ఉగాది పండుగ సందేశం ఇదే! | Ugadi festival message in Telugu | Sakshi
Sakshi News home page

Ugadi: ఎన్నింటికో ప్రారంభ దినం

Mar 18 2026 7:59 PM | Updated on Mar 18 2026 8:02 PM

Ugadi festival message in Telugu

తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది. పూర్వ కాలంలో దీనినే ‘యుగాది’గా పిలిచేవారు. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే ఈ పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు వస్తాయి. రానున్న సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు.

శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. రుతువుల్లో మొదటిదైన వసంతం మనోహరమైనదీ, ఆహ్లాదకరమైనదీ. వసంత రుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. రామ పట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు.

ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ, ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా, కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకొంటారు.

ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, పరిమళాల పన్నీరుతో కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గురుతులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి. షడ్రుచుల ప్రసాదం కోసం మామిడి పిందెలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి.

అన్ని రుచులు సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తోంది.  సంవత్సరమంతా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పండుగలో ఉంది.

–  నందిరాజు రాధాకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement