
కడుము గ్రామాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్య
వంశధార పక్కనే ఉన్నా గుక్కెడు నీటికి ఇబ్బంది
చెలమ నీటితో అనారోగ్య సమస్యలు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు: తరాలు మారుతున్నా ఆ గ్రామ ప్రజల తలరాత మారడం లేదు. వంశధార నది నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంత గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్న ఈరోజుల్లో, నది చెంతనే ఉన్నా గొంతెండుతున్న పరిస్థితి వారిది. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుక్కెడు నీటికోసం చెలమ వైపు చూస్తున్నారు మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కడుము గ్రామం ప్రజలు. ఈ గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మహిళలు వంశధార నది వద్దకు వెళ్లి చెలమ నీటిని బిందెల్లో తోడుకొని ఇళ్లకు తీసుకొని వెళ్తుంటారు. నదికి వరదలు వచ్చినట్లయితే చెలమ నీటికి సైతం అవకాశం ఉండదు. అటువంటి సమయంలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉండే ఒడిశా రాష్ట్రంలోని కిడిగాం గ్రామం బోరు నుంచి తాగునీటిని తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్లు నుంచి వచ్చే నీరు తాగేందుకు ఉపయోగపడడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలమ నీటినే తాగడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నా రు. తమ గ్రామానికి సుజల ధార పథకంలో భాగంగా పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం: కడుము గ్రామంలో ఇంటింటా కుళాయిలు వేసేందుకు ఉద్దానం ఫేజ్–2 పథకం నుంచి ని«ధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు త్వరలో చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సాగర్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈఈ, కొత్తూరు మండలం
రెండు కి.మీ నడుస్తున్నాం : గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు తాగేందుకు పనికి రావడం లేదు. దీంతో రానుపోను రెండు కి.మీ నడిచి నది వద్దకు నీటికోసం వస్తాము. వర్షాలు కురుస్తున్నా తాగునీటి కోసం నదికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. – కొల్లారి శ్రీదేవి, కడుము గ్రామం, కొత్తూరు మండలం
పట్టించుకోవడం లేదు : మా గ్రామానికి తాగునీటి కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఊట నీరు కలుషితమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆ నీరే తాగుతున్నాం. గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు బాగులేకపోవడంతో ఊట నీరే మాకు దిక్కవుతోంది. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాట్లు చేయాలి.– లంక పార్వతి, కడుము గ్రామం, కొత్తూరు మండలం
ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
వరదలు వస్తే ఒడిశా వెళ్లాలి{ వర్షాకాలంలో వంశధార నదికి వరద వచ్చినట్లయితే ఊట నీరు ఉండదు. అప్పుడు మా గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం కిడిగాం గ్రామం సమీపంలో ఉన్న బోరు నుంచి తాగునీరు తీసుకొస్తాము. మేము తాగునీటి కోసం పడుతున్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మాకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. – బూరాడ స్వాతి, కడుము గ్రామం