‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవం తోపాటు సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా మే10న బెంగళూరులో అట్టహాసంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నెలరోజుల పాటు ఘనంగా జరిగాయి. శుక్రవారం( మే 29, 2026న) ఈ కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకి భారత ఉపరాష్ట్రపతితోపాటు పలువురు విశిష్ట అతిథులు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ యువత అభివృద్ధి, వ్యవసాయోపాధి, స్థిరత్వం, చైతన్య అధ్యయనాలు, విద్యకు సంబంధించిన ఐదు ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ సేవలకు గుర్తుగా స్మారక తపాలా స్టాంపును ఆవిష్కరించారు. ఈ వేడుకకు 678 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధకృష్ణన్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాన్ని అనేక ఖండాలపై లక్షలాది మంది జీవితాలను తాకిన గొప్ప దృష్టికోణాన్ని జరుపుకునే రోజుగా అభివర్ణించారు. మొత్తం 182 దేశాల్లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు.
గురుదేవ్ రవిశంకర్ జ్ఞానం, అవగాహన, శాంతి , సామరస్య విలువలతో మానవాళిని ప్రేరేపిస్తూనే ఉన్నారని కొనియాడారు రాధాకృష్ణన్. ఈ మేరకు గురుదేవ్ రవిశంకర్ మాట్లాడుతూ..192 దేశాలు కలిసి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించి..ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఒత్తిడి లేని జీవితానికి ధ్యానం ఒక ప్రాథమిక అవసరమనే అవగాహనను పెంచేందుకు నాంది పలికారన్నారు.
అలాగే ప్రపంచ సామరస్యానికి పిలుపునిస్తూ భయం, ఉద్రిక్తత మరియు ద్వేషం లేని ‘వసుధైవ కుటుంబకం’ — ఒకే ప్రపంచ కుటుంబాన్ని మనం కలగనాలి అన్నారు. ఇక ఈ వేడుకలో ప్రారంభించిన ఐదు కార్యక్రమాలు విద్య, ఆవిష్కరణ, స్థిరత్వం, మానవ అభివృద్ధి ద్వారా సమకాలీన సమాజంలోని అత్యవసర అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
(చదవండి: ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలకు ప్రధాని మోదీ)


