ఔషధవనంలో అపురూప ఆలయం | Wanaparthy Tirumalayya Gutta temple history and interesting facts | Sakshi
Sakshi News home page

Wanaparthy: భక్తుల కొంగుబంగారం.. తిరుమలనాథస్వామి

Jul 26 2025 7:10 PM | Updated on Jul 26 2025 7:10 PM

Wanaparthy Tirumalayya Gutta temple history and interesting facts

తిరుమలయ్యగుట్టపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువైన స్వామి

వనపర్తి చిట్టడవిలో.. ఆహ్లాదకర వాతావరణంలో ఆలయం

సంస్థానాధీశుల కాలంలో 300 ఏళ్ల క్రితం విగ్రహాల ప్రతిష్ట

ఎత్తయిన కొండపై సహజసిద్ధమైన కోనేరు

శ్రావణమాసంలో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు

వనపర్తి జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని చిట్టడవిలో.. ఎత్తయిన కొండ శిఖరంపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరిన తిరుమలనాథస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రాంత ప్రజలు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవి తల్లిని నమ్ముకున్న ముదిరాజ్‌లు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రహదారిలో.. 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.

ఆలయ చరిత్ర 
శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తయిన కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల అడుగుల ఎత్తులో విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు (నీటి కొలను) ఉండటం చూశారు. శిఖరాగ్రాన స్వామివారిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని.. ఏకశిలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసినట్లు చరిత్ర కథనం. ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయ ధర్మకర్తలుగా, పెద్దగూడెంలోని ఓ ముదిరాజు కుటుంబాన్ని పూజలు చేసేందుకు నియమించారు. నాటి నుంచి నేటివరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

తాటిచెట్టు మెట్ల నుంచి.. 
మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెబుతారు. 1993 ప్రాంతంలో దాతల సహాయంతో ఇనుప మెట్లను, ఇటీవల కాంక్రీట్‌ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెంలోని కోదండరామస్వామి ఆలయాలతోపాటు తిరుమలనాథస్వామి ఆలయాల్లో సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ట చేయించి పూజలు చేసేవారని స్థానికులు పేర్కొంటారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హయాంలో తారురోడ్డును నిర్మించారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 
నడిపిస్తోంది.

ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.. 
తిరుమలనాథస్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు (Medicinal Plants) ఉన్నట్లు గుర్తించారు. ఏటా శ్రావణ మాసంలో పచ్చని చెట్లు, ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటు.. చేతికి అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం మంతమ్రుగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, జాతరను తిలకించి.. ప్రకృతిని ఆస్వాదిస్తారు.

సుదూర ప్రాంతాల నుంచి.. 
వనపర్తికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన తిరుమలనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాతోపాటు గద్వాల, మహబూబ్‌నగర్, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక ప్రాంతవాసులు.. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు.

తొలి శనివారం.. 
శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం తిరుమలనాథస్వామి గుట్టపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి, అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తులతోనే కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి విశేషం.

చ‌ద‌వండి: ఈ జ‌ల‌పాతాల‌కు చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement