతో దోబూచులాడుతున్నట్లు, వచ్చీరానట్లున్న వెన్నెల చీకటితో సరసమాడుతున్నట్లు అనిపించింది.

మా అమ్మకు ఆడపిల్లలు లేకపోయినా అన్ని రకాల పూలమొక్కలు పెంచేది. కొంచెం తీరుబడి దొరికితే చాలు మొక్కలన్నింటికీ నీళ్ళు పోసి ముస్తాబు చేసేది. కాని, రోజూ పూలు కోసుకోవడానికి వచ్చే పిల్లలు, ‘‘నేను ముందంటే నేను ముందని; ఈ పువ్వు నాదంటే ఆ పువ్వు నాదని, ఇల్లు పీకి పందిరేసేవారు. ఎప్పుడైనా కోపమొచ్చి, ‘‘ఎందుకమ్మా ఇవన్నీ!’’ అని అంటే,‘‘మీ నాన్నగారిని ఈ పువ్వుల్లో , పిల్లల నవ్వుల్లో చూసుకుంటున్నాను రా!’’ అనేది పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. అప్పటి నుంచి మొక్కలకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాను నేను కూడా!మా నాన్నగారికి ప్రకృతన్నా, ప్రశాంతతన్నా చాలా ఇష్టం. అప్పట్లో అందరూ వద్దన్నా, ఊరికి దూరంగా ఈ కొండ అంచున ఇల్లు కట్టారు. చాలాకాలం మా ఇరుగు పొరుగుగా ముళ్ళ కంచెలే ఉండేవి. 

కాని, తరువాత దగ్గరలో పరిశ్రమలు రావడం వలన కార్మికులు ఒక్కొక్కరుగా వచ్చి స్థిరపడ సాగారు. ఒకట్రెండు ఇళ్లు ఉండే గ్రామం నేడు నిండుకుండలా తొణికిసలాడుతోంది. అలా పెరిగిన జనాభా అవసరాల కోసం ఈ ఊర్లో అధికార్లు ఓ చిన్న పోస్టాఫీసు కూడా పెట్టారు. అలా మా నాన్నగారు చాలా కాలం తపాలా శాఖలో బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌గా పనిచేసి, ఒక రోజు ప్రమోషన్‌ తీసుకుని దేవుడి దగ్గరకి బదిలీమీద వెళ్ళిపోయారు, కనీసం మాటైనా చెప్పకుండా!నేను ఇలా అటు ఇటు తిరగడానికి కారణం లేకపోలేదు. ఆమె పేరు రాణి. మనుషుల మధ్యలో దేవతలా, రాజ్యాన్ని కోల్పోయి అజ్ఞాతంలో ఉన్న రాకుమారిలా ఉంటుంది.నేను ఎంసీఏ చేసి ‘క్యాట్‌’ పరీక్షకు సిద్ధమవుతున్న రోజులవి. విదేశాల్లో స్థిరపడాలని, మేఘాల్లో తిరగాలని ఆకాశానికి నిచ్చెన వేస్తున్న వయస్సు అది. నాన్న లేని నన్ను అమ్మ ఏ లోటు రాకుండా పెంచింది.

మా వీధి బోసిపోయింది రెండు రోజుల నుంచి. ఎప్పుడూ గలగలమని నవ్వుతూ తుళ్ళుతూ మా ఇంటి పక్కన ఉండే రాణి రెండు రోజుల నుంచి బయట కనిపించలేదు.  భోజనం చేస్తుంటే అమ్మ అంది ‘‘రాణి ఒక్క మార్కులో పరీక్ష తప్పిందంటరా! ఆ ఒక్క మార్కు వేస్తే వాడి సొమ్మేం పోయేదో’’ అంటూ ఆడగని సమాచారం ఇచ్చి, ‘‘ఓసారెళ్ళి చూసి రారా!’’ అని ముక్తాయింపు ఇచ్చింది.అమ్మ చెప్పిందని పక్కింటికెళితే, అమ్మ పాడిన పాటే పాడుతోంది రాణి. ‘‘ఒక్క మార్కులోనే పోయిందమ్మమ్మా! నేను చాలా బాగా రాశాను. నా మార్కులు ఎవరికో వేసేశారు’’ అని అమాయకంగా అంటుంటే, నిజంగానే ఒకరి మార్కులు ఇంకొకరికి వేసేస్తారేమో! అనిపించింది ఆ ఏడుపు చూసి. ఇంతలోనే మా అమ్మ వచ్చి, ‘‘మీరేమీ బాధపడకండి బామ్మగారు.

 ఒక్క మార్కులో పోయిందంటే మీ మనవరాలు తెలివైనదే అయ్యి ఉంటుంది. మా అబ్బాయి ట్యూషన్‌ చెబుతాడులే!’’ అని భరోసా ఇచ్చేసింది. ఆ భరోసా నా జీవిత కాలానికి సరిపడే పాఠాలు నేర్పింది. ఏ బాధ్యత లేని నాకు ఇప్పుడు రాణి ఒక బాధ్యతై కూర్చుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పరీక్ష పాస్‌ కాకపోతే ‘‘నాకు లెక్కలు బాగా వచ్చు’’ అనే పేరు మొత్తం ఎగిరిపోతుంది. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. మా అమ్మ ఇచ్చిన మాట కోసం, ముఖ్యంగా నా పరువు కోసం నెల రోజుల నుంచి రాణికి లెక్కలు చెబుతూనే ఉన్నాను.‘‘నా ఓపిక అయిపోయింది బాబూ! నా మనవరాలు పరీక్ష గట్టెక్కితే అంతే చాలు’’ అంటూ రాణి వాళ్ళ అమ్మమ్మ సుప్రభాతం మొదలుపెట్టేది ప్రతిరోజూ. 

నాకు వినీ వినీ విసుగొచ్చేసింది. రాణి ఈ పరీక్ష పాసైతే ఇక పైచదువులు వాళ్ళ మావయ్యే పట్నంలో చదివించుకుంటాడట! ఆవిడ సుప్రభాత సారాంశం ఇది. నా ప్రిపరేషన్‌ పక్కనపెట్టి, ఎన్నో మోడల్‌ పేపర్స్‌ తయారు చేసి, రాణితో చేయించేవాడిని. రాణికి కూడా ఓపిక ఎక్కువ. ఆలస్యమైనా ప్రతీ లెక్క చేసి చూపించే ఇంటికి వెళ్ళేది.‘‘సప్లిమెంటరీ ఫీజు కట్టేశాను సార్‌!’’ అంది ఒకరోజు. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ నాలో టెన్షన్‌ పెరిగిపోయింది కాని, రాణి ఎప్పటిలా ప్రశాంత వదనంతో సుభిక్షంగా ఉన్న రాజ్యానికి రాణిలా కనిపించేది. రాణి ఆలోచనలు, మాటలు వింటే తత్త్వం చక్కగా బోధ పడుతుంది. జీవితం పట్ల అవగాహన, భవిష్యత్తు పట్ల ఆమె ఆలోచనలు ఆమెపై లోలోన గౌరవం పెంచేవి. ఈరోజు ఉదయం రాణి చాలా కొత్తగా కనబడింది. 

ఎప్పుడు చలాకీగా ఉండే రాణి ఈ రోజు సిగ్గుపడుతూ, ‘‘మీకో విషయం చెప్పాలని ఉంది సర్‌’’ అంది. మహారాణే వచ్చి వరం ఇస్తానంటే ఎవరూ కాదంటారు!‘‘సరే, చెప్పు అయితే’’ అన్నాను. ‘‘సాయంత్రం చెబుతాను సర్‌’’ అంది.ఎందుకో తెలియకుండానే నాలో రాణి పట్ల ఆరాధన భావం ఏర్పడింది. ఆమె నడవడికను చూస్తే ఆమెను ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో! నాలో ఆతృత అనే ఒక భావన ఇంతలా పనిచేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎక్కడికీ వెళ్లాలి అనిపించలేదు. రాణిలాంటి అమ్మాయి ఎక్కడో కాని ఉండదు. ఎప్పుడోగాని పుట్టదు. జీవితంపై స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంది. క్యాట్‌ ప్రిపరేషన్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి జీవితంలో స్థిరపడాలని మొదటిసారి అనిపించింది. చదువే లోకంగా ఉన్న నాకు ఉద్యోగం సాధించడం ఎప్పుడూ కష్టమనిపించలేదు. మొదటిసారి అందంగా కనిపించాలనిపించింది.రాణి కోసం ఎదురు చూస్తున్నాను. రోజు ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. రాణి రాలేదు కాని, రాణి చెలికత్తె వచ్చింది. 

నాలుగు మడతలు పెట్టి ఉన్న ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టి, అంతలోనే మాయమైపోయింది. చదవడానికి చేతులు వణుకుతున్నా ఊహించిందే ఉంటుందనే నమ్మకంతో చదవడం మొదలు పెట్టాను, మెట్ల పైన కూర్చుని. ఏం చెప్పబోతోందా అనే కుతూహలం నరనరాన్ని పట్టి ఊపేస్తోంది.‘‘సార్‌ నమస్కారం!ఒక్క రూపాయి ఆశించకుండా మీ సొంత సమయాన్ని నా కోసం వెచ్చించి, ఇచ్చిన మాట కోసం మీ లక్ష్యాన్ని కూడా పక్కనపెట్టి, నా భవిష్యత్తు కోసం ఇంతలా కష్టపడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు అపార గౌరవం కలుగుతోంది. మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మమ్మే నాకు సర్వస్వం. అమ్మమ్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందరూ అనుకున్నట్లు నాకు లెక్కలు రాకో, చదువు మీద ఆసక్తి లేకనో నేను ఫెయిల్‌ కాలేదు. నేను పాస్‌ అయితే అమ్మమ్మ నన్ను మావయ్య దగ్గరికి పంపేస్తుంది. 

మా అమ్మా, నాన్న పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన దగ్గర నుండి నేనే సర్వస్వం అనుకుని పెంచింది. నేను పట్నం పోతే చదువు, ఆపై పెళ్లి అంతే కదా సర్‌! ఆడపిల్ల బరువు ఎంతకాలం ఉంచుకుంటారు ఎవరైనా! నేను వెళ్ళిపోతే నేనే ప్రాణం అనుకుని బ్రతికే అమ్మమ్మ పరిస్థితి ఏమిటి సార్‌? ఏ తోడు లేకుండా ఒంటరిగా తన చివరి రోజులు గడపాల్సిందేనా? అందుకే కావాలనే ఫెయిల్‌ అయ్యాను.అమ్మమ్మ కన్నా నా భవిష్యత్తు, ర్యాంకు గొప్పగా అనిపించలేదు. మీరు చెప్పే పాఠాలు రానట్లు నటించినందుకు ఏమీ అనుకోకండి. మీరు చాలా మంచి ఉపాధ్యాయులు అవుతారు. ఎలాగైనా మీరే మా అమ్మమ్మను ఒప్పించి, మావయ్య దగ్గరికి పంపే ప్రయత్నాన్ని మాన్పించండి. మీరు ఒప్పిస్తే ఈసారి పాస్‌ అయ్యి, దగ్గర్లోని కాలేజీలో చేరుతాను. అమ్మమ్మతోనే ఉంటాను ప్లీజ్‌.ఇట్లురాణి ’’నా నడినెత్తికెక్కిన మత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. 

జీవితాన్ని కాచి వడబోసిన దానిలా ఉత్తరం రాసింది. అక్షరాలు మనస్సుకు గుచ్చుకున్నాయి. నేను వేసుకున్న కొత్తబట్టలు చూసి నాకే సిగ్గేసింది. తను నిజంగా రాణే అయ్యుంటే తన రాజ్యంలో ప్రజలకు అసలు కష్టాలు తెలియనిచ్చేదా అనిపించింది, తన మాటలు వింటే. నా ఊహలకి తాళం వేసి వాళ్ళ అమ్మమ్మకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ మేడ మీద అటూ ఇటూ తిరుగుతున్నాను. నిద్రకొచ్చిన చంద్రుడు మేఘాల్లో జోగుతున్నాడు. నేనేదో రాణికి లెక్కలు నేర్పుతున్నాను అనుకున్నాను కాని, తనే నాకు జీవిత విలువలు నేర్పింది.నా స్వార్థం కోసం నా అందమైన భవిష్యత్తులో నేను తప్ప ఏ తోడులేని అమ్మ స్థానం ఏమిటో ఆలోచించలేదు. బంధాలకు రాణి ఇచ్చే విలువ, నలుగురి అభ్యున్నతి కోసం పాటుపడాలని అప్పుడప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గీతోపదేశంలా చెవిలో గింగుర్లు తిరుగుతున్నాయి. రాణి తల్లిదండ్రులు ఉద్యమంలో చనిపోయారంటే మొదట్లో నమ్మబుద్ధి కాలేదు. 

కాని, ఇప్పుడు అర్థం అయ్యింది. అసలు ఈ అభ్యుదయ భావాలన్నీ ఆమెకు తల్లిదండ్రుల నుండే వచ్చాయని!అమ్మ నా కోసం ఇంకా మెలకువగానే ఉంది. ఆలోచనలలో పడి అమ్మ గురించి పట్టించుకోలేదు. అమ్మ చదువుకోపోయినా చదువు విలువ తెలిసిన వ్యక్తి. నాన్నగారు పోయిన తరువాత బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ ఉద్యోగం ఇస్తానంటే, ‘‘ఛీ! నాకొద్దు’’ అన్నాను. నాన్న ఆ చిన్న జీతంతో అమ్మను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను బాగా చదివించారు. అంతకు మించి నా పేరడిగితే, నా పేరుకన్నా బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌గారి అబ్బాయిని అని గర్వంగా చెప్పుకునేలా బ్రతికారు. ఒక కొడుకుగా అంతకంటే అదృష్టం ఏముంటుంది? మా నాన్నగారు ఈ ఉద్యోగం చేయి, ఆ ఉద్యోగం చేయి అని ఎప్పుడూ చెప్పలేదు. నలుగురికీ సేవ చేయి అని మాత్రం చెప్పారు, తాను చేసి చూపించారు కూడా. 

అర్ధరాత్రయినా, అపరాత్రయినా, ఎవ్వరికీ ‘ఈరోజు కుదరదు, రేపు రండి’ అని చెప్పలేదు. ఆయన గొప్పతనం మనసులో మెదలగానే ఆయన బతికుంటే కాళ్ళకు దణ్ణం పెట్టాలనిపించింది.అమ్మ ఎప్పుడూ నేను పడుకున్న తరువాతే పడుకుంటుంది. నాకన్నా ముందే లేచి, అన్నీ సర్దిపెడుతుంది.వేగంగా మెట్లు దిగి అమ్మని అడిగా, ‘‘అమ్మా! నీకు ఏమిష్టం?’’ అని. నిద్ర కళ్ళతోనే చెప్పింది, ‘‘నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి కన్నా, అది చాలు నాకు ఇంకేం అక్కర్లేదు’’ అని.దుఃఖం పొంగుకొచ్చింది మనసులో. ఏ తల్లి అయినా కోరుకునేది అదే కదా! రాణి చేసింది కూడా అదే. వాళ్ళ అమ్మమ్మకి తోడుగా వుండటం కంటే పట్టణాల్లో చదువులు గొప్ప కాదనుకుంది.ఎప్పటికైనా రాణి రాణే కదా!నాన్న చూపిన బాటలో బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ ఉద్యోగానికి అప్లై చేయడానికి బయలదేరాను, అమ్మ కళ్ళల్లో సంతోషం చూస్తూ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement